క్రికెటర్ శ్రీచరణికి గన్నవరంలో ఘన స్వాగతం

మహిళా వన్డే వరల్డ్ కప్ భారత జట్టు గెలుచుకోవడంలో శ్రీచరణి కీలక పాత్ర పోషించారు.

Update: 2025-11-07 04:28 GMT

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన భారత మహిళల క్రికెట్ జట్టు స్టార్ క్రీడాకారిణి శ్రీచరణికి గన్నవరంలో ఘన స్వాగతం పలికారు. ప్రపంచ కప్ గెలిచిన తర్వాత ఆమె తొలిసారిగా స్వరాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో అడుగు పెట్టారు. శుక్రవారం విజయవాడ విమానాశ్రయానికి చేరుకున్న ఆమెకు ఘన స్వాగతం లభించింది. మహిళల వన్డే వరల్డ్ కప్‌లో విశ్వవిజేతగా నిలిచిన టీమ్ ఇండియాకు ప్రాతినిధ్యం వహించి, అద్భుత ప్రదర్శన చేసిన ఆమెకు రాష్ట్ర మంత్రులు అనిత, సంధ్యారాణి, సవిత, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని),రాజ్యసభ సభ్యులు, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి సానా సతీష్ , టీమిండియా మాజీ కెప్టెన్ మిథాలీరాజ్, ఆంధ్రప్రదేశ్ శాప్ అధికారులు, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) ప్రతినిధులు ఘనంగా స్వాగతం పలికారు. విమానాశ్రయంలో ఆమెకు పుష్పగుచ్ఛాలు, శాలువాలతో సత్కారం చేసి, రాష్ట్ర ప్రజల తరఫున అభినందనలు తెలిపారు.

మహిళల వన్డే వరల్డ్ కప్ సెమీ ఫైనల్, ఫైనల్‌ మ్యాచ్ లలో ప్రత్యర్థుల జట్లపై భారత్ ఘన విజయం సాధించడంలో శ్రీచరణి కీలక పాత్ర పోషించారు. ఆమె బౌలింగ్ తో పాటు బ్యాటింగ్, ఫీల్డింగ్ ప్రదర్శనలు టీమ్ ఇండియా విజయానికి మూలస్తంభంగా  నిలిచారు. ఈ విజయంతో భారత మహిళల క్రికెట్ జట్టు చరిత్రలో మరో మైలురాయిని సాధించింది. శ్రీచరణి రాష్ట్రానికి గర్వకారణమని మంత్రులు అభివర్ణించారు. ఆమె విజయం రాష్ట్ర యువతకు, ముఖ్యంగా మహిళా క్రీడాకారిణులకు ప్రేరణగా నిలుస్తుందని పేర్కొన్నారు.

భారత క్రికెట్ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఉమెన్స్ వరల్డ్ కప్ విజయంలో కీలక పాత్ర పోషించిన తెలుగుతేజం శ్రీచరణి. ప్రత్యర్థులకు పదునైన బంతులతో చుక్కలు చూపించిన లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ శ్రీచరణి మన తెలుగుమ్మాయి కావడం మనందరికీ గర్వకారణం. వరల్డ్ కప్ లో 9 మ్యాచుల్లో 14 వికెట్లు తీసి టీమిండియా తరఫున అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్ గా నిలిచిన శ్రీచరణికి అభినందనలు తెలిపారు. భావి భారత బాలికలకు కలలు కనే ధైర్యాన్నిచ్చిన విజయంలో కీలక పాత్ర పోషించిన శ్రీచరణి మున్ముందు మరిన్ని విజయాలతో ప్రపంచం గర్వించదగ్గ స్థాయికి వెళ్లాలని ఆకాంక్షించారు. 

స్వాగత కార్యక్రమంలో ఏసీఏ అధికారులు శ్రీచరణికి ప్రత్యేక సన్మానం ఏర్పాటు చేశారు. ఆమెను గౌరవించేందుకు విజయవాడలో రోడ్ షో, ప్రజా సన్మాన కార్యక్రమాలు నిర్వహించే అవకాశం ఉందని తెలిసింది. రాష్ట్ర ప్రభుత్వం ఆమెకు నగదు బహుమతి, భూమి కేటాయింపు వంటి ప్రోత్సాహకాలు ప్రకటించనుందని సమాచారం. శ్రీచరణి తన స్వాగతానికి హాజరైన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ప్రజల మద్దతు, క్రీడా అభివృద్ధికి ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలు ఇలాంటి విజయాలకు బలం అని ఆమె పేర్కొన్నారు. 

Tags:    

Similar News