'కడప స్టీల్' నిర్మించాల్సిన బాధ్యత ఎవరిది?

కేంద్ర ప్రభుత్వం పూర్తి చేయాల్సిన ప్రాజెక్టు జిందాల్ కు ఎలా అప్పగిస్తారు?;

Byline :  SSV Bhaskar Rao
Update: 2025-05-30 11:22 GMT

రాష్ట్ర విభజన చట్టం ప్రకారం వెనుకబడిన ప్రాంతంలో కడప స్టీల్ కర్మాగారం ప్రస్తావన ఉందని "అభివృద్ధి వికేంద్రీకరణ సాధన సమితి" కెవి రమణ అధ్యక్షుడు గుర్తు చేశారు. ఈ ప్రాజెక్టు నిర్మాణ బాధ్యత జిందాల్ కంపెనీకి అప్పగిస్తున్నట్లు ప్రకటించిన సీఎం ఎన్. చంద్రబాబు నిరాశకు గురి చేశారని ఆయన వ్యాఖ్యానించారు.

కడపలో మూడు రోజుల పాటు నిర్వహించిన టీడీపీ మహానాడు వల్ల వెనుకబడిన ప్రాంతాలకు ప్రధానంగా, రాయలసీమకు ఒరిగిందేమీ లేదని రమణ నిరసన వ్యక్తం చేశారు. "రాయలసీమలో నిర్వహించడం వల్ల ఈ ప్రాంతానికి వరాల జల్లులు కురుస్తాయని ఆశపడ్డ వారికి నిరాశే మిగిలింది" అని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎయిమ్స్ పోయింది..
'అనంత'కు అడియాసే..
సాగునీటి ప్రాజెక్టుల విషయంలో కూడా అనంతపురం జిల్లా ప్రజలకు అడియాసలే మిగిలాయని "అభివృద్ధి వికేంద్రీకరణ సాధన సమితి" అధ్యక్షుడు కెవి. రమణ ఆవేదన చెందారు.
"ఇక్కడి ప్రజల కోరిక మేరకు హంద్రీ-నీవా 11,000 క్యూసెక్కులతో నిర్మించడానికి, రెందో దశలోజరుగుతున్న లైనింగ్ పనులు ఆపి, సవరణలు చేస్తారని ఎదురుచూసిన అనంతపురం జిల్లా వాసులకు నిరాసే మిగిలింది" అని రమణ వ్యాఖ్యానించారు. ఈయన ఇంకా ఏమన్నారంటే..
"గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన గాలేరు-నగరి హంద్రీనీవా, అనుసంధానం కార్యక్రమం ఊసే ఎత్తలేదు. విభజన చట్టం ప్రకారం అత్యంత వెనుకబడిన రాయలసీమలో ఏర్పాటు చేయవలసిన ఎయిమ్స్ ను మంగళగిరికి తరలించారు. ఇక్కడ ఎయిమ్స్ శాఖను, గుంతకల్లు రైల్వే డివిజన్ విస్తరణ, వెనక బడిన ప్రాంతాల ప్రత్యేక ప్యాకేజీ విషయాలపై తీర్మానాలు చేయకపోవడం దారుణం" అని తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.
ఇదేనా డిక్లరేషన్..?
"గోదావరి-బనకచర్ల ను తీసుకొస్తామని గొప్పలు చెప్పుకున్నారు" తప్పితే.. రాయలసీమ పెండింగ్ ప్రాజెక్టులు ఎప్పటి లోగా పూర్తి చేస్తారో దశ దిశ లేదఅని రమణ నిరసన వ్యక్తం చేశారు. సంక్షేమం అయినా ఎన్నికలలో చెప్పిన విధంగా చేస్తారనుకుంటే, ఇప్పటికే అన్నీ చేసేనట్లు, ఇచ్చేసినట్లు తీర్మానాలు చేసేశారని మహానాడు సభలపై ఆయనే విసుర్లు రువ్వారు.
బెస్త కార్పొరేషన్ ఏమైంది?
గీత కార్మికులకు 10 శాతం వైన్ షాపులు, సముద్రతీర మత్స్యకారులకు మత్స్యకార భృతి గత సంవత్సరం ఎగ్గొట్టారని గుర్తు చేశారు. ఈ సంవత్సరం 20 వేలు ఇవ్వడం, అమలు కాని జీవో 217 రద్దు చేశామని సీఎం చంద్రబాబు గొప్పలు చెప్పుకున్నారు. మినహా బెస్త కార్పొరేషన్ పునరుద్ధరిస్తారా లేదా అనే ప్రస్తావనలేదు. అని అన్నారు.
ఉద్యోగులకు ఒకటవ తేదీననే జీతాలు ఇస్తున్నాం, భోగాపురం విమానాశ్రయానికి అల్లూరి పేరు,ఎస్సీ,వర్గీకరణ ద్వారా సామాజిక న్యాయం, రీ సర్వే ద్వారా గత ప్రభుత్వం ప్రజల భూములను దొంగలిస్తున్నదని ప్రజలను భయపెట్టి, ఓట్లు వేయించుకుని, అదే రీసర్వే కొనసాగిస్తూ, మరోపక్క ల్యాండ్ టైటిలింగ్ యాక్టును రద్దు చేసినామని అబద్ధపు తీర్మానాలతో సంక్షేమాన్ని ముగించేశారు.
"ఒక్క మాటలో చెప్పాలంటే ఈ మహానాడు సీఎం చంద్రబాబు కొడుకు లోకేష్ రాజకీయ పరిపక్వత చెందిన వ్యక్తిగా నిరూపించుకోవడానికి ఉపయోగపడింది" అని రమణ ప్రస్తావించారు. "లోకేష్ కు పార్టీలో కీలకమైన బాధ్యతలు కట్టబెట్టడానికి, గత ప్రభుత్వం మీద అభియోగాలు మోపడం, మాజీ సీఎంను తిట్టడానికి మాత్రమే రాయలసీమలో నిర్వహించినట్లుగా ఉంది" అని రమణ విశ్లేషించారు. మొత్తంమీద ఈ మహానాడు ద్వారా రాయలసీమ ప్రాంతానికి మేలు చేసే, వరాలు, నిధులు ఇస్తారని ఆశించిన వారికి అవేమీ ఉందవనే విషయం అర్థంమైందన్నారు.

Similar News