అవినీతికి పాల్పడుతున్న ఆ ముగ్గురు మహిళా మంత్రులెవరు?
YCP ఎమ్మెల్సీ వరుదు కళ్యాణీ ఆరోపణలకు అర్థమేమిటీ?;
By : The Federal
Update: 2025-08-30 06:04 GMT
ఇప్పటి వరకు పురుషులైన మంత్రులపై వచ్చిన అవినీతి ఆరోపణలు ఇప్పుడు మహిళా మంత్రులపైనా వస్తున్నాయి. రాష్ట్రంలో ముగ్గురు మహిళా మంత్రులు అవినీతిలో మునిగి తేలుతున్నారని వైసీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణీ ఆరోపించారు. మహిళలను మోసం చేయడంలో మహిళా మంత్రులు సైతం ఆరితేరిపోయారని అంటున్నారు ఆమె.
నెల్లూరులో కాకాణి పూజిత ఆధ్వర్యంలో వైయస్ఆర్‌సీపీ మహిళా విభాగం జోనల్ సమావేశం జరిగింది. సమావేశం అనంతరం వరుదు కళ్యాణి, కాకాణి పూజితలు మీడియాతో మాట్లాడారు. కూటమి సర్కార్ ఏర్పడినప్పటి నుంచి రాష్ట్రంలో మహిళలకు కనీస రక్షణ లేకుండా పోయిందని ఈ సందర్భంగా వారు మండిపడ్డారు.
అసలు ఏమి అన్నారంటే..
"మహిళలను నమ్మించి మోసం చేసిన కూటమి ప్రభుత్వానికి బుద్ది చెప్పేందుకు రాష్ట్రం లోని మహిళలు సిద్దంగా ఉన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి మహిళలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. 16 నెలలుగా మద్యాన్ని ఏరులై పారిస్తూ కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్నారు. మద్యానికి బానిసలుగా మారి, మహిళల మీద అఘాయిత్యాలకు పాల్పడుతున్న ఘటనలు నిత్యం జరుగుతున్నా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా అనిపించడం లేదు. నాడు మహిళలకు రక్షణగా నిలబడిన దిశ వ్యవస్థను నిర్వీర్యం చేశారు. ఇలాంటి ప్రభుత్వానికి ఎందుకు ఓటేశామా అని ప్రతి మహిళలోనూ పశ్చాత్తాపం కనిపిస్తోంది.
సాక్షాత్తు జూనియర్ ఎన్టీఆర్ తల్లిని టీడీపీ అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే చెప్పలేని భాషలో తిడితేనే అతడి మీద చర్యలు తీసుకోలేదు. రూ. 5 కోట్లు ఖర్చు చేసి తన తల్లిని టీడీపీ వారితో తిట్టించారని గతంలో పవన్ కళ్యాణ్ కూడా స్వయంగా చెప్పాడు.
ముగ్గురు మహిళా మంత్రులుండి కూడా మహిళలకు మేలు జరగడం లేదు. రౌడీలకు పెరోల్ ఇప్పించి సొమ్ము చేసుకోవడంలో ఒక మంత్రి, కుట్టు మిషన్ల పేరుతో దోచుకోవడంలో మరో మహిళా మంత్రి, వరలక్ష్మీ వ్రతం పేరుతో కానుకలు కొల్లగొట్టేయడంలో ఇంకో మహిళా మంత్రి బిజీగా ఉన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలంతా కూటమి (కే- ట్యాక్స్) ట్యాక్స్ వసూలు చేయడంలో బిజీగా ఉన్నారు. ప్రభుత్వ ఆస్తులను అప్పనంగా తన వారికి కట్టబట్టేస్తున్నారు.
మహిళల మీద చెయ్యేస్తే తాట తీస్తామని హెచ్చరించే పవన్ కళ్యాణ్.. సుగాలి ప్రీతి కేసును రాజకీయాలకు వాడుకున్నాడు. అధికారంలోకి వచ్చాక సుగాలి ప్రీతి కేసును ప్రథమ ప్రాధాన్యంగా స్వీకరించి న్యాయం చేస్తానని అధికారంలోకి వచ్చిన పవన్ కళ్యాన్.. 16 నెలలుగా సుగాలి ప్రీతి కేసు గురించి ప్రస్తావించలేదు. కనీసం సుగాలి ప్రీతి తల్లి పార్వతికి అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వడం లేదు. పవన్‌కి నిజంగా చిత్తశుద్ధి ఉంటే సుగాలి ప్రీతి కేసులో సీబీఐ విచారణకు కేంద్రాన్ని కోరాలి" అని వరుదు కళ్యాణీ ఆరోపించారు.