అది టెక్నాలజీ పవర్ అంటే

టెక్నాలజీ సాయంతో మొంథా తుఫాన్ ప్రభావం వల్ల సంభవించే నష్టం తగ్గించామని సీఎం చంద్రబాబు అన్నారు.

Update: 2025-10-30 13:10 GMT

మొంథా తుఫాన్ ప్రభావాన్ని టెక్నాలజీ సాయంతో గణనీయంగా తగ్గించగలిగామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేశాయని, మొదటి రోజునే పరిస్థితులను ఎక్కువగా స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. తుఫాన్‌పై ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించామని వివరించారు. గురువారం సచివాలయంలో సీఎం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ.. అంతర్వేది దగ్గర తీరం దాటి రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసినట్టు పేర్కొన్నారు. శాటిలైట్ ఇమేజ్‌ల ఆధారంగా తుఫాన్ పరిస్థితిని అంచనా వేశామని, ముందస్తు ప్రణాళికలతో ప్రకృతి వైపరీత్య నష్టాన్ని బాగా తగ్గించామన్నారు. వర్షాలు, గాలుల తీవ్రతను అంచనా వేస్తూ హెచ్చరికలు జారీ చేసి చర్యలు తీసుకున్నామని తెలిపారు.

గతంలో తుఫాన్ ప్రభావం తగ్గినా వారం రోజుల వరకు కోలుకోలేని పరిస్థితి ఉండేదని, తుఫాన్లు ఆపలేమని కానీ అప్రమత్తత, ముందస్తు చర్యలతో ప్రాణ ఆస్తి నష్టాన్ని తగ్గించవచ్చని చెప్పారు. తుఫాను ప్రభావిత అన్ని ప్రాంతాల్లో టెక్నాలజీ వినియోగించి నష్టాలను తగ్గించామన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రవాహాలు రావొచ్చని ముందస్తు అంచనా వేసి హెచ్చరికలు ఇచ్చామని, తుఫాన్ కారణంగా రూ.5,265 కోట్ల మేర నష్టం జరిగి ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేశామన్నారు. వ్యవసాయం, ఉద్యానవనం, ఆక్వా, రహదారులకు రూ.2,079 కోట్లు, విద్యుత్, జలవనరుల శాఖలకు రూ.207 కోట్లు నష్టం జరిగిందని వెల్లడించారు.

గతంలో గుండ్లకమ్మ, పులిచింతల గేట్లు కొట్టుకుపోయినా పట్టించుకోలేదని విమర్శించారు. తుఫాన్ నష్టాలను పూర్తి స్థాయిలో అంచనా వేసి కేంద్రానికి పంపుతామన్నారు. రియల్ టైమ్‌లో డేటా లేక్ ద్వారా సమాచారం విశ్లేషించి త్వరగా నిర్ణయాలు తీసుకున్నామని చెప్పారు. తుఫాను నష్ట తీవ్రత తగ్గించే అంశంపై మంత్రులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారని, ఆర్టీజీఎస్ నుంచి మంత్రి లోకేష్, అనిత ఎప్పటికప్పుడు పర్యవేక్షణ జరిపారని తెలిపారు. కూటమి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజలకు భరోసా ఇచ్చారని, వారందరికీ అభినందనలు తెలియజేశారు. టెక్నాలజీ వినియోగించి పంట నష్టాలు, ముంపు ప్రాంతాలు గుర్తిస్తామని చెప్పారు. ప్రభుత్వం సాంకేతిక పరిజ్ఞానంతో ప్రజలకు నష్టం రాకుండా చూస్తుంటే కొందరు ఫేక్ పోస్టులు పెడుతున్నారని, ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేయడం వారికి ఇష్టం లేనట్టుందని విమర్శించారు.

Tags:    

Similar News