కూటమి మధ్య సయోధ్య ఎక్కడ మిత్రమా..!

ఎన్నికల సన్నాహక సమావేశాల్లో కూటమి నేతల మధ్య సమయమనం కుదరడం లేదు. ఇలా ఉంటే కష్టమని బిజెపి సీనియర్ నాయకులు మిత్రపక్షాలను హెచ్చరించారు.

Update: 2024-04-09 02:40 GMT

(ఎస్.ఎస్.వి. భాస్కర్ రావ్)

తిరుపతి: కూటమి ఎన్నికల సన్నాహక సమావేశాలు మొక్కుబడిగా మారాయి. ఉపన్యాసాలకే పరిమితం అవుతున్నారు. మినహా వ్యూహాల, ఎత్తుగడలకు ప్రాధాన్యత లోపించింది. దీనిపై బిజెపి నాయకులు సీరియస్ అయినట్లు సమాచారం. నక్షత్రాల హోటల్లో చల్లగా కూర్చుని, మాట్లాడుకుని వెళుతున్నారు. అసలు ఎందుకు కలిశారు? అజెండా ఏమిటి? తీర్మానాలు ఏమిటి? ఎన్నికల ప్రచార కార్యాచరణ సరళి ఎలా తీసుకువెళ్లాలి అనే విషయంపై కూడా చర్చలు లేవంటున్నారు. తిరుపతిలో - టిడిపి, బిజెపి జనసేన కూటమి పార్టీల నిర్వహణ తీరు ఇలా సాగుతుందని ఆ పార్టీ వర్గాల నుంచే పెదవి విరుపు కనిపిస్తోంది. రాష్ట్రంలో టిడిపితో బిజెపికి పొత్తు కుదర్చడంలో జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ వారధిగా నిలిచారన్న విషయం తెలిసిందే.

రాష్ట్రంలో మూడు పార్టీల మధ్య కుదిరిన పొత్తు నేపథ్యంలో సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కూడా పూర్తయింది. టిడిపి, బిజెపి నియోజకవర్గాల్లో ఉన్న అసంతృప్తులను తగ్గించడానికి ఈ పాటికే ఆ పార్టీల అధినాయకులు నష్ట నివారణ చర్యలకు, కూటమి పార్టీల మధ్య సమన్వయం, అభ్యర్థులను ఏకం చేసే దిశగా సమాలోచనలు సాగిస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉంది. వివాదం, స్పర్ధలు ఓ కొలిక్కి వచ్చాయని రీతిలో భ్రమింపజేస్తున్న నియోజకవర్గాల్లో ఎన్డీఏ భాగస్వామ్య పార్టీల మధ్య జరుగుతున్న సమావేశాలు పరిహాసం చేసే విధంగా ఉన్నాయని భావిస్తున్నారు. ఎలాగంటే..

బిజెపి ఆదేశంతో...

సార్వత్రిక ఎన్నికలు సర్వసత్తాకంగా ఎదురుకోవడానికి, పార్టీ యంత్రాంగాన్ని కార్యరంగంలో దించడానికి కేంద్ర బిజెపి కమిటీ దిశానిర్దేశం చేసింది. ఎన్డీఏలో భాగస్వామి పక్షాలుగా ఉన్న పార్టీలతో సమన్వయ సమావేశాలు నిర్వహించాలని స్పష్టమైన సూచన చేసింది. ఆ దిశగా బిజెపి నాయకులు తమ పార్టీ యంత్రాంగాన్ని సన్నద్ధం చేయడంతో పాటు కూటమిలో భాగస్వామి పక్షాలను కూడా ఆహ్వానించింది. మొదట బిజెపి కేంద్ర కమిటీ రాష్ట్రానికి ముగ్గురు పరిశీలకులను నియమించింది. వారిలో ఒకరైన అరుణ్ సింగ్ ఇటీవల జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన బిజెపి నాయకత్వంతో పాటు తిరుపతిలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలైన టిడిపి, జనసేన పార్టీల బాధ్యులతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఎన్నికల ప్రచారాల్లో సాగాల్సిన తీరు, మూడు పార్టీల మధ్య సమయం కుదుర్చుకోవడానికి అనుసరించాల్సిన విధానాలను అరుణ్ సింగ్ భాగస్వామ్య పక్షాలకు వివరించారు.

తిరుపతిలోనే ఎందుకు

2024 సార్వత్రిక ఎన్నికలకు టిడిపి - జనసేన- బిజెపి కూటమిగా పార్టీ అభ్యర్థులను బరిలో నిలబెడుతున్నాయి. అందులో ప్రధానంగా తిరుపతి శాసనసభ స్థానంలో జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు, తిరుపతి ఎస్సీ రిజర్వుడు పార్లమెంటు స్థానంలో బిజెపి అభ్యర్థి వరప్రసాదరావును పోటీ చేయిస్తున్నారు. అందువల్ల మూడో పార్టీల నాయకులు సమావేశం కావాలని కేంద్ర బిజెపి ఆదేశాల మేరకు ముందుకు సాగుతున్నారు. ఇటీవల మూడు రోజుల కిందట జనసేన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించే నేపథ్యంలో సమన్వయ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. చర్చలు, తీర్మానాలు, కార్యాచరణ ఏంటనేది బయట ప్రజలకు కాదు కదా కనీసం నాయకులకు కూడా తెలిసినట్టు లేదనేది ఆ సమావేశానికి హాజరైన ప్రతినిధులు చెప్పిన మాట.

అదే సీన్ రిపీట్...

తిరుపతి నగరంలో సోమవారం మధ్యాహ్నం మూడు పార్టీల నాయకులు స్టార్ హోటల్లో సమావేశం అయ్యారు. ఈ సమావేశానికి బీజేపీ నుంచి జాతీయ కమిటీ నాయకురాలు శాంతా రెడ్డి, రాష్ట్ర కమిటీ కార్యదర్శి ముని బాలసుబ్రమణ్యం, టిడిపి నుంచి రాష్ట్ర కార్యదర్శి జి నరసింహ యాదవ్, ఆర్ సి మునికృష్ణ, జనసేన నుంచి డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ ఆయా పార్టీల నుంచి నాయకులు హాజరయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి ముని బాలసుబ్రమణ్యం, తర్వాత జాతీయ కమిటీ నాయకురాలు శాంతా రెడ్డి సమావేశాల నిర్వహణపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం" ఎన్నికల్లో వ్యూహం ఎత్తుగడలు అవసరం.

బహిరంగ సభల మాదిరి సమావేశం నిర్వహించి మమ అనిపించుకుంటే కుదరదు" ఇది మార్చండి అని తీవ్ర స్వరంతో వ్యాఖ్యానించినట్లు తెలిసింది. వచ్చామా వెళ్ళామా అన్నట్లు తెప్పిస్తే, మూడు సమావేశాలు నిర్వహించాం? ఏమి చర్చించాం? ఏమి మాట్లాడుకున్నాం?" అనేది పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందని వారు గట్టిగా సూచించినట్లు తెలిసింది. కూటమి పార్టీల మధ్య సఖ్యతకు ఇది మంచిది కాదని కూడా మిగతా పార్టీలకు సూచించారని తెలుస్తోంది.

కొసమెరుపు: ఈ సమావేశానికి కూటమి అభ్యర్థిగా జనసేన నుంచి తిరుపతి అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆరణి శ్రీనివాసులు మొక్కుబడిగా పాల్గొని, నిమిషాల్లో వెళ్ళిపోయారని సమాచారం. తిరుపతి ఎస్సీ రిజర్వేషన్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వరప్రసాదరావు రాలేని స్థితిలో ఆయన కుమారుడు హాజరయ్యారని తెలిసింది. సమన్వయ కమిటీ సమావేశానికి ఈ మాజీ ఎమ్మెల్యే ఎం సుగుణమ్మ, మరో కీలక నాయకుడు మబ్బు దేవ నారాయణ రెడ్డి, సూర సుధాకర్ రెడ్డితోపాటు పలువురు సీనియర్లు గైర్హాజరైనట్లు సమాచారం.

అభ్యర్థి నిర్ణయం జరిగినప్పటి నుంచి తిరుపతి మూడు పార్టీల కూటమిలో ఇదే పరిస్థితి కొనసాగుతోంది. ఈ సమస్యను అధిగమించడానికి ప్రత్యేక చొరవ తీసుకోవాల్సిన అవసరాన్ని ఓ బీజేపీ సీనియర్ నాయకుడు గుర్తు చేశారు. మొత్తం మీద తిరుపతి జనసేన అభ్యర్థికి మిత్రపక్ష పార్టీల నుంచి అందుతున్న సహకారం అంతంత మాత్రమ అన్నట్లు స్పష్టం అవుతుంది. రానున్న రోజుల్లో ఇది ఉంటుంది అనే ఆశాభావాన్ని కొందరు నాయకులు వ్యక్తం చేశారు.

వీరి కథ ఇలా ఉంటే టౌన్ బ్యాంక్ మాజీ చైర్మన్ పులిగోరు మురళి కృష్ణారెడ్డి ప్రత్యేకంగా డివిజన్ స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులును కార్యకర్తలు, నాయకులకు పరిచయం చేశారు. ఇక్కడే సమన్వయం లోపం స్పష్టంగా కనిపిస్తోందని వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి.




Tags:    

Similar News