ఈ ముగ్గురు TDP ఎమ్మెల్యేలకు శిక్ష, ఏముంటుంది?

ఒక మహిళ పట్ల అసభ్యంగా వ్యవహరించారనే ఆరోపణలు;

Update: 2025-08-18 04:00 GMT
CM Chandrababu

తెలుగుదేశం పార్టీ తమ ఎమ్మెల్యేల పని తీరును తీవ్రంగా తప్పు పడుతోంది. ఇష్టానుసారం వ్యవహరిస్తే కుదరదని హెచ్చరిస్తోంది. అయినా ఎవరికి వారు వారి ఇష్టం వచ్చినట్లు నియోజకవర్గాల్లో రెచ్చిపోతున్నారు. తెలుగుదేశం పార్టీలో గతంలో ఉన్న క్రమ విక్షణ లేదనే ఆవేదన పార్టీ నాయకత్వం నుంచి వ్యక్తమవుతోంది. ముఖ్యమంత్రి కూడా ఇప్పటికే అనేక సార్లు సర్వేలు చేయించి అవినీతి ఆరోపణలు ఉన్న ఎమ్మెల్యేలతో మాట్లాడుతున్నారు. రోజుకు ఒకరిద్దరు చొప్పున పిలిపించి మాట్లాడుతున్నారు. ఎక్కువ పనులు ఉన్న సమయంలో కాకుండా కాస్త తీరిక దొరిక సందర్భంగలో ఆరోపణలు ఎదుర్కొటున్నంటున్న ఎమ్మెల్యేలను పిలిచి మాట్లాడుతున్నారు. ఇప్పటికే 30 మంది వరకు ఎమ్మెల్యేలను పిలిచి మాట్లాడారు. ఇంకా మరో 20 మంది వరకు ఇలా మాట్లాడాల్సిన వారు ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం.

టీడీపీ ఎమ్మెల్యేలకు కొనసాగుతున్న వన్ టు వన్ హెచ్చరికలు

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేకించి సర్వేలు చేయించారు. ఆ రిపోర్టుల ఆధారంగా నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీకి తీవ్రస్థాయి ఇబ్బందులు తప్పవని భావించిన చోట ఎమ్మెల్యేలను పిలిపించి మాట్లాడుతున్నారు. విచిత్రం ఏమిటంటే సీనియర్లు కూడా ఈ జాబితాలో ఉండటం. ముఖ్యమంత్రి అనేక సందర్భాల్లో మాట్లాడుతూ ప్రజల సంక్షేమం కోసం పార్టీ నాయకులు నిత్యం సిద్ధంగా ఉండాలని అన్నారు. అయితే ఇప్పటికే పార్టీ పరంగానే కాకుండా స్థానిక పరిస్థితుల దృష్ట్యా ఎమ్మెల్యేలపై వ్యతిరేకత రావడంతో ఆయనకు ఏమి చేయాలో దిక్కుతోచలేదు. అందుకే రోజుకు నలుగురు చొప్పున పిలిపించి మాట్లాడుతున్నారు.

సీఎం దృష్టిలో సీరియస్ అంశాలు

ప్రధానంగా ఇసుక అక్రమ రవాణా, స్థానికంగా ఉండే మైనింగ్ కాంట్రాక్ట్ లు, లీజులు, గనుల తవ్వకాలకు సంబంధించి అనుమతులు పొడింపులు, దౌర్జన్యంగా క్వారీల్లో పార్టీ నేతల కనుసన్నల్లో తవ్వకాలు చేపట్టడం వంటి అంశాలు సీఎం చంద్రబాబు దృష్టికి వచ్చాయి. వీటితో పాటు మద్యం దుకాణా దారులపై దౌర్జన్యాలు, నెలవారీ మామూళ్లు వంటి అంశాలు కూడా ముఖ్యమంత్రి దృష్టిలో సీరియస్ గా ఉన్నాయి. ఇవన్నీ ఒక్కసారిగా పరిష్కరించడం చేతకాకపోయినా కొంతవరకైనా కట్టడి చేయలేకపోతే పార్టీకి తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉందని సీఎం చంద్రబాబు బావించారు.

ప్రజల్లో ఎక్కడ ఏ ప్రస్తావన వచ్చినా తెలుగుదేశం పార్టీలోని వారిపైనే చర్చ జరుగుతుంది తప్ప జనసేన, బీజేపీ వారిపై చర్చకు అవకాశం రావడం లేదు. హత్యకేసులో ఇటీవల శ్రీకాళహస్తి జనసేన ఇన్చార్జి కోటా వినుత అరెస్ట్ కావడం, జనసేన పార్టీ ఆమెను పార్టీ నుంచి తప్పించడం జరిగాయి. ఇక బీజేపీ వారిపై ఇప్పటి వరకు ఎటువంటి ఆరోపణలు రాలేదు. నిత్యం తెలుగుదేశం వారిపై మాత్రం ఆరోపణలు వస్తూనే ఉన్నాయి.


ముగ్గురు ఎమ్మెల్యేల తీరుపై తీవ్ర అసంతృప్తి

సీఎం నారా చంద్రబాబు నాయుడు ఇటీవల ముగ్గురు ఎమ్మెల్యేల ప్రవర్తనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గుంటూరు ఈస్ట్, ఆముదాలవలస ఎమ్మెల్యేలు, అలాగే అనంతపురం జిల్లాలోని పార్టీలో ఏర్పడిన విభేదాలపై ఆయన సీరియస్ అయ్యారు. పార్టీకి నష్టం కలిగించే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని హెచ్చరించారు. మూడు ఘటనలపై నివేదికలు కోరారు. ఎమ్మెల్యేల వ్యవహారం విమర్శలకు తావివ్వకుండా ఉండాలని సూచించారు.

టీడీపీలో అంతర్గత సవాళ్లు

2024 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రజా సంక్షేమం, అభివృద్ధిపై దృష్టి సారించింది. అయితే పార్టీలోని కొంతమంది నాయకుల ప్రవర్తన, అంతర్గత విభేదాలు ప్రభుత్వ ఇమేజ్‌కు మచ్చ తెచ్చేలా ఉన్నాయి. ముఖ్యంగా గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే మహ్మద్ నసీర్ అహ్మద్‌పై వచ్చిన ఆరోపణలు (ఒక మహిళతో అసభ్యకర వీడియో కాల్ ఆరోపణలు) పార్టీని ఇబ్బంది పరిచాయి. ఇలాంటి ఘటనలు ప్రతిపక్షాలకు ఆయుధాలుగా మారి, ప్రభుత్వాన్ని విమర్శించే అవకాశం ఇస్తున్నాయి. చంద్రబాబు పార్టీ శ్రేణుల్లో క్రమశిక్షణను కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఈ విషయాలపై సీరియస్ అయ్యారు.

గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యేపై తీవ్ర ఆగ్రహం

గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నసీర్ అహ్మద్‌పై వచ్చిన ఆరోపణలు పార్టీకి పెద్ద ఎదురుదెబ్బ. ఒక మహిళా కార్పొరేటర్ అభ్యర్థితో అసభ్యకర వీడియో కాల్ చేసినట్లు వచ్చిన ఆరోపణలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఎస్ఆర్‌సీపీ దీనిని ఆధారంగా చేసుకుని టీడీపీపై విమర్శల వర్షం గుప్పించింది.

ఇది వ్యక్తిగత సమస్యగా కనిపించినా పార్టీ ఇమేజ్‌పై ప్రభావం చూపిందని చెప్పొచ్చు. మహిళల రక్షణ, మానత్వం వంటి అంశాలపై టీడీపీ బలమైన స్టాండ్ తీసుకుంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇలాంటి ఘటనలు ప్రజల్లో విశ్వాసాన్ని దెబ్బతీస్తాయి. పార్టీ అధ్యక్షులు, సీఎం చంద్రబాబు నివేదిక కోరడం ద్వారా పార్టీలో జవాబుదారీతనాన్ని పెంచుతున్నారు. ఇది భవిష్యత్తులో ఇతర నాయకులకు హెచ్చరికగా మారవచ్చు.

ఆముదాలవలస ఎమ్మెల్యేపై అసంతృప్తి

ఆముదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ ప్రవర్తనపై కూడా చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒక మహిళా ప్రిన్స్ పాల్ పై నోరు పారేసుకున్నారనే విమర్శలు వచ్చాయి. దీనిపై దళిత సంఘాలు ఎమ్మెల్యే తీరును తీవ్రంగా నిరసించారు. ఆమెకు క్షమాపణ చెప్పకపోతే ఆందోళనకు దిగాల్సి ఉంటుందని హెచ్చరించారు. నియోజకవర్గంలో అభివృద్ధి పనులు సరిగా జరగకపోవడం, స్థానిక నాయకులతో సమన్వయ లోపం వంటి ఫిర్యాదులు వచ్చాయి. ఇటీవల శ్రీకాకుళం జిల్లాలో పార్టీ కార్యక్రమాల్లో కూడా కొన్ని అసమ్మతి గళాలు వినిపించాయి.

ఉత్తరాంధ్ర ప్రాంతంలో టీడీపీకి బలమైన పునాది ఉంది. అయితే అంతర్గత సమస్యలు ప్రతిపక్షాలకు అవకాశం ఇస్తాయి. చంద్రబాబు ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకోవడం ద్వారా నియోజకవర్గ స్థాయిలో పార్టీని బలోపేతం చేయాలనుకుంటున్నారని స్పష్టమవుతోంది. ఇది ప్రభుత్వం చెప్పిన దానిపై దృష్టి పెట్టడానికి సహాయపడుతుంది. కానీ పార్టీలోని నాయకులకు మధ్య విభేదాలు పెరిగితే భవిష్యత్ ఎన్నికల్లో నష్టం జరగవచ్చని ముందుగానే భావించిన చంద్రబాబు నాయుడు ఎలాగైనా పార్టీ నాయకులను సరైన మార్గంలో నడిపించేందుకు ప్రయత్నిస్తున్నారు.

అనంతపురం టీడీపీలో రచ్చ రచ్చ...

అనంతపురం జిల్లా టీడీపీలో అంతర్గత విభేదాలు రచ్చరచ్చ అవుతున్నాయి. స్థానిక నాయకుల మధ్య గ్రూపులు, అభివృద్ధి పనుల్లో అవకతవకలు, నాయకత్వ ఆధిపత్యం వంటి సమస్యలు ఉన్నాయి. ఇటీవల కొందరు నాయకులు పార్టీ నిర్ణయాలను ప్రశ్నించారు. అనంతపురం అర్బన్ సిట్టింగ్ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ అవినీతికి పాల్పడుతున్నాడని మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి ఆరోపిస్తున్నారు. వీరిద్దరి మధ్య ప్రెస్మీట్ల వార్ నడుస్తోంది. ఎమ్మెల్యే అవినీతి చేస్తున్నాడని, నా దగ్గర రికార్డులతో సహా ఆధారాలు ఉన్నాయని మాజీ ఎమ్మెల్యే చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీ నాశనం అవ్వడానికి కూడా నువ్వే కారణం అవుతావని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో తనకు టికెట్ ఇచ్చినా పోటీ చేయనని మాజీ ఎమ్మెల్యే చెప్పడం విశేషం. ఈ విషయాన్ని లోకేష్ కు కూడా చెప్పానని అన్నారు.

మీరు కూడా అక్రమ సంపాదన గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేశారని ప్రస్తుత ఎమ్మెల్యే ఆరోపించారు. తాను అక్రమ సంపాదనకు పాల్పడ్డట్టు నిరూపించాలని ప్రభాకర్ చౌదరి సవాల్ విసిరారు.

జిల్లా కేంద్రంలో ఉన్న నాయకుల మధ్య పొలికల్, అవినీతి వార్ నడుస్తుండటంతో పార్టీకి తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉందని చంద్రబాబు భావించారు.

రాయలసీమ ప్రాంతంలో పార్టీ పట్టు సడలకుండా చూసుకోవాలనే ఆలోచనలో టీడీపీ ఉంది. విభేదాలు పెరిగితే వైఎస్ఆర్‌సీపీ వంటి ప్రతిపక్షాలు లబ్ధి పొందుతాయనే విషయం నాయకులకు వివరించే పనిలో పార్టీ అధిష్టానం ఉంది. చంద్రబాబు వార్నింగ్ ఇవ్వడం ద్వారా పార్టీ ఐక్యతను కాపాడుకోవాలనుకుంటున్నారు. ఇది ప్రభుత్వంలోని మంత్రులు, ఎమ్మెల్యేలకు సందేశంగా భావిస్తున్నారు. వ్యక్తిగత లాభాల కంటే పార్టీ ప్రయోజనాలు ముఖ్యం మనే విషయాన్ని వారికి ఎప్పటికప్పుడు వివరిస్తున్నారు.

నివేదికలు కోరిన చంద్రబాబు

చంద్రబాబు ఈ మూడు ఘటనలపై నివేదికలు కోరడం, వార్నింగ్ ఇవ్వడం ద్వారా పార్టీలో క్రమశిక్షణను బలోపేతం చేస్తున్నారు. ఇది టీడీపీ రాజకీయ వ్యూహంలో భాగం. ప్రజలకు బాధ్యతాయుతమైన ప్రభుత్వంగా కనిపించాలి. చంద్రబాబు తీసుకునే నిర్ణయాల వల్ల పార్టీ శ్రేణుల్లో భయభక్తులు పెరిగి పనితీరు మెరుగుపడుతుందనే ఆలోచనలో పార్టీ ఉంది. అసమ్మతి గళాలు పెరిగి పార్టీ బలహీనపడకుండా ఉండాలంటే నాయకుల మధ్య విభేదాలపై కఠిన నిర్ణయాలు తీసుకోవాలనే ఆలోచనలో సీఎం బాబు ఉన్నారు. పార్టీలోని అంతర్గత కుమ్ములాటలను ప్రతిపక్షాలు రాజకీయంగా వాడుకునే అవకాశాన్ని దూరం చేసే పనిలో సీఎం ఉన్నారని ఆయన చర్చలు స్పష్టం చేస్తున్నాయి.

పార్టీకి నష్టం చేసే చర్యలపై కఠిన నిర్ణయాలు

చంద్రబాబు నాయుడు ఈ అంశాలపై సీరియస్ అవడం టీడీపీకి తప్పనిసరైంది. పార్టీకి నష్టం చేసే చర్యలను ఉపేక్షించకుండా, ఎమ్మెల్యేలు విమర్శలకు తావివ్వకుండా ప్రవర్తించేలా చేయాలనే ఆలోచన పార్టీ అధిష్టానంలో ఉంది. ఇది ప్రభుత్వం దీర్ఘకాలిక లక్ష్యాలు, అభివృద్ధి, సంక్షేమం సాధించడానికి సహాయపడుతుంది. భవిష్యత్తులో ఇలాంటి సమస్యలను నివారించడానికి పార్టీ అంతర్గత మెకానిజమ్‌ ను బలోపేతం చేయాలనే ఆలోచనలో చంద్రబాబు నాయుడు ఉన్నారు. రాజకీయాల్లో క్రమశిక్షణే విజయానికి మూలంగా ఉంటుందని పలు మార్లు పార్టీ సమావేశాల్లో ఆయన చెప్పుకొచ్చారు.

Tags:    

Similar News