కమ్యూనిస్టుల ప్రచారబాట ఎప్పుడు?

ఆంధ్రప్రదేశ్‌లో కమ్యూనిస్టులు ఇంకా ప్రచారానికి సిద్ధం కాలేదు. టీడీపీ, వైఎస్సార్‌సీపీలు సుమారు మూడు నెలల నుంచి ప్రచారంలో ముందుకు సాగుతున్నాయి.

Update: 2024-04-08 13:17 GMT

రాష్ట్రంలో కమ్యూనిస్టులకు ఆదరణ కరువైంది. ప్రజలు వారిని పెద్దగా పట్టించుకోవడం లేదు. కారణాలు ఏవైనా బూర్జువా పార్టీల ధాటికి వామపక్ష పార్టీలు తట్టుకోలేకపోతున్నాయి. పొత్తులు లేనిది సొంతగా పోటీ చేసే పరిస్థితులు కూడా లేవు. గతంలో కమ్యూస్టులంటే ఎక్కడ సమస్య ఉంటే అక్కడ ఉండే వారు. ఇప్పుడు పరిస్థితులు అలా లేవు. సాధారణ ప్రజలు ఒక్కోసారి ఉప్పెనలా ఉద్యమాలు నడుపుతున్నారు. ఇందులో ఎవరి ప్రమేయం లేకుండా ముందుకు సాగటం విశేషం. ఆ తరువాత ఉద్యమంలో కలిసి పనిచేసేందుకు కమ్యూనిస్టులు కూడా పాదం కలపాల్సిన పరిస్థితులు వచ్చాయనడంలో సందేహం లేదు.

ఎన్నికల వేళ.. ఎందుకు ఉత్సాహంగా లేరు..
ఇండియా కూటమిలో కమ్యూనిస్టులు భాగస్వాములుగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా తెలుగుదేశం పార్టీ కలిసొస్తే సీపీఐ వారు కలిసి పోటీ చేద్దామని భావించారు. అయితే టీడీపీ ఎన్‌డీఏ కూటమిలోకి పోవడంతో ఇండియా కూటమిలోకి కమ్యూనిస్టులు ఏపీలో కాంగ్రెస్‌తో కలిసి పనిచేయక తప్పింది కాదు. ఇప్పటికే కమ్యూనిస్టులకు చెరి రెండు ఎంపీ స్థానాలు, తొమ్మిది ఎమ్మెల్యే స్థానాలు కాంగ్రెస్‌ వారు కేటాయించారు. దాదాపు నియోకవర్గాలు కూడా ఫైనల్‌ అయినట్లే. అయినా నేతల తాఫీగా కాఫీలు, టీలు తాగుతూ సమావేశాల్లోనే గడుపుతున్నారు. అభ్యర్థులను ప్రకటించి ప్రచార రంగంలోకి దిగలేదు. ఎన్నికలనగానే కమ్యూనిస్టుల్లో ఎక్కడ లేని ఉత్సాహం వస్తుంది. అదేదీ ఈ ఎన్నికల్లో వారిలో కనిపించడం లేదు. ప్రజానాట్య మండలి సభ్యులు కూడా కనిపించడం లేదు.
పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల కడప పార్లమెంట్‌ స్థానంలో పోటీ చేస్తున్నారు. ఆ స్థానంలో ఆమె ఇప్పటికే ప్రచారం ముమ్మరంగా చేస్తున్నారు. పైగా చిన్నాన్నను చంపించిన హంతకుడికి వైఎస్సార్‌సీపీ సీటు ఇచ్చిందని, ఆయను గెలిపించ వద్దంటూ హోరుగాలిని తలపించేలా ప్రచారం సాగిస్తున్నారు. అక్కడ కమ్యూనిస్టులు కనిపించకపోవడం ఆశ్చర్యంగా కనిపిస్తోంది. రెండు రోజుల క్రితం షర్మిల రోడ్డుపై ప్రచారం చేసుకుంటూ పోతుంటే ఒక కమ్యూనిస్టు నాయకుడు ఎప్పటి నుంచో పెట్టెలో మడత వేసి దాచిపెట్టిన జెండా కండువాను మెడలో వేసుకుని కనిపించారు. షర్మిలతో పాటు నాలుగడుగులు వేశారు. ఈ లోపు సెక్యూరిటీ వారు పక్కకు తీయడంతో వెనక్కి తగ్గి ఆ జనంలో కనిపించకుండా పోయారు. ఆయన ఎక్కడున్నారో ముందుకు రమ్మని షర్మిల సెక్యూరిటీ వారిని అడిగినా ఆ నాయకుడు కనిపించలేదు. ఇదీ నేడు కడపలో కమ్యూనిస్టులు పోరాట పటిమ. కడప నగరంలో జిల్లా కమ్యూనిస్టు పార్టీ స్ట్రాంగ్‌గానే ఉందని చెబుతుంటారు. కనీసం తమ అభ్యర్థులను రంగంలోకి దించి ఇంటింటి ప్రచారమైనా చేపట్టాలి కదా. అదేదీ కనిపించడం లేదు. కనీసం కరపత్రాలు కూడా ఇంకా ప్రజల వద్దకు వెళ్లిన దాఖలాలు లేవు.
మీడియాలో కనిపిస్తే చాలు..
కమ్యూనిస్టులు మీడియాలో కనిపిస్తే ఉద్యమాలు చేసినట్లేననే పరిస్థితి ఇప్పుడు వచ్చింది. కనీసపు బలం ఉన్న చోట్ల కూడా కమ్యూనిస్టులు సాధారణ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. మాకు బలం లేనందున పోటీ చేయడం లేదని చెప్పుకుంటూ సమర్థించుకుంటున్నారు. దాని వరకు వదిలేసినా పొత్తులో సీట్లు తీసుకున్న తరువాత కూడా మీనమేషాలు ఎందుకు లెక్కపెడుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు కాంగ్రెస్‌ పార్టీ అన్యాయం చేసిందని భావిస్తున్నారా? ఆ విషయాన్నైనా ఎప్పుడైనా స్పష్టం చే శారా? అదీ లేదు. ముఖ్యమంత్రికి బహిరంగ లేఖలు రాయడం, ప్రెస్‌మీట్లలో నాలుగు మాటలు అడగటంతోనే సరిపెడుతున్నారు.
ఓట్ల శాతాన్ని పడిపోకుండా చూసుకుంటారా?
మేలో జరిగే ఎన్నికల్లో కమ్యూనిస్టులు పోటీ చేస్తున్న స్థానాల్లో కనీస ఓట్ల శాతాన్నైనా కూడగట్టుకుంటారా? లేదా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. చాలా గతంలో పోటీ చేస్తే కనీసం పదివేలకు తగ్గకుండా ఓట్లు వచ్చేవి. స్వాతంత్య్రం వచ్చిన మొదటి రోజులను పక్కనబెట్టినా ఉద్యమాలు సాగిస్తున్న నియోజకవర్గాల్లో కొంత మేర వీరికి ఆదరణ ఉంది. దానిని పోగొట్టుకోకుండా ముందుకు సాగేందుకు ఎటువంటి ప్రయత్నాలు చేస్తున్నారంటే అటువంటిదేదీ పెద్దగా కనిపించడం లేదు. ఈ పరిస్థితుల నుంచి ఈ ఎన్నికల్లో బయటపడతారా? లేదా అనేది వేచి చూడాల్సిందే.
Tags:    

Similar News