Tirupati stampede | టీటీడీలో మరో వికెట్ ఎవరిది? వైసీపీలో టార్గెట్ ఎవరు

తొక్కిసలాలో తిరుపతిలో మరణమృదంగం రాజకీయంగా కూడా కాకరేపుతోంది. కూటమి, ప్రతిపక్ష వైసిపి మధ్య నిప్పు రాజుకునే పరిస్థితి ఏర్పడింది;

Byline :  SSV Bhaskar Rao
Update: 2025-01-11 05:27 GMT

శ్రీవారి లడ్డు ప్రసాదం కల్తీ వ్యవహారం తేలలేదు. తొక్కిసలాట ఘటన రాజకీయంగా కాక రేపింది. ఇందులో ఎవరిని బాధ్యులు చేయబోతున్నారు? కుట్ర ఉందని హోం మంత్రి ఎందుకన్నారు?

రాష్ట్ర మంత్రులు, టీటీడీ పెద్దలు, పోలీస్ బాస్ మాటలకు పొంతనే లేదు. ఎవరి ధోరణిలో వారు మాట్లాడుతూ, గందరగోళం సృష్టిస్తున్నారు. ఈ ఘటనలో వైసీపీని టార్గెట్ చేసినట్లు భావిస్తున్నారు. మంత్రి చేసిన వ్యాఖ్యాలే ఇందుకు నిదర్శనం. ఇదిలావుంటే...
తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడారని సీఎం చంద్రబాబు రేకెత్తించిన సంచలన వివాదం ఇంకా నలుగుతూనే ఉంది. రాజకీయంగా వివాదం రేకెత్తించిన ఈ ఘటనపై దర్యాప్తు ఇంకా తేలలేదు.
మళ్లీ అదే సీన్
తిరుమల వైకుంఠ ద్వార దర్శనాల నేపథ్యంలో తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు మరణించారు. ఈ వ్యవహారంలో మానవ తప్పిదం, అధికారుల అవగాహన రాహిత్యం, సమన్వయం లేదనే విషయం స్పష్టమైంది. ఇంటెలిజెన్సీ వైఫల్యం ఉందని టిటిడి చైర్మన్ వీఆర్ నాయుడు అన్నారు. మళ్లీ మాట మార్చిన ఆయన ఉద్దేశ పూర్వకంగా జరిగింది కాదన్నారు. రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత కుట్ర కోణం ఉందని అంటున్నారు. ఇందులో పోలీసుల తప్పిదం లేదని పోలీస్ పెద్దలు చెబుతున్నారు. వారి ప్రకటనలను ఒకసారి పరిశీలిస్తే, తిరుమల మరోసారి అధికార టిడిపి కూటమి, వైసిపి రాజకీయ క్రీనీడకు కేంద్రంగా మారబోతున్నట్లే కనిపిస్తోంది. అంతేకాకుండా, దర్యాప్తు వ్యవహారంలోనూ పొంతనలేని, సమన్వయం లేని మాటలే వినిపిస్తున్నాయి.
తిరుపతి తొక్కిసలాట, విషాద ఘటన నేపథ్యంలో గురువారం తిరుపతిలో సమీక్షించిన సీఎం చంద్రబాబు టీటీడీలో ఒక ఐఏఎస్, మరో ఐపిఎస్, తిరుపతి ఎస్పీని బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. తాత్కాలికంగా టీటీడీ ఈవో శ్యామల రావు, అదనపువ్వు సిహెచ్ వెంకయ్య చౌదరిని మందలించి, వదిలేసినట్లు కనిపిస్తోంది. జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పరిస్థితి కూడా అదే. మళ్లీ ఎవరిపై బదిలీ వేటు పడుతుందనే విషయాన్ని కాస్త పక్కకు ఉంచితే..
తిరుమల వైకుంఠ ద్వార దర్శనాల కోసం తిరుపతిలో 8 కౌంటర్లు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. వాటిలో బైరాగి పట్టడం సమీపంలోని రామానాయుడు మున్సిపల్ హై స్కూల్ వద్ద జరిగిన గాయపడి కొందరు, ఊపిరి ఆడక ఇంకొందరు అస్వస్థతకు గురయ్యారు. వారిలో ఆరుగురు ఆసుపత్రుల్లో మరణించిన సంగతి తెలిసిందే. తిరుపతిలో జరిగిన తొక్కిసలాట దుర్ఘటనపై సమీక్షించిన సీఎం చంద్రబాబు అధికారుల మధ్య కనిపించని సమన్వయం, బాధ్యతారాహిత్యంపై మండిపడ్డారు.
రోజుకో మాట..
ఈ సంఘటన జరిగిన బుధవారం రాత్రి తిరుపతి రుయా ఆసుపత్రి వద్ద బాధితులను పరామర్శించిన తర్వాత టీటీడీ చైర్మన్ బి.ఆర్ నాయుడు ఓ మాట అన్నారు.
"ఇంటెలిజెన్సీ వైఫల్యం ఉంది. ముందుగానే పరిస్థితిని అంచనా వేయలేదు. సమస్య గుర్తించలేదు" అని బి ఆర్ నాయుడు చెప్పడం ద్వారా జరిగిన తప్పిదాన్ని పోలీసుల పైకి నెట్టివేశారు. ఇంకో సందర్భంలో రద్దీ సమాచారం ఉందని చెప్పిన ఆయన అధికారులను ఎందుకు అప్రమత్తం చేయలేకపోయారనే ప్రశ్నకు సమాధానం లేదు. శుక్రవారం మరో వ్యాఖ్య చేశారు. "ఉద్దేశ పూర్వకంగా జరిగిన సంఘటన కాదు. ఏర్పాట్లు సరిగ్గా లేని ఒకటి రెండు చోట్ల ఘటనలు జరిగాయి" అని బోర్డు మీటింగ్ తరువాత మీడియాతో అన్నారు.
రాజకీయ రంగు..
తిరుపతిలో జరిగిన తొక్కిసలాట వెనుక కారణాలు ఏమిటని టీటీడీ యంత్రాంగాన్ని కాదు. సామాన్యుడిని కదిపినా చెబుతున్న మాట ఒకటే. అధికారుల నిర్లక్ష్యం. బాధ్యతారాహిత్యం అనే మాటలే వినిపిస్తున్నాయి. 'ఫెడరల్ ఆంధ్ర ప్రదేశ్' ప్రతినిధులు తొక్కిసలాట జరిగిన అనేక కేంద్రాలను సందర్శించారు. అక్కడి పరిస్థితిని అడిగినప్పుడు, సామాన్యులే కాదు. యూనిఫాంలో ఉండే చిన్న స్థాయి ఉద్యోగం కూడా పోలీసుల వైఫల్యాన్ని అంగీకరించారు. కాగా, జరిగిన తప్పు సరిదిద్దుకోలేనిది. ఈ ఘటనను కూడా రాజకీయంగా మలిచి కొందరి టార్గెట్ చేసే పరిస్థితి కనిపిస్తోంది. అందుకు ప్రధానంగా. తొక్కిసలాట, దుర్ఘటన, మృతుల బంధువులను ఓదార్చడం, తిరుపతి రుయా, స్విమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గాయపడిన వారిని పరామర్శించడానికి దాదాపు ఎనిమిది మంది రాష్ట్ర మంత్రులు దిగి వచ్చారు. వారిలో కొందరు వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో దర్శనానికి వచ్చిన వారే ఎక్కువ. అందుకు సాక్ష్యం తిరుపతి ఘటన జరగక ముందే వారి టూర్ ప్రోగ్రాం అధికారికంగా విడుదల చేశారు. అలా వచ్చిన వారిలో రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత గురువారం పద్మావతి ఆసుపత్రి వద్ద ఏమన్నారంటే..
కుట్ర కోణం..
"తొక్కిసలాట వెనక కుట్ర కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నాం" అని రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత స్పష్టంగా ప్రకటించారు. ఇప్పటికే ప్రాథమికంగా ఓ సమాచారం ఉందని హోం మంత్రి చెప్పడం ప్రస్తావనర్హం. ఏది ఏమైనా ఈ ఘటన బాధాకరం ఆవేదన వ్యక్తం చేయడం తోపాటు ఆమె చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా మంటలు రేపినట్లే కనిపించింది. కుట్ర కోణం ఉండవచ్చు అనే సందేహాన్ని కూడా ఆమె వ్యక్తం చేశారు. ఆ దిశగానే దర్యాప్తు కూడా జరుగుతుందని కూడా ఆమె చెప్పారు. తొక్కిసలాట జరిగిన బైరాగిపట్టెడ పాఠశాల, శ్రీనివాసం బుద్ధ జరిగిన ఇంకో ఘటనపై తిరుపతి ఈస్ట్ పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు. ఇదిలా ఉంటే,
కుట్ర ఆరోపణలు కొనసాగింపు
అదే రోజు సాయంత్రం రాష్ట్ర టిడిపి ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య చేసిన వ్యాఖ్యలు హోం మంత్రి సందేహాలకు కొనసాగింపుగానే ఉన్నాయి.
"బైరాగిపట్టెడ వద్ద జరిగిన తొక్కేసలాట వెనక కుట్ర ఉంది" అని వర్ల రామయ్య ఆరోపించారు. "రాష్ట్రంలో వైసిపికి, ఆ పార్టీ నాయకులు ఎలాంటి పని, పాటా లేదు. ఏదో ఒక రకంగా చిచ్చు రేపడానికే ప్రయత్నం చేస్తున్నారు" అని వర్ల రామయ్య వ్యాఖ్యానించారు. "తొక్కిసలాట జరిగిన కేంద్రం వద్ద గాంజా మత్తులో కొంతమంది యువకులు హంగామా చేశారు. టికెట్లు తీసుకోవడానికి గేట్లు తెరిచారు అని వారు కేకలు వేశారు. అప్పుడే యాత్రికులు దూసుకుని రావడంతో ఈ దుర్ఘటన జరిగింది" అని రామయ్య అక్కడ జరిగిన సంఘటనను చూసినట్లుగా వివరించడం ప్రస్తావనార్థం. ఆయనకున్న సమాచారం ఏమిటో చెప్పలేదు. కానీ, "ఈ దారుణం వెనుక వైసీపీ నాయకుల హస్తం ఉంది" అని చెప్పడం ద్వారా తిరుపతి ఘటనను రాజకీయంగా మలుపు తిప్పడానికి అడుగులు వేసినట్లు కనిపిస్తోంది.
ఈ సంఘటనపై టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి స్పందించారు. ఆయన ఏమంటున్నారంటే,
"తొక్కిసలాట జరగడానికి ప్రధానంగా రెండే కారణాలు ఉన్నాయి. అధికారుల మధ్య సమన్వయం లేదు. పరస్పర సహకారం అంతకంటే లేదు. దీనికి పూర్తి బాధ్యత టీటీడీ ఈఓ శ్యామలరావు, అదనపు ఈఓ సీహెచ్. వెంకయ్య చౌదరిదే బాధ్యత" అని కరుణాకరరెడ్డి వ్యాఖ్యానించారు. అవకాశం దొరికితే వైసీపీ నాయకులపై కేసులు నమోదు చేయడానికి ఎక్కువగా ఆలోచన చేస్తున్నారని ఆరోపించారు. కాగా,
ఈ ఘటనపై సీఎం చంద్రబాబు జుడీషీయల్ విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదంలో కల్తీ జరిగిందనే ఆరోపణల నేపథ్యంలో దర్యాప్తు సా.. గుతూనే ఉంది. తొక్కిసలాట దుర్ఘటనలో ఆరుగురు ప్రాణాలు పోవడానికి ఎవరిని బలిపశువులను చేస్తారో? ఏ పార్టీ నేతల మెడకు చుడతారనేది దర్యాప్తులో ఏమి తెలుస్తారనేది వేచి చూడాల్సిందే.
Tags:    

Similar News