వాట్సాప్ గవర్నెన్స్ ఒక డిజిటల్ పాలన!

వాట్సాప్ ద్వారా కావాల్సిన ప్రభుత్వ సేవలు పౌరులు పొందటంతో పాటు, ఫిర్యాదులు కూడా చేయవచ్చు. ఇదెలాగంటే...;

Update: 2025-05-10 05:01 GMT

వాట్సాప్ గవర్నెన్స్.. ‘మన మిత్ర’ అనేది ఏపీలో ఒక బ్రాండ్ మోడల్ డిజిటల్ పాలనగా ప్రభుత్వం తీసుకొచ్చింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ప్రారంభించిన ప్రగతిశీల డిజిటల్ పాలనగా చెప్పొచ్చు. ఇది వాట్సాప్ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ ద్వారా పౌరులకు ప్రభుత్వ సేవలను నేరుగా అందించే లక్ష్యంతో జనవరి 30, 2025న ఏపీ ప్రభుత్వం ప్రారంభించింది. ప్రపంచవ్యాప్తంగా మొట్ట మొదటి పాలనా కార్యక్రమంగా ప్రభుత్వం చెబుతోంది. వాట్సాప్ విస్తృత ఉపయోగాన్ని పాలనలో చేర్చి ప్రజలకు కావాల్సిన సౌకర్యాలు వాట్సాప్ ద్వారా అందించే కార్యక్రమం. సాధారణ సేవల కోసం పౌరులు ప్రభుత్వ కార్యాలయాలను సందర్శించాల్సిన అవసరాన్ని తగ్గించడం, బ్యూరోక్రాటిక్ అడ్డంకులను తొలగించడం వంటి పాలనా విధానంగా ముఖ్యమంత్రి చెబుతున్నారు.

వాట్సాప్ గవర్నెన్స్ అంటే...

ప్రభుత్వ సంస్థలు పౌరులకు సేవలు అందించడానికి, వారితో సంప్రదించడానికి, పరిపాలను సులభతరం చేయడానికి వాట్సాప్ ను ఉపయోగించడం. ఇది ప్రభుత్వ సేవలను వాట్సాప్ ఆధారిత ఇంటర్ఫేస్‌లో సమీకరిస్తుంది. సాధారణంగా చాట్‌బాట్ లేదా అధికారిక ఖాతా ద్వారా, పౌరులు సేవలను ఆక్సెస్ చేయడం, దరఖాస్తులు చేయడం, సర్టిఫికెట్లు పొందడం, బిల్లులు చెల్లించడం, ఫిర్యాదులు నమోదు చేయడం, రియల్ టైమ్ లో కావాల్సిన కొత్తవి పొందడం వంటివి చేయడానికి వీలు కల్పిస్తుంది. వినియోగదారు స్నేహపూర్వక ఇంటర్ఫేస్, రియల్ టైమ్ సంప్రదింపు సామర్థ్యాలను ఉపయోగించి పరిపాలనను మరింత సులభంగా, సమర్థవంతంగా, పారదర్శకంగా ముందుకు తీసుకుపోవడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. వాట్సాప్ గవర్నెన్స్ అనేది డిజిటల్ పరిపాలన నమూనా. ఇక్కడ ప్రభుత్వాలు పౌర సేవలు అందించడం, సమాచారం అందరికీ చేరవేయడానికి ఉపయోగ పడుతుంది.

వాట్సాప్ గవర్నెన్స్ (మన మిత్ర)

పౌరులు 9552300009 అనే డెడికేటెడ్ వాట్సాప్ నంబర్‌కు సాధారణ “హాయ్” లేదా నిర్దిష్ట ప్రశ్నలతో మెసేజ్ చేసి ప్రభుత్వ సేవలను పొందవచ్చు. ఈ ప్లాట్‌ఫామ్ ‘తెలుగు, ఇంగ్లీష్’ భాషల్లో అందుబాటులో ఉంది. మే 2025 నాటికి 273 సేవలు అందుబాటులో ఉంటాయని ప్రభుత్వం ప్రకటించింది. కొద్ది నెలల్లో 500 సేవలకు విస్తరించాలనే ప్రణాళికతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. మొదట 161 సేవలతో ప్రారంభించిన ఈ కార్యక్రమం రెండవ దశలో 360 అదనపు సేవలను చేర్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఉదాహరణకు...


రెవెన్యూ సేవలు (ఆదాయ, ఒబిసి, ఇడబ్ల్యూఎస్ సర్టిఫికెట్లు)

మున్సిపల్ సేవలు (ఆస్తి పన్ను చెల్లింపులు)

యుటిలిటీ చెల్లింపులు (విద్యుత్ బిల్లులు)

రవాణా (ఎపిఎస్ఆర్టిసి బస్సు టికెట్ బుకింగ్)

ఎండోమెంట్స్ (ఆలయ దర్శనం, సేవ బుకింగ్‌లు)

ఫిర్యాదుల పరిష్కారం (ఫిర్యాదులు దాఖలు చేయడం)

అన్న క్యాంటీన్లు, సిఎం రిలీఫ్ ఫండ్ సేవలకు వినియోగించుకోవచ్చు. పైన పేర్కొన్న శాఖల్లో చెప్పిన సేవలు ఉదాహరణకు కొన్ని మాత్రమే. ఆయా విభాగాల్లో ఉన్న అన్ని సేవలూ ఉపయోగించుకోవచ్చు. సలహాలు, వాతావరణ హెచ్చరికలు, ప్రభుత్వ నోటిఫికేషన్‌లు తెలుసుకునే వీలు ఉంది. అలాగే పౌరుల సమాచారం అప్డేట్ చేయించుకోవచ్చు.

మెటాతో ఒప్పందం

అక్టోబర్ 22, 2024న మెటాతో ఒప్పందం కుదుర్చుకుని, కేవలం మూడు నెలల్లోపు ప్రభుత్వం అమలు చేసింది. మెటా ఈ ప్లాట్‌ఫామ్‌ను ఉచితంగా అందించింది. మెటా ఇండియా వైస్ ప్రెసిడెంట్ సంధ్యా దేవనాథన్, వాట్సాప్ ఇండియా హెడ్ రవి గార్గ్, మన మిత్ర ఒకే ప్లాట్‌ఫామ్‌పై సమగ్ర సేవలను అందించడంలో ప్రత్యేకమైనదని, ఇతర రాష్ట్ర చొరవలకు భిన్నంగా ఉందని పేర్కొన్నారు.

సాంకేతిక మెరుగుదల

క్యూఆర్ కోడ్ ప్రమాణీకరణ: మన మిత్ర ద్వారా జారీ చేసిన సర్టిఫికెట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారిక పోర్టల్‌తో లింక్ అయిన క్యూఆర్ కోడ్‌లతో ఉంటాయి. ఇది ప్రామాణికతను నిర్ధారిస్తుంది. మోసాలను నివారిస్తుంది.

బ్లాక్‌చెయిన్ ఇంటిగ్రేషన్: భద్రత, పారదర్శకతను మెరుగుపరచడానికి బ్లాక్‌చెయిన్ సాంకేతికతను చేర్చే ప్రణాళికలు ఉన్నాయి.

ఏఐ, వాయిస్ ఫీచర్లు: భవిష్యత్ లో కొత్త ఫీచర్ లు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఏఐ ఆధారిత చాట్‌బాట్‌లు, వాయిస్ అసిస్టెంట్‌లను (ఇంగ్లీష్, తెలుగులో) చేర్చుతారు. ముఖ్యంగా అక్షరాస్యులు, వృద్ధులకు సౌకర్యంగా ఉండే విధంగా చర్యలు తీసుకుంటారు.

ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ (End-to-end encryption): వాట్సాప్ ఎన్‌క్రిప్షన్ వినియోగదారు డేటాను గోప్యంగా ఉంచుతుంది. వాట్సాప్, మెటా సహా థర్డ్ పార్టీలకు యాక్సెస్ ఉండదు.

రియల్-టైమ్ గవర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్)

ఐఏఎస్ కాటంనేని భాస్కర్ వంటి అధికారుల పర్యవేక్షణలో కార్యక్రమం కొనసాగుతోంది. ఇది విభాగాల డేటాను అనుసంధానించడం, సజావుగా సేవలను అందించడం, ప్రభుత్వ డేటాను నిల్వ చేయడం, విశ్లేషించడానికి ఒక కేంద్రీకృత రిపోజిటరీ (రిపోజిటరీ అంటే డేటా, ఫైళ్లు, కోడ్ లేదా ఇతర సమాచారాన్ని నిల్వ చేయడానికి, నిర్వహించడానికి ఉపయోగించే ఒక కేంద్రీకృత స్థలం) ని అభివృద్ధి చేయడానికి బాధ్యత తీసుకుంటుంది. మే 2025 నాటికి డేటా లేక్ దాదాపు పూర్తవుతుంది. ఇది వేగవంతమైన, డేటా ఆధారిత పాలనను సాధ్యం చేస్తుంది.

ప్రజల్లో అవగాహన పెరగాలి

పౌరులు వాట్సాప్ ద్వారా సేవలకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులను ట్రాక్ చేసి పరిశీలించే అవకాశం కూడా ఇందులో ఉందని ప్రభుత్వం వెల్లడించింది. ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలోని పౌరులు మన మిత్రను ఎలా ఉపయోగించాలో తెలుసుకునే విధంగా చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఇందు కోసం జనవరి 2025లో తెనాలిలో పైలట్ ప్రాజెక్ట్ ద్వారా పరీక్షించామని అధికారులు తెలిపారు.

మన మిత్ర ద్వారా వాట్సాప్ గవర్నెన్స్ ఆంధ్రప్రదేశ్‌లో డిజిటల్ పాలన వైపు పూర్తిగా వెళుతోంది. ఇప్పటికే లక్షలాది మంది ఉపయోగిస్తున్న ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించడం ద్వారా, ప్రభుత్వం పబ్లిక్ సర్వీస్‌లను సజావుగా, సులభంగా అందుబాటులోకి తెస్తోంది. ఇదే సమయంలో సైబర్‌సెక్యూరిటీ, సాంకేతిక అంశాలకు ప్రాధాన్యత ఇస్తోంది.

Tags:    

Similar News