అసెంబ్లీలో ప్రజా వాణిని వినిపించే వారేరీ?
శాసనసభలో ప్రజల వాణి వినిపించే కర్తవ్యాన్ని నిర్వర్తించలేమని ప్రతిపక్ష పార్టీ చేతులెత్తేసింది
By : The Federal
Update: 2025-09-22 10:23 GMT
(టి. లక్ష్మీనారాయణ)
ఆంధ్రప్రదేశ్ లోని చట్టసభల పనితీరును చూస్తే రాజకీయ శూన్యత కొట్టొచ్చినట్లు కనపడుతున్నది. శాసనసభలో ప్రజల వాణి వినిపించే కర్తవ్యాన్ని నిర్వర్తించలేమని ప్రతిపక్ష పార్టీ చేతులెత్తేసింది. కూటమిలోని మూడు పాలక పార్టీలు ప్రత్యర్థిలేని శాసనసభలో ఏకపక్షంగా వ్యవహరించడం సహజమే కదా! ప్రభుత్వ పనితీరును పర్యవేక్షించే, ప్రశ్నించే, ప్రజా సమస్యలపై గళమెత్తే, చట్టాల రూపకల్పన సందర్భాల్లో ముసాయిదా బిల్లులను విమర్శనాత్మక దృష్టితో పరిశీలించి-చర్చల్లో పాల్గొనే వారెవరు? అవసరమైతే సవరణలు ప్రతిపాదించే వారెవరు? లోపభూయిష్టమైన విధానాలను ప్రభుత్వం అమలు చేస్తుంటే ప్రత్యామ్నాయ విధానాలను సూచించే వారెవరు? పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే ఈ ప్రక్రియ నేడు ఆంధ్రప్రదేశ్ లో ఆచరణలో లేదు. ఓ విచిత్ర పరిస్థితి నెలకొని ఉన్నది.
శాసనసభలో ఉన్న ఏకైక ప్రతిపక్ష పార్టీ "ప్రతిపక్ష హోదా" చుట్టూ పరిభ్రమిస్తున్నది. మొత్తం సభ్యుల సంఖ్యలో 10% ప్రాతినిథ్యం లేకపోతే ప్రతిపక్ష హోదా కల్పించని నిబంధన లేదా పార్లమెంటరీ సాంప్రదాయం అమలులో ఉన్నది. అది అందరికీ విధితమే. అది ఇస్తేనే సభకు వస్తానని భీష్మించుకుని నేను పట్టిన కుందేటి మూడే కాళ్ళన్న చందంగా వ్యవహరించడమంటే అసలు కారణం అది కాదని ఎవరికైనా అర్థమవుతుంది. శాసనసభకు హాజరయ్యే నైతిక బలం లేదని చెప్పకనే చెప్పినట్లుంది.
శాసన సభాపతి ఒకటికి పదిసార్లు ప్రతిపక్ష నాయకుడి హోదా ఇచ్చే అవకాశమే లేదని తేల్చేశారు. హైకోర్టును ఆశ్రయించినా ఫలితం దక్కలేదు. రాజ్యాంగం, ప్రజాస్వామ్యంపై విశ్వాసం, చట్టసభలపై గౌరవం ఉంటే, ప్రజా తీర్పుకు బద్దులై తమ నియోజకవర్గంలోని ప్రజలకు, రాష్ట్ర ప్రజానీకానికి ప్రాతినిథ్యం వహిస్తూ శాసనసభలో క్రియాశీలకంగా పాల్గొనాలి. గడిచిన శాసనసభ ఎన్నికల్లో వైస్సార్ సిపికి దాదాపు 40% ఓట్లు వచ్చాయి. ఆ ప్రజల పక్షాన నిలిచి శాసనసభలో తమ పాత్ర పోషించాలి కదా! ఆ పార్టీ తరుపున గెలిచిన వారిలో ఒక్కరు కూడా హాజరు కాలేదంటే ఆ పార్టీ నిర్మాణ వ్యవస్థ అప్రజాస్వామికంగా ఉన్నదని వేరే చెప్పనక్కరలేదు. రాజకీయ పార్టీలు, శాసన వ్యవస్థ, పాలనా వ్యవస్థ ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్య ప్రక్రియలో ప్రయాణిస్తేనే సామాజికాభివృద్ధి సాధ్యపడుతుంది.
అవినీతి, నేర చరిత్ర ఉన్న వారిని ఎన్నుకొంటే చట్టసభలకు వన్నెరాదు. నాణ్యతా ప్రమాణాలు, నైతిక విలువలు పతనమౌతాయి. ఎన్నికైన సభ్యులు పాలక పక్షంలో ఉంటే దర్జాగా అధికార దర్పంతో చట్ట సభలకు వెళుతున్నారు. స్వప్రయోజనాలపైనే వారి దృష్టి ఉంటున్నది. అలాంటి వారి వల్ల సుపరిపాలన ఎండమావే. ప్రతిపక్షంలో ఉంటే చట్ట సభలకే వేళ్ళకుండా ముఖం చాటేస్తున్నారు. కారణం అనైతిక చరిత్ర. చైతన్యం ప్రజల్లో వచ్చిన నాడే మన ప్రజాస్వామ్యానికి భవిష్యత్తు ఉంటుంది. నిజాయితీ గల, బాధ్యతాయుతమైన ప్రతినిధులను చట్టసభలకు ఎన్నుకుంటే పాలక పక్షంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా నిర్మాణాత్మకంగా సమాజం కోసం ఎంతోకొంత కృషి చేస్తారు. ఆంధ్రప్రదేశ్ సమస్యల వలయంలో చిక్కి విలవిల్లాడుతున్నది. రాజకీయ చైతన్యరాహిత్యం రాజ్యమేలుతున్నది.
(రచయిత, సామాజిక సేవా కార్యకర్త, రాజకీయ విశ్లేషకుడు)