అనధికార కల్యాణోత్సవాలు నిర్వహిస్తే అక్షింతలే:టీటీడీ హెచ్చరిక
యూకేలో నిర్వహించిన ఉత్సవంపై టీటీడీ సీరియస్. విచారణకు ఆదేశం.;
Byline : SSV Bhaskar Rao
Update: 2025-09-09 14:07 GMT
"శ్రీనివాస కల్యాణం పేరిట అనధికారికంగా 'శ్రీనివాస కల్యాణాలు' నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవు అని టిటిడి హెచ్చరించింది.
యూకేలో ఓ సంస్థ శ్రీనివాస కల్యాణం నిర్వహించడంతో ఒక్కొక్కరి నుంచి £ 566 పౌండ్లు రుసుం వసూలు చేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై టీటీడీ సీరియస్ గా స్పందించింది. విచారణ జరపాలని టీటీడీ సీవీఎస్ఓను ఆదేశించారు.
దేశ, విదేశాల్లో సాధారణంగా శ్రీనివాస కల్యాణోత్సవాలు దాతల సహకారంతో టీటీడీ నిర్వహిస్తుంది. దీనికి తిరుమల నుంచి ఉత్సవ విగ్రహాలతో పాటు వేదపండితులు, పరిచారికలు, అధికారులు, సిబ్బంది వెళతారు. దశాబ్దాల కాలంగా ఈ పద్ధతి అమలు చేస్తున్నారు. అయితే,
ఈ నెల ఆరో తేదీ యూకేలోని శ్రీఅద్వైత సేవా సమితి పేరుతో ఓ సంస్థ యూనైటెడ్ కింగ్డమ్ లోని Slough SL 1 3 LW వద్ద Singh Sabha Slough Sports Centreలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాస కల్యాణ మహోత్సవాన్ని నిర్వహించింది. ఆ ఆహ్వాన పత్రిక వాట్సాప్ గ్రూప్ లలో వైరల్ అయింది. దీనిని గమనించిన టీటీడీ సీవీఎస్ఓ అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లారు.
టీటీడీ సీరియస్
యూకేలో శ్రీనివాస కల్యాణ మహోత్సవం కార్యక్రమం అనధికారికంగా నిర్వహించడంతో పాటు తమ లోగోను వాడడంపై టీటీడీ సీరియస్ గా స్పందించింది. ఆ సంస్థపై చర్యలు తీసుకునేందుకు విచారణకు ఆదేశించారు.
యూకేలో జరిగిన కల్యాణోత్సవంపై టీటీడీ ఈఓ పక్షాన సమాచార శాఖ ప్రకటన విడుదల చేసింది.
"యూకేలో నిర్వహించిన శ్రీఅద్వైత సేవా సమితి పేరుతో ఓ సంస్థ నిర్వహించిన కల్యాణోత్సవానికి ఏపీఎన్ఆర్టీఎస్ నుంచి అనుమతి లేదు. టిటిడి కూడా ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదు. అయినా ఆహ్వాన పత్రికలో టిటిడి లోగో వాడారు. తమ అనుమతి లేకుండా అనధికారికంగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం భక్తులను తప్పుదారి పట్టించడమే. భక్తులను గందరగోళానికి గురిచేయడమే" అని టీటీడీ స్పష్టం చేసింది. కల్యాణోత్సవ ఆహ్వాన పత్రికలో ఉచితం అని ప్రస్తావించినా, ప్రత్యేక సేవలకు సంబంధించిన వివరాలు ఇవ్వలేదు. భక్తుల నుంచి సేవా ఫీజుల పేరుతో వసూళ్లు చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా, ఆహ్వాన పత్రంపై ఉన్న క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేయగా, భక్తుల రిజిస్ట్రేషన్ వివరాలతో పాటు సేవా ఫీజు (£ 566 పౌండ్లు) వసూళ్లు చేస్తున్నట్లు సమాచారం కనిపించింది" అని టీటీడీ అధికారులు ఆ సంస్థ వసూల్లకు పాల్పడిన వైనాన్ని టీటీడీ అధికారులు బహిర్గతం చేశారు.
"కల్యాణోత్సవానికి హాజరైన వారికి టిటిడి కల్యాణ లడ్డూ ప్రసాదం, ఒక వెండి లాకెట్, ఒక నవరమ్ వేద వస్త్రం, అక్షింతలు, పసుపు, అమ్మవారి కుంకుమ, చీర, మంగళ్యం ధారం, జాకెట్టు, శ్రీవేంకటేశ్వర స్వామి వారి ఫోటో ఫ్రేమ్ ఇస్తామని కూడా స్కానర్ చేసినప్పుడు గమనించాం" అని టీటీడీ స్పష్టం చేసింది.
"నకిలీ శ్రీనివాస కల్యాణ మహోత్సవంపై ఫిర్యాదు రావడంతో చర్యలు తీసుకునేందుకు ఈఓ విజిలెన్స్ శాఖను టిటిడి ఆదేశించారు" అని టీటీడీ చీఫ్ పీఆర్ఓ తలారి రవి చెప్పారు.
భక్తులను గందరగోళానికి గురిచేసే అనధికార కార్యక్రమాలపై అప్రమత్తంగా ఉండాలని టిటిడి సూచించింది. టిటిడి నుండి ఎలాంటి అనుమతులు లేకుండా టిటిడి పేరుతో శ్రీనివాస కల్యాణ మహోత్సవం జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. నకిలీ కల్యాణోత్సవాల పేరుతో ఎవరైనా సమాచారాన్ని వైరల్ చేసి డబ్బు కోరితే టిటిడి విజిలెన్స్ విభాగం దృష్టికి తీసుకురావాలని సూచించారు.