ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ బలమేమిటో చెప్పిన ‘స్త్రీ శక్తి’

చూట్టూ వాళ్లు, వాళ్ల జెండాలెే... బస్ లోనూ టీడీపీ శ్రేణులే... ఆ పరిసరాల్లో కనిపించని బీజేపీ జెండా...;

Update: 2025-08-16 12:10 GMT
ఉండవల్లి సెంటర్ లో టీడీపీ, జనసేన జెండాలు

బిజెపి కి సొంత బలం ఉందా లేదా అనేదానిపై ప్రస్తుతం రాష్ట్రంలో చర్చ జరుగుతుంది. కూటమి ద్వారా పోటీ చేసి ఓట్లు, సీట్లు సాధించారు తప్ప సొంతంగా బలం లేదని విజయవాడలో జరిగిన మహిళలకు ఉచిత బస్ ప్రారంభోత్సవ కార్యక్రమం రుజువు చేసింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉండవల్లి సమీపంలోని కృష్ణా కరకట్ట వద్ద ఉన్న తన క్యాంపు కార్యాలయం నుంచి విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ వరకు చేసిన బస్సు యాత్ర, రాజకీయంగా ఆసక్తికరమైన అంశాలను ముందుకు తెచ్చింది.

స్వాతంత్య్ర దినోత్సవం రోజున (ఆగస్టు 15, 2025) ప్రారంభమైన 'స్త్రీ శక్తి పథకం' ఎన్నికల్లో ఇచ్చిన 'సూపర్ సిక్స్' హామీల్లో ఒకటిగా మహిళల సాధికారతకు చిహ్నంగా నిలిచింది. ఈ యాత్రలో కనిపించిన పార్టీల జెండాలు, కార్యకర్తల స్పందనలు, ముఖ్యంగా బీజేపీ జెండాలు కనిపించకపోవడం వంటి అంశాలు రాజకీయ పరిశీలకుల్లో చర్చకు దారి తీశాయి.

పర్యటన జరిగిన తీరు
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన నివాసం నుంచి బస్ స్టేషన్ వరకు చేసిన ఈ యాత్ర సాధారణ ప్రజా ప్రయాణాన్ని ప్రతిబింబించేలా రూపొందించారు. బస్సులో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ ప్రయాణించడం ద్వారా ఎన్డీఏ కూటమి ఐక్యతను చాటి చెప్పారు. ముందుగా ప్రభుత్వం ఎంపిక చేసుకున్న కొందరు మహిళలను సీఎం నివాసానికి పిలిచారు. వారిని మొదట బస్ ఎక్కించడం, తరువాత నాయకులు ఎక్కడం, ఇది మహిళలను ముందుంచి పథకాన్ని వారి సాధికారతకు అంకితం చేసినట్టు కనిపించింది. బస్సులోని మహిళలు నాయకులతో ఒకరి తరువాత ఒకరు ముచ్చటించారు. ఈ సందర్భంగా వారి అభిప్రాయాలు నాయకులు తెలుసుకోవడం వంటివి ఈ యాత్రను సాధారణ ప్రచార కార్యక్రమం కంటే ఎక్కువగా ప్రజలతో నేరుగా సంబంధాలు పెంచుకునే అవకాశంగా మార్చాయి.
ఈ తీరు సీఎం చంద్రబాబు నాయుడు శైలికి అనుగుణంగా ఉంది. ఆయన ఎప్పుడూ పథకాలను ప్రారంభించేటప్పుడు సాంకేతికత, సామాజిక సందేశం (మహిళలకు ప్రాధాన్యత) కలిపి చేస్తారు. ఇది ప్రభుత్వం ప్రజలకు దగ్గరవుతున్నట్టు చూపించడమే కాక, మీడియా దృష్టిని ఆకర్షించడంలో సఫలమైంది. అయితే ఈ యాత్ర రాష్ట్ర వ్యాప్తంగా పథకం అమలుపై అందరి దృష్టిని ఆకర్షించింది. APSRTC బస్సుల్లో 74 శాతం బస్సులు ఈ పథకానికి అందుబాటులో ఉంచారు.

టీడీపీ, జనసేన ఆధిపత్యం
యాత్ర మార్గంలో రోడ్డుకు ఇరువైపులా స్థానికులు, పార్టీ కార్యకర్తలు జెండాలు పట్టుకుని నేతలకు జేజేలు పలుకుతూ కనిపించారు. ఉండవల్లి సెంటర్‌లో జనసేన జెండాలు ఎక్కువగా కనిపించడం, ఉండవల్లి, తాడేపల్లి, కృష్ణలంక ప్రాంతాల్లో టీడీపీ జెండాలు ప్రధానంగా ఉండటం, ఇది కూటమి పార్టీల బలాన్ని ప్రతిబింబిస్తుంది. అయితే జనసేన కార్యకర్తలు జెండాలు ప్రదర్శించడంలో రెండో స్థానంలో ఉన్నారు. టీడీపీ రాష్ట్రవ్యాప్తంగా బలమైన క్యాడర్‌ను కలిగి ఉంది. ముఖ్యంగా కృష్ణా జిల్లాలో సహజంగానే ఎక్కువ స్పందన వచ్చింది. పవన్ కల్యాణ్ ఇమేజ్‌తో యువత, మహిళలలో జనసేన మంచి ఆదరణ పొందింది. అందుకే ఉండవల్లి వంటి ప్రాంతాల్లో ఆ పార్టీ జెండాలు ఎక్కువగా కనిపించాయి.
ఈ స్పందన కూటమి ప్రభుత్వం ఎన్నికల తర్వాత హామీలు అమలు చేయడంపై సంతోషాన్ని చూపుతుంది. మహిళలు బస్సులో నాయకులతో మాట్లాడటం, స్థానికులు జేజేలు పలకడం ప్రభుత్వం పట్ల పాజిటివ్ సెంటిమెంట్‌ను సూచిస్తుంది. అయితే ఇది పూర్తిగా స్వచ్ఛందమా లేదా పార్టీలు మొబిలైజ్ చేశాయా అనేది ప్రశ్న. రాజకీయంగా ఇలాంటి ఈవెంట్లలో క్యాడర్ మొబిలైజేషన్ సహజం. మరి టీడీపీ, జనసేన దాన్ని సమర్థవంతంగా చేశాయని భావించాలా?

కనిపించని బీజేపీ క్యాడర్
ఈ యాత్రలో అత్యంత ఆసక్తికరమైన అంశం బీజేపీ జెండా పట్టుకున్న కార్యకర్తలు కనిపించకపోవడం. బస్సులో బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ ఉండటం ద్వారా నాయకత్వ స్థాయిలో కూటమి ఐక్యత కనిపించినా, గ్రాస్‌రూట్ లెవల్‌లో బీజేపీ పరిస్థితి ఏమిటనేది స్పష్టమైంది. ఉండవల్లి సెంటర్ కు దగ్గరలోకి రాగానే స్వామీజీ ఉండే ప్రాంతంలో నలుగురైదుగురు బీజేపీ జెండాలో కనిపించారు. ఇది ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ బలహీనతను హైలైట్ చేస్తుంది. రాష్ట్రంలో బీజేపీకి గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో బలమైన క్యాడర్ లేదు. ముఖ్యంగా కోస్టల్ ఆంధ్రాలో టీడీపీ ఆధిపత్యం ఉండటం, జనసేన యువ బలంతో అడుగులు వేస్తోంది. తెలుగుదేశం, జనసేనలు బీజేపీ సత్తా ఏమిటో తేటతెల్లం చేశాయి.

బస్ టిక్కెట్ నేనిస్తానంటున్న లోకేష్
టీడీపీ 135 సీట్లు, జనసేన 21, బీజేపీ 8 సీట్లతో కూటమి పార్టీలు గెలిచాయి. కానీ గ్రౌండ్ లెవల్‌లో బీజేపీ అలయన్స్ పార్టనర్లపైనే ఉంది. ఈ ఈవెంట్‌లో బీజేపీ క్యాడర్ మొబిలైజ్ కాని కారణాలు చెప్పాల్సి వస్తే... సంస్థాగత బలహీనత వల్ల ఈవెంట్‌ను టీడీపీ, జనసేన డామినేట్ చేశాయి. రాజకీయంగా ఇది బీజేపీకి సవాల్. భవిష్యత్ ఎన్నికల్లో (మున్సిపల్, పంచాయతీలు) బలపడాలంటే కూటమిలోనే పోటీ జరుగుతుందా? లేదా? అనే దానిపైనా చర్చ జరుగుతోంది. కూటమి ఐక్యతపై ఇది ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి. ఎందుకంటే నాయకత్వ స్థాయిలో ఉన్నా.. గ్రాస్‌రూట్ లో బీజేపీ డిస్‌కనెక్ట్ ఉందనేది స్పష్టమైంది.
మొత్తంగా ఈ యాత్ర ప్రభుత్వం హామీల అమలుపై దృష్టి సారించింది. మహిళల సాధికారతను ప్రోత్సహించేలా జరిగింది. టీడీపీ, జనసేన కార్యకర్తల ఉత్సాహం ప్రభుత్వం పట్ల సానుకూలతను చూపుతుంది. కానీ ఈ సందర్భంలో బీజేపీ కార్యకర్తలు లేదా వారి జెండాలు యాత్రలో కనిపించకపోవడం రాష్ట్రంలో ఆ పార్టీ సవాళ్లను ఎత్తిచూపుతుంది. ఈ పథకం దీర్ఘకాలంగా మహిళల జీవితాలను మార్చుతుందా? రాజకీయ స్టంట్‌గా మిగులుతుందా అనేది సమయమే చెప్పాలి.
Tags:    

Similar News