'మంచు' కురిసే వేళ.. స్టేషన్ వద్ద 'మనోజ్' హంగామా

"మంచు కుటుంబం" వివాదాలతో తరచూ వార్తలో నిలుస్తోంది. తిరుపతి జిల్లాలో సినీ నటుడు మంచు మనోజ్ నిరసనకు దిగారు.

Byline :  SSV Bhaskar Rao
Update: 2025-02-18 05:42 GMT

సినీ నటుడు మంచు మోహన్ బాబు కుటుంబం తరచూ వివాదాలతో వార్తల్లో నిలుస్తోంది. రోజుకో రకమైన సమస్యతో తెరపైకి వస్తున్నారు. తిరుపతి జిల్లా చిన్న గొట్టికల్లు మండలం బాకరాపేట పోలీస్ స్టేషన్ ముందు మంచు మనోజ్ హంగామా సృష్టించారు. ప్రశ్నలతో పోలీసులను ఉక్కిరిబిక్కిరి చేశారు. ఆయనకు సమాధానం చెప్పలేక పోలీసు అధికారులు తరలి పట్టుకున్నారు.

"నా ఇంట్లో నేను ఉన్న. నన్ను అనవసరంగా కెలికారు. నన్ను ఎందుకు స్టేషన్కు తీసుకు వచ్చారో చెప్పండి"అని సినీ నటుడు మంచి మనోజ్ భాకరాపేట పోలీసులను నిలదీశారు. ఓ రిసార్ట్ లో ఉన్న తనను ఎస్సై చెయ్యి పట్టి లాక్కొని వచ్చారు. అసలు నన్ను ఎందుకు అదుపులోకి తీసుకున్నారు చెప్పాలంటూ స్టేషన్లోని హెడ్ కానిస్టేబుల్ తో వాదనకు దిగిన సంఘటన ఇది. తనను అకారణంగా ఇబ్బంది పెడుతున్నారు అంటూ మంచు మనోజ్ స్టేషన్ వద్ద బైఠాయించారు. సోమవారం అర్ధరాత్రి నుంచి ప్రారంభమైన ఈ ఎపిసోడ్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆ వివరాల్లోకి వెళితే..

తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం భాకరాపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ రిసార్ట్లో మంచు మనోజ్ సోమవారం రాత్రి బస వేశాడు. మిత్రులతో కలిసి ఆయన అక్కడ ఉన్నట్లు సమాచారం. గస్తీ నిర్వహిస్తూ వచ్చారో, లేకుంటే ఎవరైనా సమాచారం ఇచ్చారో తెలియదు కానీ ఎస్సై రాఘవేంద్ర ఆ రిసార్ట్ వద్దకు వెళ్లారు. అక్కడ బౌన్సర్లు కనిపించడంతో వాకబు చేశారని చెబుతున్నారు. పోలీసులు వెళ్లిపోయిన తర్వాత మంచు మనోజ్ రాత్రి 11 గంటల తర్వాత స్టేషన్కు వెళ్లి అక్కడే తాపలపై బైఠాయించారు. ఇది ఇలా ఉంటే..

రిసార్ట్లో ఉండడానికి వీలు లేదంటూ తనను పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చినారని మంచు మనోజ్ ఆరోపించారు. తన వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగిస్తున్నారంటూ పోలీస్ స్టేషన్లోనే బైఠాయించిన మంచి విష్ణు నిరసనకు దిగారు. తండ్రి మంచు మోహన్ బాబుతో కుటుంబ గొడవల నేపథ్యం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో తనను ఉద్దేశపూర్వకంగా పోలీసులు వెంబడిస్తున్నారు అని మంచు మనోజ్ ఆరోపిస్తున్నారు. తనపై నిఘా పెట్టి వ్యక్తిగత స్వేచ్ఛకు కూడా భంగం కలిగిస్తున్నారంటూ పోలీస్ స్టేషన్ లోనే ఆయన హంగామా చేశారు.
తిరుపతి.. మదనపల్లె మార్గంలో ఉన్న భాకరాపేట ఘాట్ రోడ్డులో ఓ ప్రైవేట్ రిసార్ట్స్లో మనోజ్ బస చేశారు. సోమవారం రాత్రి 11 గంటల సమయంలో గస్తీకి వెళ్లిన ఎస్సై రాఘవేంద్ర రిసార్ట్ వద్ద తనిఖీ చేశారు. అక్కడ ప్రైవేటు బౌన్సర్లు ఉండడం గమనించిన ఎస్సై వారిని ప్రశ్నించారు. రిసార్ట్లో మంచు మనోజ్ ఉన్నాడని సిబ్బంది చెప్పడంతో పాటు బాన్సర్లు మనోజ్ కు సమాచారం ఇచ్చారు. ఇదిలా ఉంటే..
ఆ తర్వాత పోలీస్ స్టేషన్కు వెళ్లిన మంచు మనోజ్ తమ సిబ్బందిని ఎందుకు ప్రశ్నించారు? నన్ను అరెస్ట్ చేయడానికి వచ్చారా అని కూడా స్టేషన్లోని సిబ్బందిని ప్రశ్నించారు. రిసార్ట్ వద్దకు పోలీసులు ఎవరు పంపారు నాకు తెలుసు. ఎక్కడికి వెళ్లినా పోలీసులు ఇబ్బంది పెడుతున్నారని మనోజ్ ఆరోపించారు. నన్ను అరెస్ట్ చేసుకోండి అంటూ పోలీస్ స్టేషన్ ముందే నిరసనకు దిగారు.
"నేనేమన్నా టెర్రరిస్టు నా. దొంగనా? అర్ధరాత్రి ఎందుకు బెదిరించారు. సీఎం పేరు చెప్పే బెదిరిస్తున్నారు. ఆయన పేరు ఎందుకు వాడుతారు అసలు నా దగ్గరకి ఎందుకు వచ్చారు" ఈ విషయం చెబితే వెళ్లిపోతానంటూ బైఠాయించారు. ఆ తర్వాత సిఐ ఇమ్రాన్ బాషా తో ఫోన్లో మాట్లాడిన మనోజ్ వెళ్లిపోయారు.
మళ్లీ ప్రవేశం .. హైడ్రామా
భాకరాపేట పోలీస్ స్టేషన్ వద్ద సోమవారం అర్ధరాత్రి వరకు హంగామా చేసిన నటుడు మంచు మనోజ్ ఆ సమయంలో చెప్పినట్లే మళ్లీ మంగళవారం ఉదయం స్టేషన్కు చేరుకున్నారు. స్టేషన్లో సీఐ ఇమ్రాన్, ఎస్సై రాఘవేంద్ర అందుబాటులో లేరు. ఆ సమయంలో స్టేషన్ లో ఉన్న హెడ్ కానిస్టేబుల్ తో సినీ నటుడు మంచు మనోజ్ మళ్ళీ వాదనకు దిగారు.
"నా రిసార్ట్ లో నేను ఉన్న. నన్ను అనవసరంగా కెలికారు. చెయ్యి పట్టుకొని మరి లాక్కొని వచ్చారు" ఇలా ఎందుకు చేయాల్సి వచ్చిందో సమాధానం చెప్పాలంటే హెడ్ కానిస్టేబుల్ తో మాటల సమరం సాగించారు. నా దగ్గరికి ఎందుకు వచ్చారు. ఎందుకు బెదిరించారు సమాధానం చెప్పాలి నిలదీశారు. గస్తీ నిర్వహించే సమయంలో మీరు (మంచు మనోజ్) ఉన్నారని తెలిసి అభిమానంతో పోలీసులు వచ్చారని సీఐ ఇమ్రాన్ సమాధానం ఇచ్చారు. అయినా సంతృప్తి చెందని మంచు మనోజ్..
"సోమవారం రాత్రి తనను పోలీస్ స్టేషన్కు ఎందుకు తీసుకువచ్చారు" అనేది లిఖిత పూర్వకంగా సమాధానం ఇవ్వాలి. లేదంటే "ఇకపై ఎప్పుడూ నాకు ఇలాంటిది జరగదు. అభిమానంతోనే రిసార్ట్ కు వచ్చాం" అని సీఐ ఇమ్రాన్ వాట్సాప్ లో టెక్స్ట్ మెసేజ్ చేస్తే వెళతానంటూ భీష్మించారు. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పలేని స్టేషన్లోని హెడ్ కానిస్టేబుల్ అక్కడి నుంచి పక్కకు వెళ్లడం వీడియోలో కనిపించింది. మొత్తానికి సినీ నటుడు మంచు మనోజ్ వ్యవహారం మరోసారి వివాదాస్పదంగా మారింది.

Similar News