(Lands) భూములపై ఏపీ అసెంబ్లీ చేసిన చట్టం ఏమిటి?

ఏపీ శాసనసభ గురువారం భూములపై చట్ట సవరణ చేసింది. ఏమిటి ఆ చట్ట సవరణ, దానివల్ల ప్రయోజనం ఏమిటి? ఎందుకు ఈ చట్ట సవరణ చేయాల్సి వచ్చింది?

Update: 2024-11-15 07:57 GMT

ఆంధ్రప్రదేశ్ లో భూముల కబ్జాలు, ఒకరి పేరుతో ఉన్న భూమి మరొకరి పేరుతో మారిపోవడం వంటి సంఘటనలు భవిష్యత్ లో జరగకుండా ప్రస్తుతం ఉన్న శిక్షల కంటే ఎక్కువ శిక్షలు పడే విధంగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ చట్ట సవరణ చేసింది. ఏమిటి ఆ సవరణ, ఎంతవరకు ఉపయోగ పడుతుందనేది తెలుసుకుందాం. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ల్యాండ్ టైట్లింగ్ చట్టాన్ని రద్దు చేసిన విషయం తెలిసిందే. ల్యాండ్ గ్రాబింగ్ చట్టం చేయడానికి ప్రధాన కారణం వైఎస్సార్ సీపీ వారు భూములు కబ్జా చేశారని, వారిని శిక్షించి ఆ భూములు తిరిగి వెనక్కి తీసుకోవాలనేది ముఖ్య ఉద్దేశ్యమని పలువురు పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.

సవరణలతో భూ కబ్జా బిల్లు ఆమోదం... (Land Grabbing Act)

బ్రిటీష్ వారు రూపొందించిన భూ కబ్జా (నిషేధం) చట్టం ఉంది. దానిలో కొన్ని సవరణలు చేసి 1982లో మరింత పటిష్టం చేశారు. తిరిగి దీనిని 2024 సెప్టెంబరు 14న అసెంబ్లీలో బిల్లు పెట్టి మరికొన్ని సవరణలు తీసుకొచ్చారు. ఈ సవరణల ద్వారా శిక్షలు కఠినంగా ఉంటాయని ప్రభుత్వం చెబుతోంది. బిల్లును రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రవేశపెట్టారు. సవరించిన కొత్త చట్టం ప్రకారం భూమిని కబ్జా చేసిన వారికి 10 నుంచి 14 సంవత్సరాలు శిక్షపడే అవకాశం ఉంది. జరిమానా కూడా భూమి విలువ ఎంత ఉంటుందో అంత మొత్తం కబ్జారుడు భూమి యజమానికి చెల్లించాల్సి ఉంటుంది. ఈ కేసుల విచారణకు ప్రత్యేక కోర్టును కూడా ఏర్పాటు చేస్తూ మరో బిల్లును సత్యప్రదసాద్ ప్రవేశపెట్టారు. ఇటువంటి కేసులపై ప్రత్యేక విచారణ జరిపేందుకు డిఎస్సీ స్థాయి అధికారిని విచారణకు నియమించాల్సి ఉంటుంది. అప్పుడే ప్రత్యేక కోర్టు విచారణకు స్వీకరిస్తుంది. గుజరాత్ లో ప్రస్తుతం అమలులో ఉన్న చట్టాన్ని స్టడీ చేసిన తరువాత ఏపీ ప్రభుత్వం ఈ చట్ట సవరణ తీసుకొచ్చింది.

Delete Edit

రీసర్వే ఎందుకు రద్దు చేయలేదు? (Land Resurvey)

తాము అధికారంలోకి వస్తే భూమి రీసర్వేను రద్దు చేస్తామని కూటమి ఎన్నికలకు ముందు ప్రకటించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టంగా నాడు ఈ విషయాలు చెప్పారు. అయితే ప్రస్తుతం రీసర్వేను కొనసాగించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. రీ సర్వేను రద్దు చేస్తున్నట్లు ఇంతవరకు ప్రకటించలేదు. రీ సర్వే పూర్తిచేస్తేనే ప్రభుత్వం నుంచి రెవెన్యూ సర్వేకు నిధులు ఇస్తామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించడంతో గత ప్రభుత్వం చేసిన సర్వేను ఆపారే తప్ప రద్దు చేయలేదు. గత ప్రభుత్వం కొన్ని లక్షల ఎకరాల్లో రీసర్వే చేసింది. సర్వే చేయడం వల్ల ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వానికి సుమారు రూ. 500 కోట్లు వస్తాయని సమాచారం. ఈ డబ్బులు త్వరగా విడుదల చేయాల్సిందిగా రెండు నెలల క్రితం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లెటర్ రాసింది.

ల్యాండ్ టైట్లింగ్ చట్టం రద్దు.. (Land Titling Act)

వైఎస్సార్సీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైట్లింగ్ చట్టంను కూటమి ప్రభుత్వం రద్దు చేసింది. గత ప్రభుత్వం కూడా ఈ చట్టం చేసిందే తప్ప అమలు చేయలేదు. రీ సర్వే పూర్తయితే కాని ల్యాండ్ టైట్లింగ్ చట్టం అమలు చేసేందుకు వీలవుతుంది. భూమి కొలతలు పూర్తయిన తరువాత అభ్యంతరాలు ఉంటే అవి కూడా పరిష్కరించిన తరువాత ఆ భూమి యజమానికి టైట్లింగ్ ఇస్తారు. ఈ చట్టం ద్వారా పూర్తి హక్కులు భూమి యజమానికి ఉంటాయని, ఎవ్వరు కూడా ఈ భూమి మాదంటూ కోర్టులకు వెళ్లే అవకాశం కూడా లేకుండా చట్టం ఉంటుంది. అందువల్ల ఈ చట్టం మంచిది కాదని చెప్పిన కూటమి నేతలు అధికారంలోకి రాగానే రద్దు చేశారు. కానీ రీ సర్వేను మాత్రం రద్దు చేయలేదు.

Tags:    

Similar News