శిద్దా మద్దతు ఎవరికి?

ఆంధ్రప్రదేశ్‌లో పార్టీల టిక్కెట్లు దక్కని వారు కొంత ముభావంగా ఉన్నారు. మరికొందరు ఈ రాజకీయాలతో నాకెందుకనే ధోరణిలో ఉన్నారు.

Update: 2024-05-01 12:14 GMT

ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి శిద్దా రాఘవరావు మద్దతు ఎవరికనేది ప్రస్తుతం చర్చగా మారింది. దర్శి వైఎస్సార్‌సీపీ టిక్కెట్‌ ఇవ్వాలని పట్టుబట్టారు. అయితే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మాత్రం టిక్కెట్‌ ఇవ్వలేదు. ఒంగోలు నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయాలని ఆదేశించారు. అందుకు శిద్దా సుముఖత వ్యక్తం చేయలేదు. అందుకు కారణాలు ఉన్నాయి. ఒంగోలు కేంద్రంగా పోటీ చేయాలంటే ఒంగోలు ఎమ్మెల్యే, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మద్దతు కావాలి. శిద్దాకు మద్దతు ఇచ్చేందుకు శ్రీనివాసరెడ్డి భరోసా ఇవ్వలేదు. దీంతో దర్శి టిక్కెట్‌ కోసం ప్రయత్నించి విఫలమయ్యారు.

దర్శి నుంచి మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డికి జగన్‌ టిక్కెట్‌ ఇచ్చారు. గతంలో ఆయన తండ్రి కూడా దర్శి నుంచి గెలిచారు. ఆ తరువాత పోటీకి దూరంగా ఉన్నారు. సుబ్బారెడ్డి చనిపోయిన తరువాత శివప్రసాద్‌ రెడ్డి తల్లి బూచేపల్లి వెంకాయమ్మ ప్రస్తుతం ప్రకాశం జిల్లా పరిషత్‌ చైర్‌ పర్సన్‌గా ఉన్నారు. ఆమె గతంలో చీమకుర్తి ఎంపీపీగా చేశారు. శివప్రసాద్‌రెడ్డికి దర్శి నియోజకవర్గంలో పట్టుంది. గ్రానైట్‌ వ్యాపారి కావడం వల్ల ఆర్థికంగా ఇబ్బందులేమీ లేవనేది పలువురు చెబుతున్న మాట. తెలుగుదేశం పార్టీకి మూడు సంవత్సరాలుగా దర్శి నియోజవర్గంలో ఇన్‌చార్జ్‌ కూడా లేకుండా పోయారు. దీంతో డాక్టర్‌ శివప్రసాద్‌రెడ్డిని వైఎస్సార్‌సీపీ రంగంలోకి దించింది.
కొత్త అభ్యర్థికి అవకాశం ఇచ్చిన టీడీపీ
తెలుగుదేశం పార్టీ గొట్టిపాటి లక్ష్మిని అభ్యర్థిగా రంగంలోకి దించింది. ఈమె నర్సరావుపేటలో పేరున్న డాక్టర్‌. మాజీ ఎమ్మెల్యే గొట్టిపాటి నర్సయ్య కుమార్తె. ప్రస్తుతం ఈమె బాబాయి గొట్టిపాటి రవికుమార్‌ అద్దంకి టీటీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. రవికుమార్‌ చొరవతో లక్ష్మికి టీడీపీ టిక్కెట్‌ వచ్చింది. దీంతో ఆమె ప్రచారంలో దూసుకుపోతున్నారు. దర్శి మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు మద్దతు కూడా ఉంది. పలువురు టీడీపీ వారు ఆమెను అక్కున చేర్చుకున్నారు.
శిద్దా మద్దతు ఎవరికి?
దర్శి మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి శిద్దా రాఘవరావు మద్దతు ఎవరికనేది ఇప్పుడు చర్చకు దారితీసింది. వైఎస్సార్‌సీపీ టిక్కెట్‌ కోసం ప్రయత్నించి భంగపడ్డారు. శివప్రసాద్‌రెడ్డికి టిక్కెట్‌ దక్కింది. ప్రస్తుతం ఆయన వైఎస్సార్‌సీపీలోనే ఉన్నారు. అయితే ఎన్నికలు దగ్గర పడుతున్నా శివప్రసాద్‌రెడ్డికి ఓటు వేయాలని తన అభిమానులకు కానీ, నియోజకవర్గ ఓటర్లకు కానీ చెప్పలేదు. దీంతో శిద్దా రాఘవరావు మద్దతు ఎవరికనేది ప్రశ్నార్థకంగా మారింది. వైఎస్సార్‌సీపీ టిక్కెట్‌ రాకుండా పోయిన సందర్బంలో ఆయన తెలుగుదేశం పార్టీ నేత చంద్రబాబును సంప్రదించారు. టీడీపీ టిక్కెట్‌ వస్తుందని అందరూ ఊహించారు. పార్టీల్లో ఉండే రాజకీయ బెదిరింపుల కారణంగా ఆయన టీడీపీ టిక్కెట్‌ తీసుకుని ముందుకు సాగలేకపోయారనే చర్చ కూడా సాగుతోంది.
వివాదాలు లేని వ్యక్తిగా..
శిద్దా రాఘవరావు ఇప్పటి వరకు వివాదాలకు దూరంగా ఉంటూ వచ్చారు. రాజకీయాల్లోకి వచ్చినా వివాదాల్లో ఇంతవరకు ఇరుక్కోలేదు. ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ నేత చెప్పినట్లు నడుచుకోవడం, లేదంటే వివాదాన్ని పక్కకు నెట్టి తనపనులు తాను చేసుకుపోవడం జరుగుతోంది. శివప్రసాద్‌ రెడ్డితో కూడా శిద్దాకు సన్నిహిత సంబంధాలే ఉన్నాయి. శివప్రసాద్‌రెడ్డి తనను ఆహ్వానించలేదని ప్రచారానికి వెళ్లటం లేదా? నేను ప్రస్తుతానికి ఏ పార్టీకీ మద్దతు తెలపడం లేదనే సంకేతాన్ని వైఎస్సార్‌సీపీకి ఇచ్చారా? అనేది సందిగ్ధంగా ఉంది. శిద్దా మద్దతు శివప్రసాద్‌రెడ్డికి దక్కకుంటే తెలుగుదేశం అభ్యర్థి లక్ష్మి గెలుపుకు దగ్గరయినట్లేనని స్థానికులు చెబుతున్నారు.


Tags:    

Similar News