Parakamani Theft | తిరుమల పరకామణి క్రైం కథ
తిరుమల పరకామణిలో చోరీ డొంక కదిలింది. రూ. వంద కోట్ల చోరీ ఘటనపై బీజేపీ విచారణ కమిషన్ కోరుతోంది?;
Byline : SSV Bhaskar Rao
Update: 2024-12-29 11:01 GMT
తిరుమలలో చిన్నదొంగను గంటల వ్యవధిలో పట్టేశారు. రూ. వంద కోట్ల చోరీని తేలిగ్గా తీసుకున్నారు. ఇందులో వైసీపీ పెద్దల వ్యవహారం నిగ్గు తేల్చడానికి విచారణ కమిషన్ ఏర్పాటు చేయాలనే డిమాండ్ బీజేపీ తెరమీదకు తెచ్చింది. అసలు పరకామణి వ్యవహారం ఎలా ఉంటుంది. చోరీ వెనుక నడిచిన మంత్రాంగం ఏమటనే విషయాలు బీజేపీ నేత డీజీపీకి ఫిర్యాదు చేయడంతో చర్చకు వచ్చాయి.
2023 ఏప్రిల్ 29: తిరుమల శ్రీవారి పరకామణి (హుండీ కానుకలు లెక్కించే కేంద్రం)లో చోరీ ఘటన మళ్లీ తెరపైకి వచ్చింది. టీటీడీ ఉద్యోగి రవికుమార్ వంద కోట్ల రూపాయలు చోరీ చేశాడు. ఆయన నుంచి కమీషన్లు తీసుకున్న వారెవరో తేల్చాలని ఈ చోరీ డొంకను బీజేపీ కదిపింది.
2024 నవంబర్26 తిరుమల శ్రీవారి ఆలయం. యాత్రికులు సమర్పించిన కానుకలతో నిండుగా ఉన్న స్టీల్ హుండీ నుంచి ఓ భక్తుడు చోరీ చేశాడు. సీసీ పుటేజీలో గమనించిన సెక్యూరిటీ సిబ్బంది గాలింపు చేపట్టారు. నిందితుడిని అదే రోజు సాయంత్రం ఆరు గంటలకు అరెస్టు చేశారు. తమిళనాడుకు చెందిన వేణులింగంగా గుర్తించిన విజిలెన్స్ సిబ్బంది హుండీ నుంచి చోరీ చేసిన రూ. 15 వేలు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని పోలీసులకు అప్పగించారు. ఎంతచక్కగా పట్టుకున్నారో కదా?! డేగ కన్నులతో పర్యవేక్షించే టీడీడీ విజిలెన్స్, ఎస్పీఎఫ్, టీటీడీ సెక్యూరిటీ సిబ్బంది పనితీరు అభినందనీయమే. అయితే,
తిరుమల శ్రీవారి హుండీ నుంచి తరచూ విదేశీ కరెన్సీ చోరీ చేసిన ఉద్యోగి చేతివాటం ఎందుకు పసిగట్టలేకపోయారనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఈ విషయాన్ని నిగ్గు తేల్చాలని తిరుపతికి చెందిన బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, టీటీడీ పాలక మండలి సభ్యుడు జీ. భానుప్రకాశ్ రెడ్డి పోరాటం ప్రారంభించారు. కాగా,
బీజేపీ శేష ప్రశ్నలు
వైసీపీ పాలనలో శ్రీవారి హుండీ నుంచి వంద కోట్ల వరకు చోరీ చేసిన ఘటనపై విచారణ కమిషన్ వేయాలని బీజేపీ, నేత టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి ఈఓ జే. శ్యామలరావును కోరారు. అందుకు ఆయన అంగీకారం తెలిపారని చెప్పారు.
"ఈ విషయంపై ఇటీవల జరిగిన పాలక మండలిల సమావేశంలో కూడా ప్రశ్నించాను. విచారణకు బోర్డు చైర్మన్ బీఆర్. నాయుడు కూడా సంసిద్ధత తెలిపారు" అని భాను ప్రకాష్ రెడ్డి చెబుతున్నారు. మరో అడుగుముందుకు వేసిన భాను పార్టీ నేతలతో కలిసి రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమలరావుకు కూడా ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంలో "కొందరి పాత్రపై చేసిన ఆరోపణలతో శేష ప్రశ్నలుగా మిగిల్చారు"
ఆ ముగ్గురు రెడ్లు ఎవరు?
"తిరుమల పరకామణిలో వంద కోట్ల రూపాయల చోరీ వెనుక వైసీపీ పెద్దల హస్తం ఉంది" అనేది బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి సూటి ఆరోపణ. ఇదే సమయంలో ఆయన ఏమంటున్నారంటే..
ఈ చోరీ వ్యవహారంలో " ట్రిపుల్ ఆర్ ( RRR) లు ఉన్నారు. అంటే ముగ్గురు రెడ్డి సామాజికవర్గం వారు ఉన్నారు. వారిలో తిరుమలలో పనిచేసిన కడపకు చెందిన ఓ సీఐ పాత్ర ఉంది. వజ్రాలు, విదేశీ కరెన్సీ దోచుకున్న వ్యక్తి, అతని వెనుక ఉన్న కీలకమైన వారి వ్యవహారం బహిర్గతం చేయడానికి చర్యలు తీసుకోవాలనేది భానుప్రకాష్ రెడ్డి చేస్తున్న డిమాండ్. "త్వరలోనే శ్రీవారి హుండీకి కన్నం వేసిన ఘరాన పెద్దల బండారం బయటపెట్టడమే కాదు. వారిని ప్రజల ముందు నిలబెడతాం" అని కూడా హెచ్చరించారు.
"తిరుమల శ్రీవారి ఆలయం పరకామణి నుంచి కానుకలు లెక్కింపు పూర్తయ్యాక, హుండీకి రహస్య అర అమర్చి తరలించారు" అని నమ్మలేని నిజాన్ని భానుప్రకాష్ రెడ్డి జనంలోకి వదిలారు. ఇదిలావుంటే..
2024 జూలై 24 శాసనమండలిలో ఎంఎల్సీలు భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, పంచుమర్తి అనూరాధ, బీటీ. నాయుడు, రామారావు అడిగిన ప్రశ్నకు.. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి అసెంబ్లీలో విస్పష్టంగా ప్రకటించిన విషయం గమనార్హం.
"తిరుమలలో అనేక అక్రమాలు జరిగాయి. వైసీపీ ప్రభుత్వ కాలంలో పరకామణిలో రవికుమార్ అనే వ్యక్తి వంద కోట్ల రూపాయలకు సమానమైన అమెరికా డాలర్లు దారి మళ్లించడం వల్ల టీటీడీకి నష్టం వచ్చింది. దీంట్లో ఆనాటి టీటీడీ ఈఓ, చైర్మన్, సీఐ పాత్రపై ఆరోపణలు ఉన్నాయి. ప్రాథమిక విచారణ పూర్తయింది. పూర్తి నివేదిక వచ్చాక చర్యలు ఉంటాయి" అని మంత్రి రాంనారాయణరెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. నాలుగు నెలలు కావస్తున్నా, తుది నివేదిక ఏమి ఇచ్చారనేది తేలని స్థితిలో డీజీపీ ద్వారకా తిరుమలరావుకు ఫిర్యాదు చేయడం ద్వారా చోరీ తుట్టెను బీజేపీ నేత భానుప్రకాష్ కదిపి వదిలారు. ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్ గా మారింది.
తిరుమల శ్రీవారి హుండీ
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తరువాత జయవిజయులు (ఏడో వాకిలి) విగ్రహాల నుంచి ఎడమ చేతిపక్కన ఉండే దారిలో బయటకు రావాలి. వకుళమాతను దర్శించుకుని, సంపంగి ప్రాకారంలో ఉన్న శ్రీవారి ఆలయం చుట్టూ తిరిగి, ఆనందనిలయంపై ఉన్న విమాన వేంకటేశ్వరుని దర్శించుకుని కాస్త ముందుకు వస్తే, వైకుంఠ దక్షిణ ద్వారానికి పైన ఉన్న మహాలక్షి అమ్మవారి విగ్రహం ఎదుట శ్రీవారి కానుకల హుండీ ఉంటుంది.
మందమైన గోతం లాంటి పరదాల కింద హుండీలోకి కానుకలు జారిపోయే విధంగా ఏర్పాటు చేసి ఉంటారు. ఇక్కడే సాయుధ ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ తోపాటు టీటీడీ బిళ్ల జవాన్లు ఉంటారు. వారికి పైనే సీపీ కెమెరాలు ఉంటాయి. కంట్రోల్ రూం నుంచి 24/7 కళ్లలో ఒత్తులు వేసుకుని పర్యవేక్షించే సిబ్బంది కూడా ఉంటారు. అయినా, తరచూ కాసులు చూడగానే కన్నుకొట్టే వారి మనసు చలించి, చేతివాటం ప్రదర్శించి, అడ్డంగా దొరికిపోతుంటారు. ఈ హుండీ నిండితే, దానిని స్థానంలో మరోకటి ఏర్పాటు చేస్తారు. నిండిన హుండీని పక్కకు తప్పించి మహాలక్షి అమ్మవారి విగ్రహానికి సమీపంలో ఉంచడం పరిపాటి. ఆ తరువాత దానిని పరకామణికి తరలిస్తారు.
పరకామణి ఎలా ఉంటుంది..?
శ్రీవారి హుండీ కానుకలు లెక్కించే కేంద్రాన్ని పరకామణిగా పిలుస్తారు. నాలుగు దశాబ్డాల కిందట చిల్లర నాణేలు వేరు చేయడానికి జల్లెడలు వాడేవారు. కాలం మారడంతో ఒక రూపాయి, రెండు రూపాయలు, దేశీయ కరెన్సీతో పాటు ఇతర దేశాల నోట్లను వేరువేరు చేస్తారు. ఇందులో నాణేలను ఇప్పిటీకీ టీటీడీ తిరుపతి పరిపాలనా భవనంలోని ట్రెజరీ వద్ద జల్లెడతో నే నాణేలను వేరు చేస్తారు. వాటిని బస్తాల్లో నింపుతారు. ఇదంతా పక్కకు ఉంచితే..
పరకామణికి వెళ్లే సేవకులు, బ్యాంకుల నుంచి వచ్చే ఔట్ సోర్సింగ్ సిబ్బంది, టీటీడీ సిబ్బంది, అధికారులకు కొన్ని ప్రామాణికాలు ఉంటాయి.
1. ఖచ్చితంగా తెల్లపంచె, బనియన్ మాత్రమే ధరించాలి.
2. లోదుస్తులు ధరించకూడదు
ఎవరిని అనుమతిస్తారు
1. ప్రభుత్వ సర్వీసుల్లోని ఉద్యోగులు
2. టీటీడీ పరకామణి సిబ్బంది
3. విజిలెన్స్ అధికారులు
4. టీటీడీకి సర్వీస్ చేసే బ్యాంకు అధికారులు పర్యవేక్షిస్తారు
5.సిబ్బంది కానుకలు లెక్కిస్తారు
6. శ్రీవారికి కైంకర్యాలు పర్యవేక్షించే పెద్దజీయర్ మఠం నుంచి ప్రతినిధిగా ఏకాంగి (రవికుమార్)
అదనపు ఈఓ
7. పరకామణి డిప్యూటీ ఈఓ
ఈ కానుకల లెక్కింపును పరకామణి కేంద్రంలో చుట్టూ ఉన్న సీసీ కెమెరాలు అన్ని మూలలను కవర్ చేస్తుంటాయి.
8. ఈ వ్యవహారం అంతా సీసీ టీవీల్లో కంట్రోల్ రూంలో పర్యవేక్షిస్తుంటారు.
తనిఖీ
పరకామణిలో కానుకల లెక్కించడానికి రోజుకు అన్ని విభాగాల నుంచి సుమారు 200 నుంచి 250 మంది వరకు హాజరవుతారు. వారిలో 50 మంది టీటీడీ ఉద్యోగులు, మిగతా వారు శ్రీవారి సేవకులు ఉంటారు. వారిని ఆలయంలోకి అనుమతించే ముందే ఆసాంతం తనిఖీ చేస్తారు. లెక్కింపు జరిగే సమయంలో సీసీ కెమెరాల పర్యవేక్షణ ఉన్నా, పూర్తయ్యాక కూడా సిబ్బందిని తనిఖీ చేసి, బయటికి పంపించడానికి టీటీడీ సెక్యూరిటీ సిబ్బంది, విజిలెన్స్ సిబ్బంది విధులు నిర్వహించడంలో కీలకంగా వ్యవహరిస్తారు. అయినా...
పరకామణిలో చోరీ
శ్రీవారి హుండీ కానుకలు లెక్కించడానికి ఇంత పెద్ద వ్యవస్థ ఉంది. అయినా పెద్దజీయర్ మఠం గుమస్తా చేతివాటం ప్రదర్శించడం వెనుక మతలబు చాలా పెద్దవ్యవహారం నడిచిందనేది మిస్టరీగా మారింది.
పరకామణిలో డాలర్లు చోరీ చేసిన జీయర్ మఠం నుంచి ప్రతినిధిగా వెళ్లే ఏకాంగి రవికుమార్ విజిలెన్స్ అధికారులకు పట్టబడిన విషయాన్ని బీజేపీ నేత భానుప్రకాష్ గుర్తు చేశారు. "నిందితుడిపై ఏవిధంగా, ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది ఆలోచన చేయకుండా కొందరు టీటీడీ, పోలీస్ అధికారులు, ఆనాటి బోర్డులోని ఇంకొందరు కుమ్మక్కయారు" అని భాను ఆరోపించారు.
రవికుమార్ ను ఎలా తప్పించాలి. ఆ సొమ్ము ఎలా పంచుకోవాలి? పరకామణి దొంగ నుంచి గజదొంగలు వాటాలు తీసుకున్నారని అన్నారు. ఇందులో కొందరు" త్రిబుల్ ఆర్ లు" ఉన్నారు. ఆ దొంగలను శ్రీవారి భక్తుల ముందు నిలబెడతాం అని హెచ్చరించారు.
ఈ వ్యవహారంపై టీటీడీ విజిలెన్స్ విభాగంలో డీఎస్పీ స్థాయి అధికారి సమర్పించిన నివేదకలో ప్రస్తావించిన అంశాలను కూడా భానుప్రకాష్ ఉటంకించారు. "పోలీస్ అధికారి ఒత్తిడి ఎక్కువగా ఉన్నందున, ఈ కేసుపై లోక్ అదాలత్ లో రాజీ అవుతున్నాం" అని నివేదికలో పేర్కొన్న అంశాన్ని ప్రస్తావించారు. "టీటీడీపై ఒత్తిడి తీసుకురాగలిగినంత స్థాయి పోలీస్ అధికారి ఎవరో?" తేల్చాలన్నారు. చోరీ చేసిన సొమ్ము నుంచి రవికుమార్ నిర్మించిన అపార్టుమెంట్లలో పది ప్లాట్లు టీటీడీకి గిఫ్ట్ తీసుకున్న విషయం కూడా విజిలెన్స్ రిపోర్టులో ప్రస్తావించారు. దీనిపై మండిపడిన భానుప్రకాష్ "దొంగను శిక్షించాల్సింది పోయి. బహుమతి తీసుకోవడం ఏమిటి? అని ఆయన నిలదీశారు.
కొసమెరుపు : జీయర్ మఠంలో ఏకాంగిగా పనిచేసిన రవికుమార్ పరకామణిలో చోరీకి మూడు అంశాలు కలిసి వచ్చాయి. ఈ వివరాలు మరో కథనంలో తెలుసుకుందాం.