ఆంధ్రప్రదేశ్‌లో మూడు ఎమ్మెల్సీ స్థానాల ఓట్ల లెక్కింపు ప్రక్రియ సోమవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంతో పాటు ఒక ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి ఫిబ్రవరి 27న ఎన్నికలు జరిగాయి. మూడు ప్రాంతాల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు విశాఖపట్నం ఆంధ్రా యూనివర్శిటీలోను, ఉమ్మడి తూర్పు–పశ్చిమ గోదావరి జిల్లాల పట్ట భద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ఏలూరు సమీపంలోని వట్లూరు సీఆర్‌ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలోను, ఉమ్మడి కృష్ణా–గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు గుంటూరు ఏసీ కాలేజీలోను ప్రారంభమైంది. ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద పటిష్టమైన మూడంచెల భద్రత ఏర్పాట్లు చేపట్టారు. అభ్యర్థులు, ఏజెంట్ల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్‌లను అధికారులు ఓపెన్ చేశారు. మూడు దశల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరగనుంది.
ఉమ్మడి కృష్ణా–గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి 40 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా, వాటిల్లో 10 నామినేషన్‌లు తిరస్కరణకు గురయ్యాయి. మరో ఐదుగురు అభ్యర్థులు తమ నామినేషన్‌లను ఉపసంహరించుకున్నారు. దీంతో 25 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. అలాగే ఉమ్మడి తూర్పు–పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల స్థానానికి 35 మంది, ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి 10 మంది అభ్యర్థిలు పోటీలో ఉన్నారు. తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు చేపట్టారు. వీటిల్లో కూడా చెల్లుబాటు కాని ఓట్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో దాదాపు 2,18,902 ఓట్లు పోలయ్యాయి. మూడు షిప్టులలో 700 మంది సిబ్బందితో ఓట్లను లెక్కిస్తున్నారు. 28 టేబుల్స్, 17 రౌండ్లలో కౌంటింగ్ పూర్తి చేస్తే విధంగా ఏర్పాట్లు చేపట్టారు. ఆంధ్రా యూనివర్శిటీలో ప్రారంభమైన ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కౌంటింగ్ కోసం 20 టేబుళ్లను ఏర్పాటు చేశారు. 100 మంది సిబ్బంది, 200 మంది పోలీసులు, 160 మంది కౌంటింగ్ ఏజెంట్లు కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొన్నారు. మూడు చోట్ల 22,493 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. దాదాపు 92.40 శాతం పోలింగ్ నమోదైంది.
ఈ ఎన్నికల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ దూరంగా ఉంది. మూడు స్థానాల్లోను అభ్యర్థులను బరిలోకి దింప లేదు. మరో వైపు అధికార పక్షమైన కూటమి వర్గాలు ఈ ఎమ్మెల్సీల ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. తెలుగుదేశం, జనసేన, బీజేపీ శ్రేణులు ఈ ఎన్నికల్లో తీవ్రంగా పని చేశారు. ఎన్నికలకు ముందు ఆరు నెలల నుంచే ప్రణాళిక ప్రకారం రంగంలోకి దిగారు. దీనికి తోడు ముందుగానే సీఎం చంద్రబాబు అభ్యర్థులను ప్రకటించడంతో ఓ క్లారిటీతో టీడీపీ శ్రేణులు పని చేశారు. ఓటర్ల పేర్లను నమోదు చేయడం నుంచి వారితో ఓట్లు వేయించుకునేంత వరకు కూటమి శ్రేణులు పట్టు వదల్లేదు. అయితే ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి పక్షమైన బీజేపీ పీఆర్‌టీయు అభ్యర్థి, మాజీ ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులునాయుడుకు మద్దతు ప్రకటించి ఆ మేరకు పని చేశాయి. బీజేపీ, దాని అనుబంధ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు గాదె శ్రీనివాసుల నాయుడు గెలుపు కోసం పని చేశాయి. తక్కిన తెలుగుదేశం, జనసేన శ్రేణులు, ఏపీటీఎఫ్ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్సీ వర్మకు మద్దతు ప్రకటించి ఆ మేరకు పని చేశాయి. యూటీఎఫ్ నుంచి బరిలో నిలిచిన కోరెడ్ల విజయ గౌరికి అనధికారికంగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ సపోర్టు చేసింది. ఇక్కడ ప్రధానంగా రఘువర్మ, గాదె, విజయగౌరీల మధ్య ప్రధాన పోటీ నెలకొంది.
తక్కిన రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో కూటమి అభ్యర్థి, పీడీఎఫ్ అభ్యర్థుల మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. ఉమ్మడి కృష్ణా–గుంటూరు స్థానంలో కూటమి నుంచి బరిలో దిగిన టీడీపీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్, పీడీఎఫ్ నుంచి బరిలో నిలిచిన సిట్టింగ్ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు, ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల స్థానంలో కూటమి నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన రాజశేఖరం, పీడిఎఫ్ అభ్యర్థిగా రంగంలోకి దిగిన డీవీ రాఘవులు మధ్య ప్రధాన పోటీ నెలకొంది. మూడు స్థానాల్లో పోటా పోటీ నెలకొన్నా.. గెలుపు మాత్రం కూటమి బలపరచిన అభ్యర్థుల వైపే ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.