డాక్టర్ నమ్రత వికృత 'సృష్టి' లో విశాఖ డాక్టర్ల వాటా ఎంత?
సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ అక్రమాల్లో పాలుపంచుకున్నారంటూ విశాఖ కేజీహెచ్ వైద్యులు ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు;
By : బొల్లం కోటేశ్వరరావు
Update: 2025-08-08 17:24 GMT
అద్దె గర్భాల (సరోగసీ) పేరుతో దంపతులను మోసం చేస్తున్న యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ ఎండీ డాక్టర్ పచ్చిపాల నమ్రత కేసులో తీగలాగితే ఒక్కో డొంక కదులుతోంది. పోలీసుల దర్యాప్తులో ఈ వ్యవహారంతో లింకులున్న ఒక్కొక్కరి బాగోతం బయట పడుతోంది. ఇటీవల రాజస్థాన్కు చెందిన గోవింద్సింగ్, సోనియా దంపతులు చేసిన ఫిర్యాదుతో డాక్టర్ నమ్రతను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. సరోగసీ ద్వారా బిడ్డను ఇస్తామంటూ వేరొకరికి పుట్టిన బిడ్డను ఇచ్చి రూ.40 లక్షలు వసూలు చేయడంపై సికింద్రాబాద్ గోపాలపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న విషయం విదితమే. డాక్టర్ నమ్రత సికింద్రాబాద్, హైదరాబాద్, విశాఖపట్నం, భువనేశ్వర్, కోల్కతా వంటి నగరాల్లో సృష్టి ఫెర్టిలిటీ పేరిట ఆస్పత్రులను ఏర్పాటు చేసి సరోగసీ దందాను కొనసాగిస్తోంది. వీటిలో ఎక్కువగా విశాఖ కేంద్రంగానే సరోగసీకి ముందుకొచ్చిన దంపతుల నుంచి వీర్యకణాలు, అండాలను సేకరిస్తున్నారు.
దీంతో ఈ వ్యవహారంలో విశాఖపట్నం సెంటర్ కీలకంగా మారింది. డాక్టర్ నమ్రతను అరెస్టు చేసిన తర్వాత విశాఖలోని యూనివర్సల్ సృష్టి కేంద్రం మేనేజర్ కల్యాణిని కూడా గోపాలపురం పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో మత్తు వైద్యుడు డాక్టర్ నర్థుల సదానందం పాత్ర నిర్ధారణ కావడంతో తొలుత ఆయన్ను కూడా అరెస్టు చేశారు. ఆ తర్వాత సృష్టి అక్రమాల్లో ఎవరెవరు పాలుపంచుకున్నారు? డాక్టర్ నమ్రతకు ఎవరు సహాయ పడ్డారు? వంటి వాటిపై దృష్టి సారించిన పోలీసులకు మరో 20 మందికి పైగా ప్రత్యక్ష భాగస్వామ్యం ఉందని తేల్చారు. వీరందరిపై కేసులు నమోదు చేశారు. మరోవైపు డాక్టర్ నమ్రతను ఐదు రోజుల కస్టడీకి తీసుకున్న పోలీసులు ఆమె నుంచి అనేక విషయాలను రాబట్టారు.
ముగ్గురు కేజీహెచ్ వైద్యుల అరెస్టు..
సృష్టి ఎండీ డాక్టర్ నమ్రత అక్రమ సరోగసీ వ్యవహారంలో విశాఖలోని కింగ్ జార్జి ఆస్పత్రి (కేజీ హెచ్) వైద్యుల పాత్ర కూడా ఉందని గోపాలపురం పోలీసుల దర్యాప్తులో తేలింది. దీంతో కేజీహెచ్ మత్తు విభాగాధిపతి వాసుపల్లి రవికుమార్ (ఈయన విశాఖ దక్షిణ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే (వైసీపీ) వాసుపల్లి గణేష్కుమార్ సోదరుడు)తో పాటు గైనిక్ (ప్రసూతి) విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉషాదేవి, పిల్లల విభాగం వైద్యురాలు డాక్టర్ విద్యుల్లతలను అరెస్టు చేశారు. వీరిలో విద్యుల్లతను నాలుగు రోజుల క్రితం హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. అనంతరం ఆమె బెయిల్పై విడుదలయ్యారు. అలాగే అక్రమ సరోగసీ దందాలో భాగస్వామ్యం ఉందని నిర్ధారణకు రావడంతో ఇతర ఆస్పత్రులకు చెందిన ఇద్దరు వైడ్యులు డాక్టర్ రమ్య, డాక్టర్ రవిలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇలా డాక్టర్ పచ్చిపాల నమ్రత చేసిన అక్రమాల్లో బాధ్యులుగా తే లుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరిగి పోతోంది. వీరిలో డాక్టర్లు, నర్సులు,
ల్యాబ్ అసిస్టెంట్లు, ఏజెంట్లు ఉన్నారు.
ఆ నలుగురికీ కేజీహెచ్ అనుబంధం..
మరో విశేషమేమిటంటే.. సృష్టి కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న డాక్టర్ నమ్రత సహా తాజాగా అరెస్టయిన కేజీహెచ్ వైద్యులు కూడా విశాఖలోని ఆంధ్ర మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ విద్యనభ్యసించిన వారే. ఇలా కేజీహెచ్ /ఆంధ్ర మెడికల్ కాలేజీతో సంబంధం ఉన్న వైద్యులు డాక్టర్ నమ్రతకు అక్రమ సరోగసీలో ఇతోధికంగా సాయపడినట్టు రూఢీ అవుతోంది. డాక్టర్ నమ్రత అడ్డగోలు వ్యవహారాల్లో విశాఖకు చెందిన మరికొందరు ప్రభుత్వ, ప్రైవేటు వైద్యులు ఉన్నారని తెలుస్తోంది. సృష్టి వ్యవహారంలో తెలంగాణ పోలీసులు దూకుడుగా వెళ్తుండడంతో ఇప్పుడు అలాంటి డాక్టర్ల గుండెల్లో స్టెతస్కోపులు పరిగెడుతున్నాయి.
రెండేళ్లలో 80 మంది పిల్లల విక్రయం?
పోలీసుల దర్యాప్తులో గడచిన రెండేళ్లలోనే డాక్టర్ నమ్రత అండ్ కో.. సుమారు 80 మంది వరకు శిశువులను విక్రయించినట్టు అంచనాకొచ్చారు. ఏడాదికి ఒక్కో సృష్టి సెంటర్ ద్వారా సగటున 50 సరోగసీ కేసుల లావాదేవీలు జరిగినట్టు 2020లోనే పోలీసులు గుర్తించారు. ఇందులో అక్రమ సరోగసీ కేసులే ఎక్కువగా ఉన్నాయని అంచనా వేశారు. యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ వెబ్సైట్లో ఇప్పటివరకు 10,200కు పైగా ఐవీఎఫ్ ప్రొసీజర్లు, 220కి మించి సరోగసీ ప్రొసీజర్లు (వంద శాతం శిశువుల అప్పగింత) నిర్వహించినట్టు అందులో స్వయంగా పేర్కొన్నారు. దాదాపు రెండున్నర దశాబ్దాలుగా లెక్కలోకి రాని అక్రమ సరోగసీలు ఎన్ని 'సృష్టి'ంచారో ఆ పెరుమాళ్లకే ఎరుక!