జనసేన మహిళ నేత ఇంటిలో దొరికిన డ్రైవర్ ఫోన్ లో ఏమి ఉంది?
చెన్నై పోలీస్ కమిషనర్ దర్యాప్తులో ఏమి తేల్చారు?;
Byline : SSV Bhaskar Rao
Update: 2025-07-13 12:54 GMT
శ్జరీనసేన నాయకురాలి కారు డ్రైవర్ టీడీపీ ఎమ్మెల్యేకి కోవర్ట్ గా పని చేశాడా? మహిళా నేత కోట వినూత బెడ్ రూంలో కారు డ్రైవర్ శ్రీనివాసులు (రాయుడు) (22) సెల్ ఫోన్ ఉంచి ఏమి చేశాడు. ఆ పని చేయమని ప్రేరేపించింది ఎవరు? ఆ సంఘటనతోనే రాయుడు హత్యకు గురయ్యాడా?
ఈ హత్య కేసును తమిళనాడు పోలీసులు రెండు రోజుల్లోనే ఎలా ఛేదించారు?
చెన్నై నగర పోలీస్ కమిషనర్ ఏ. అరుణ్ వెల్లడించిన అంశాలతో చాలా విషయాలపై స్పష్టత ఇచ్చారు.
గుర్తు తెలియని యువకుడి మృతదేహం ఆనవాళ్లు, నిందితులను సాంకేతిక ఆధారాలు పట్టించాయి.
ఆ వివరాలు పరిశీలిద్దాం...
జూలై 8.
చెన్నై నగరం ఎంఎస్ నగర్ తమిళనాడు హౌసింగ్ బోర్డ్ కాలనీ వెనుక ఉన్న కూవం నది నాల్గవ ప్రవేశద్వారం సమీపంలో హత్యకు గురైన ఓ యువకుడి మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు.
ఎగ్మోర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్టాన్లీ ప్రభుత్వ ఆసుపత్రికి పోస్ట్‌మార్టం కోసం తరలించారు. ఆ యువకుడు హత్యకు గురైనట్లు శవపరీక్షలో నిర్ధారణ అయింది. ఏదో గుర్తు తెలియని శవమే కాదా. అని చెన్నై పోలీసులు ఆషామాషీగా తీసుకోలేదు.
నిఘా నేత్రం ఉందని మరిచారు..
కారులో వచ్చిన కొందరు యువకుడి మృతదేహాన్ని మోసుకుంటూ వచ్చి, నదిలో పడేశారు. తమను ఎవరూ చూడలేదు అని వారికి వారు సర్దిచెప్పుకున్నారు. కానీ, నడి ఒడ్డున సీపీ కెమెరాలు ఉన్నాయనే విషయం వారికి స్ఫురణకు రాలేదు. అ తప్పే నిందితులను పట్టించింది.
పోస్టుమార్టం నివేదికలో యువకుడిది హత్య అని తేలింది. పోలీసులు సీపీ టీవీ పుటేజీ పరిశీలించారు. నిందితులు తచ్చిన కారు రిజిస్ట్రేషన్ నంబర్ ద్వారా వారు ఎక్కడి వారు? ఎక్కడి నుంచి వచ్చారనే విషయం నిర్ధారించుకున్నారు. వెంటనే,
జనసేన ఐటీ విభాగం నాయకుడు శివకుమార్, కాళహస్తి నియోజకవర్గ ఇన్చార్జి వినుత కోట, ఆమె భర్త చంద్రబాబు, వారి సహాయకుడు గోపి, కారు డ్రైవర్ షేక్ దాసన్ ను అదుపులోకి తీసుకుని విచారణ చేశారు.
విచారణలో ఏమి తేలింది?
చెన్నై నగర పోలీస్ కమిషనర్ ఏ. అరుణ్ కథనం మేరకు..
2019 నుంచి శ్రీనివాసులు (రాయుడు)ను కాళహస్తి జనసేన ఇన్ చార్జి కోట వినుత కారు డ్రైవర్ గా నియమించుకుంది. ఆ యువకుడు వ్యక్తిగత సహాయకుడిగా కూడా సేవలు అందించారు. పోలీస్ కమిషనర్ అరుణ్ ఏమి చెప్పారంటే..
శ్రీనివాసులు (రాయుడు)
"తన మంచం దాచిన మొబైల్ ఫోన ను వినూత గమనించింది. పరిశీలిస్తే, పడక గదిలో దుస్తులు మార్చుకుంటున్న దృశ్యాలు కనిపించాయి"
"ఆ ఫోన్ తన కారు డ్రైవర్ శ్రీనివాసులుదిగా వినూత గుర్తించడంతో ఇక్కడే కథ మలుపు తిరిగింది" అని కమిషనర్ అరుణ్ చెప్పారు.
"ఈ విషయాన్ని వినూత తన భర్త చంద్రబాబుకు చెప్పింది. దీంతో శ్రీనివాసులును దారుణంగా కొట్టి, చిత్రవద చేసి హత్య చేశారనే విషయం బయటపడింది" అని కమిషనర్ మీడియాకు కూడా చెప్పారు.
టీడీపీ ఎమ్మెల్యేకు కోవర్ట్
శ్రీకాళహస్తికి చెందిన తెలుగుదేశం పార్టీ ( TDP) ఎమ్మెల్యే ( MLA ) బొజ్జల సుధీర్ కుమార్ రెడ్డి తనకు డబ్బు ఇచ్చి, ఈ పని చేయించారని కారు డ్రైవర్ శ్రీనివాసులు అంగీకరించిన విషయాన్ని వినూత పోలీసులకు కూడా చెప్పినట్లు సమాచారం.
ఇదే సమాచారం జనసేన రాష్ట్ర నాయకత్వానికి నివేదించడంతో వారు సమస్యను పరిష్కరించేందుకు మధ్యవర్తిత్వం వహించడానికి ప్రయత్నించారని, ఆ తర్వాత, శ్రీనివాసులను ఉద్యోగం నుంచి తొలగించినట్టు విచారణలో అంగీకరించినట్లు తెలిసింది.
2024 ఎన్నికల్లో జనసేన నుంచి వినూతకు టికెట్ దక్కకపోవడం, టీడీపీ నుంచి బొజ్జల సుధీర్ గెలవడంతో వారి మధ్య రాజకీయంగా దూరం పెరిగింది.
ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ కు తన కారు డ్రైవర్ శ్రీనివాసులు కోవర్టుగా పనిచేయడం సహించలేని స్థితిలో వినూత, చంద్రబాబు తమ ఇంట్లో బంధించి, చాలా కాలం పాటు హింసించారని దర్యాప్తులో తేలింది.
వారి వాంగ్మూలాల ప్రకారం
జూలై 7న, శ్రీనివాసులు వినూత, చంద్రబాబు దంపతుల ఇంటి బాత్రూంలో చనిపోయాడు. శ్రీనివాసులు తాడుతో ఉరి వేసుకున్నట్లు చెప్పినా, తీవ్రంగా కొట్టి హింసించడం వల్లే జరిగిందని పోలీసుల దర్యాప్తులో బయటపడింది.
శ్రీనివాసులు చనిపోవడంతో భయాందోళనకు గురైన వినూత దంపతులు పార్టీ సహచరులు, వారి డ్రైవర్ సహాయంతో, మృతదేహాన్ని చెన్నైకి తరలించి, కూవం నది ఒడ్డున పడేసి, గుర్తు తెలియని మృతదేహంగా చిత్రీకరించాలనే పన్నాగం వికటించింది.
చెన్నై పోలీస్ కమిషనర్ అరుణ్ మీడియాతో మాట్లాడుతూ,
"శ్రీనివాసులు హత్యకు గురయ్యారని, అరెస్టు చేసిన జనసేన సభ్యులను విచారణ చేస్తున్నామని చెప్పార. తిరుపతి జిల్లా పోలీస్ అధికారులతో సమన్వయంతో ఎగ్మోర్ పోలీసులు, హింస జరిగినట్లు ఆరోపించిన స్థలాన్ని పరిశీలించారు. మరిన్ని ఆధారాలు ససేకరిస్తున్నారు" అని పోలీస్ కమిషనర్ అరుణ్ చెప్పారు.
"ఈ హత్య వెనుక ఉన్న అసలు కథ ఏమిటి? రాజకీయ ప్రేరేపితమా? కుట్ర అనేది తెలుసుకునేందుకు దర్యాప్తు పూర్తి చేయడం ద్వారా బాధితుడి కుటుంబానికి న్యాయం చేస్తాం" అని కమిషనర్ అరుణ్ స్పష్టం చేశారు.
(with inputs from P Mahalingam, Federal English from Chennai)