పెళ్లి చేసుకోమంటే..పెట్రోలు పోసి కాల్చి చంపేశాడు

కడప జిల్లాలో పెట్రోల్‌ దాడికి గురైన విద్యార్థిని మృతి చెందింది.ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది. నిందితుడికి శిక్ష పడేలా చూడాలని సీఎం ఆదేశించారు.

Update: 2024-10-20 08:08 GMT

కడప జిల్లా బద్వేలుకు చెందిన ఇంటర్‌ విద్యార్థినిని నిందితుడు విఘ్నేష్‌ చెట్ల పొదల్లోకి లాక్కుని వెళ్లి పెట్రోల్‌ పోసి నిప్పు అంటించి పరారయ్యాడు. గాయాలైన ఆ విద్యార్థినిని రిమ్స్‌ ఆసుపత్రికి తరలించి చికిత్సలు అందించారు. 80శాతానికిపైగా తీవ్ర గాయాలైన ఆ విద్యార్థిని చికిత్స పొందుతూ ఆదివారం మరణించింది. చికిత్స పొందుతున్న సమయంలో బాధితురాలి నుంచి జిల్లా జడ్జి వాంగ్మూలం తీసుకున్నారు. పెళ్లి చేసుకోవాలని కోరడంతో నిందితుడు పెట్రోల్‌ పోసి నిప్పంటించినట్లు బాలిక తెలిపింది. ఇదే విషయం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో నాలుగు బృందాలుగా ఏర్పడిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

కడప జిల్లా ఎస్పీ విష్ణువర్థన్‌రాజు ఈ ఘటనకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. బాధితురాలు ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ చదువుతోంది. నిందితుడు విఘ్నేష్‌ కడపలో ఓ హోటల్‌లో వంట మాస్టర్‌గా పని చేస్తున్నాడు. వీరిద్దరికీ చిన్నప్పటి నుంచి స్నేహం ఉంది. నిందితుడికి పెళ్లైంది. అతని భార్య ఇప్పుడు గర్భిణి. నిందితుడు బాధితురాలికి శుక్రవారం ఫోన్‌ చేశాడు. శనివారం తనను కలవాలని రిక్వెస్ట్‌ చేశారు. రాకపోతే ఆత్మహత్య చేసుకుంటానని ఫోన్‌లో బెదిరించాడు. దీంతో ఆ బాలిక ఆందోళనకు గురైంది. శనివారం ఆ బాలిక కళాశాల నుంచి ఆటోలో బయలు దేరింది. నిందితుడు విఘ్నేష్‌ అదే ఆటోను మధ్యలో ఎక్కాడు. ఇద్దరూ కలిసి బద్వేలకు పది కిలోమీటర్ల దూరంలో ఉన్న పీపీకుంట చెక్‌ పోస్టు వద్ద ఆటో దిగారు. సమీపంలోని ముళ్ల పొదల్లోకి వెళ్లారు. తన వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను ఆ బాలికపై పోసి నిప్పంటించి నిందితుడు పరారయ్యాడు. ఆమెను గమనించిన కొందరు మహిళలు పోలీసులకు సమాచారం ఇచ్చారు. గాయపడిన ఆ బాలికను రిమ్స్‌కు తరలించారు. 80 శాతానికిపైగా కాలిన గాయాలతో కొట్టుమిట్టాడుతున్న ఆ బాలిక చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతి చెందినట్లు ఎస్పీ తెలిపారు.
బాలిక మృతి పట్ల సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఆరా తీశారు. నిందితుడుకి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. ప్రత్యేక కోర్టులో ఫాస్ట్‌ ట్రాక్‌ విధానంలో ఈ కేసును విచారణ చేపట్టి నిందితుడికి శిక్ష పడేలా చూడాలని అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయడం అంటే హంతకుడిని త్వరగా, చట్టబద్దంగా శిక్షించడమేనని సీఎం అన్నారు. బాధితురాలి కుటుంబాన్నిఅన్నివిధాలుగా ఆదుకుంటామని హోం మంత్రి అనిత తెలిపారు. 
Tags: