ఆంధ్రుల తుది తీర్పు ఎలా ఉంటుందో?

ఆంధ్రలో పోలింగ్ పండగకు వేళయింది. మే 13న నేతలు తమ అధృష్టాన్ని పరీక్షించుకోనుంటే.. ప్రజలు తమ భవిష్యత్తును శాసించే ఓటును వేయనున్నారు.

Update: 2024-05-11 05:26 GMT

"అందరూ ఉద్దండులే

అయినా ఎవరి దడ వారిది

లేస్తే మనిషి కాడని అన్నా

ఇంతకీ లేవగలిగిన సత్తా ఎవరికుందో

నిక్కచ్చిగా చెప్పలేరెవరూ

సర్వేల్లో అందరూ సర్వారాయళ్ళే

టీవీ చానళ్ళలోనూ తేల్చి చెప్పలేని చర్చలే

ఓటర్లేమో గప్ చుప్ సంబార్ బుడ్డీ!

మరి సక్ససర్ ...?

సస్పెన్స్... సస్పెన్స్... సస్పెన్స్...!"

ఇదేదో వ్యంగ్య కవిత్వం, ఎకసెక్కెపు మాటలు అనుకోవద్దు. నిజం, ఇది నిజమైన నిజం. ఇక ఎన్నికలకు రెండు రోజులే ఎడం. అయినా జనం నాడి ఎవరికీ అంతు చిక్కడంలేదు.

ఒకేఒక్కడు. ఒంటరి పోరాటం. ఎందరు ఏకమై వచ్చినా సరే, మేము సిద్ధం! అంటుంది రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అయిదేళ్ళ తన పాలనలో అమలు చేసిన ప్రజా సంక్షేమ పథకాలే ఈ ఎన్నికల కురుక్షేత్రంలో తమకు గెలుపు సాధించిపెట్టే తిరుగులేని అస్త్ర శస్త్రాలని ఆ పార్టీ ధీమాగా ఉంది. అట్టడుగు సామాజిక వర్గాల ఓట్లు గంపగుత్తగా తమకేనని వారి ధీమా కూడా. అంతేకాదు, మైనారిటీల ఓట్లపై కూడా వారికి గట్టి ఆశలే ఉన్నాయి. అందుకు కారణం లేకపోలేదు. ఎన్‌డిఏ కూటమిలో తెలుగుదేశం, జనసేన పార్టీలు చేరిపోయాయి. బిజెపి వ్యవహార శైలి రీత్యా ఆ వర్గం ఓటర్లు మొత్తంగా ఎన్‌డిఏను వ్యతిరేకిస్తున్నారు. కనుక ఆ ఓట్లు ఆ కూటమికి పడవు. కాంగ్రెస్ నాయకత్వంలోని ఇండియా కూటమి ఈ రాష్ట్రంలో ఎన్నికల వాతావరణాన్ని ప్రభావితం చేసే స్థితిలో లేదు. అందువల్ల బడుగు బలహీన వర్గాల, మైనారిటీల, దిగువ మధ్య తరగతి ఓట్లన్నీ తమసొంతం అన్నధీమతోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు ఎన్నికల సమర శంఖాన్ని పూరించారు. సమర ఉత్సాహాన్ని ప్రదర్శించారు.

ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ, దాని ప్రధాన మిత్రపక్షం జనసేన పార్టీ, నేటి అవసరార్థ మిత్రపక్షం అయిన కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ. ఇవన్నీ కలిసిమెలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో తలపడుతున్నాయి. అధికారపార్టీ అయిదేళ్ళ పాలనలో సాగించిన అవినీతి, అక్రమాలు, మాఫియా రూపంలో యథేచ్చగా సాగించిన దోపిడీ, రాష్ట్ర రాజధాని విచ్ఛిన్నం, ప్రభుత్వ ముసుగులో నేరస్థ గుంపులను, కొన్ని సందర్భాల్లో ప్రభుత్వ వ్యవస్థల్నే హింసా దౌర్జన్య కార్యకలాపాలకు ప్రోత్సహించిన తీరుతెన్నులు ఈ రణక్షేత్రంలో ప్రత్యర్ధిపై ఎక్కుపెట్టిన పాశుపత, బ్రహ్మాస్త్రాలుగా భావిస్తున్నారు. అయితే ఇరు పక్షాలూ ఈ రాజకీయ, విధానపరమైన విమర్శలకే పరిమితం కాకుండా వ్యక్తిత్వ హనన స్థాయికి తమ విమర్శలను దిగజార్చారు. ఎన్నికల ఉపన్యాసాల దిగజారుడుకు ఇది పరాకాష్ఠగా పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. కుటుంబ స్త్రీలను కూడా ఇందులోకి లాగడాన్ని సాధారణ పౌరులు కూడా తప్పు పడుతున్నారు. కానీ వాటిని ఆయా రాజకీయ పార్టీల నాయకులెవరూ పట్టించుకోలేదు.

జాతీయ స్థాయిలో ప్రధాన ప్రతిపక్షం "ఇండియా కూటమి". భారత జాతీయ కాంగ్రెస్, భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ), భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు (సిపిఐఎం), డిఎంకే మరికొన్ని ఉత్తరాది ప్రాంతీయ పార్టీల కూటమి అది. కానీ రాష్ట్రంలో దాని ప్రభావం నామమాత్రమే. అయితే అది చీల్చే 1 లేదా 2 శాతం ఓట్ల ప్రభావానికి ఎవరు బలవుతారు అనే భయం ఇరు పక్షాల్నీ వెంటాడుతోంది. ఎందుకంటే ఈ హోరాహోరీ పోరులో ఆ చీలిక కూడా ఫలితాల్ని ప్రభావితం చేస్తుంది.

సామాజిక వర్గాల రీత్యా చూస్తే మధ్యతరగతి, ఆ పైవర్గాల మద్దతు ఎన్‌డిఏ కూటమికి బలాన్ని చేకూర్చే ప్రధాన అంశం. దిగువ మధ్యతరగతి, అట్టడుగు వర్గాల మద్దతు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నైతిక శక్తిగా నిలిచే అంశం. ఇవి ఆయా పార్టీలకు, రాజకీయ విశ్లేషకులకూ ఉన్న దాదాపు ఏకాభిప్రాయం.

ఇంతకీ ప్రజాభిప్రాయం ఏమిటి? వారి భావ ప్రకటనలు ఏమి సూచిస్తున్నాయి? అభిప్రాయ వ్యక్తీకరణలూ ఏమి చెపుతున్నాయి? ఈ గుట్టు ఓటరు గుండెల్లోనే ఉంది. బహిర్గతం కావడంలేదు. రాజకీయ పార్టీల ఆకాంక్షలను అర్థం చేసుకున్న ఓటర్లు తెలివిగా జాగరూకతతో వ్యవహరిస్తున్నారు. రేపు ఎవరు అధికారంలోకి వచ్చినా తమకు, తమ ప్రయోజనాలకు భంగం కలగకూడదనే ఒక స్పష్టమైన అవగాహనతో ఓటర్లు వ్యవహరిస్తున్నారు. వారిచ్చే ఎన్నికల బహుమతులన్నింటినీ అందిపుచ్చుకుంటున్నారు. ఎవరి సభకెళితే వారికి గొంతెత్తి జై కొడుతున్నారు. (మరి ఎన్నికల సభల్లో వేదికల పైకీ, నాయకుల వైపునకు దూసుకెళ్ళిన వస్తువుల గురించి అంటారా! అవన్నీ ఉత్తుత్తి నాటకాలని అందరికీ అర్థమైంది. అందుకే వాటినెవరూ పట్టించుకున్న దాఖలాలు లేవు. వాటి ప్రభావమూ కనబడటం లేదు.) ఈ నేపథ్యంలోనే 48గంటల్లో ఓటర్లు నిజమైన తీర్పును ఇవ్వనున్నారు.

ఎన్నికల ప్రచార యుద్ధం ప్రారంభంలో అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఉత్సాహం, ఆత్మ విశ్వాసం చివరికంటా నిలబడలేదు. గత నాలుగు రోజుల్లో దాని బేలతనం ద్యోతకం అవుతోంది.

ఎన్నో భయాలు తటపటాయింపులతో రంగంలోకి దిగిన ప్రతిపక్షం క్రమక్రమంగా ఆత్మశక్తిని పుంజుకున్నట్టు కనిపిస్తోంది. అందుకు తగ్గ సంకేతాలనిస్తూ ఓటర్ల తుది తీర్పును తమవైపు తిప్పుకొనేందుకు అవసర మైన ఆత్మ విశ్వాసాన్ని ప్రదర్శిస్తోంది. మరి ఆంధ్రా ఓటర్లు ఇచ్చే తుదితీర్పు ఎలా ఉంటుందో? ఎన్నికల తెరవైపు వేచి చూద్దాం!

‌‌ - కె. శరచ్చంద్ర జ్యోతిశ్రీ

Tags:    

Similar News