బాబు మదిలో ఏముందో..!? శ్రీవారి ప్రథమ సేవకుడెవరు?

టీటీడీ ఛైర్మన్ వరం దక్కేది ఎవరికి? సీఎం ఎన్. చంద్రబాబు మదిలో ఏముంది? ఆ పేరు ఖరారు చేయడం కత్తిమీదసామేనా? ఆశావహుల్లో ఎవరి కల నెరవేరుతుంది?

Update: 2024-07-01 10:53 GMT

టీటీడీ చైర్మన్ పదవిని భర్తీ చేయడం ద్వారా సీఎం. ఎన్. చంద్రబాబు పదవుల పందేరానికి తెరతీసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు. టీటీడీ చైర్మన్ అయ్యేవరం ఎవరికి దక్కుతుందనే అంశం చర్చనీయాంశంగా మారింది. ఈ పదవి రేసులో ఆశావహులు ఎక్కువగానే ఉన్నారు. అసలు ఈ పదవికి అంత ప్రాధాన్యత ఎందుకు? ఇప్పటి వరకు కమ్మ, దళిత సామాజికవర్గం నుంచి చైర్మన్ గా అవకాశం దక్కలేదు. పాలక మండలిలో మాత్రమే సభ్యులుగా నియమించిన దాఖలాలు ఉన్నాయి.

ప్రాధాన్యం ఎందుకంటే..
ప్రపంచ ఆధ్యాత్మిక క్షేత్రాల్లో వాటికన్ సిటీకి ధీటుగా తిరుమలకు ఆదాయం పెరిగింది. సేవా కార్యక్రమాలను కూడా అదే స్ధాయిలో విస్తరించింది. దేశంలో అనేక ఉన్నత పదవులు ఉన్నప్పటికీ టీటీడీ చైర్మన్ హోదాకు దేశంలోనే కాదు. ప్రపంచంలో అంతప్రాధాన్యం ఉంది. శ్రీవేంకటేశ్వరస్వామి సన్నిధిలో రూ. 5,100 కోట్ల బడ్జెట్ తో ఆధ్మాత్మిక, విద్య, వైద్య, సేవా రంగాల కోసం చిన్న రాష్ట్రాన్ని తలపించే స్ధాయిలో టీటీడీ వ్యవహారాలపై నిర్ణయాలు తీసుకునే పాలక మండలికి అధ్యక్షుడిగా నియమితులయ్యే వ్యక్తికి క్యాబినెట్ ర్యాంక్ ఉంటుంది. హిందూత్వ పరిరక్షకుడిగా ఆ వ్యక్తి ఎక్కడికి వెళ్లినా ప్రత్యేక మర్యాదలు ఉంటాయి. ఆయన తిరుమల నుంచి ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం ఉండదు. ప్రపంచంలోని ఏ దేశం నుంచి అధికారిక ప్రతినిధులు వచ్చినా, దేశంలోని సీఎంలు, ప్రధాని, చివరాఖరికి రాష్ర్టపతి వచ్చినా సరే, టీటీడీ చైర్మన్ హోదాలో వెళ్లి స్వాగతించే అపూర్వ అవకాశం ఉంటుంది. దేశంలోని అందరు ప్రముఖులతో సత్సబంధాలు ఏర్పడేందుకు అవకాశం ఉంటుంది.
టీడీపీతో పాటుమిత్రపక్ష కూటిమిలోని జనసేన, బీజేపీలో కూడా ఆ పదవిని ఆశిస్తున్న వారిలో ఉన్నారు. ప్రస్తుత ఎమ్మెల్యేలతో పాటు టీడీపీకి సానుకూలంగా ఉంటారంటున్న టీవీ-5 ఛానల్ ఎండితో పాటు సినీప్రముఖుల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. కానీ, వారందరికంటే, టీడీపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోకగజపతిరాజు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. రాజశంశీకుడిగానే కాకుండా, రాజకీయాల్లో మచ్చలేని ఆయన వ్యక్తిత్వం కలిగిన ఆయన అభ్యర్థిత్వానికి సీఎం చంద్రబాబు మొగ్గు చూపే అకాశాలు ఉన్నాయని ప్రధానంగా వార్తలు వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో తన పేరు వినిపిస్తున్నప్పటికీ అశోకగజపతిరాజు ఎక్కడా స్పందించకపోవడం గమనార్హం.


తిరుమల నుంచే శ్రీకారం
అధికారంలో ఉన్నా.. పార్టీ కార్యక్రమమైనా సరే. తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న తరువాత ప్రారంభించడం సీఎం ఎన్. చంద్రబాబు నాయుడు ఆనవాయితీగా పాటిస్తారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గత నెల 12వ తేదీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు రాత్రికే ఆయన కుటుంబ సమేతంగా తిరుమల చేరుకున్నారు. మరుసటి రోజు శ్రీవారిని దర్శించుకుని, మొక్కులు చెల్లించారు. ఆ తరువాత నూతన జిల్లాకు చెందిన కొత్త ఎమ్మల్యేలతో కలిసి మీడియాతో మాట్లాడారు. "పాలనలో ప్రక్షాళన తిరుమల నుంచి ప్రారంభిస్తా" అని ప్రకటించారు. చెప్పినట్లే సీనియర్ ఐఏఎస్ అధికారి జె. శ్యామలరావును టీటీడీ ఈవోగా నియమించడం ద్వారా ప్రక్షాళన దిశగా చురుగ్గా అడుగులు వేయిస్తున్నారు. ఆ కోవలోనే టీటీడీ చైర్మన్ పోస్టు భర్తీ ద్వారా నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియకు శ్రీకారం చుట్టే అవకాశం ఉందనే అభిప్రాయాలు ఉన్నాయి. కాగా, అధికారుల నియామకం బదిలీ వరకు అయితే సరే..
పదవుల భర్తీ కత్తిమీదే సామే..
సీఎంగా ఉన్న ఎన్. చంద్రబాబు నాయుడు పాలనలో ప్రక్షాళన దిశగా చాలా మంది అధికారులను ఇప్పటికే బదిలీ చేశారు. నామినేటెడ్ పదవుల భర్తీ ప్రక్రియ అంత సులువు కాదనే భావన ఉంది. గతంలో ఉభయ కమ్యూనిస్టులతో పొత్తుతో ఎన్నికలకు వెళ్లిన నేపథ్యం వేరు. కామ్రేడ్లు ఎమ్మెల్యే, ఎంపీ స్ధానాలు మినహా, నామినేటెడ్ పోస్టుల కోసం పోటీ పడే రకం కాదు. అవి వారికి అవసరం కూడా లేదు, స్ధానిక సంస్థల్లో పోటీ చేసి, సత్తా చాటుకున్నారు.
టీడీపీ కూటమిలో ప్రస్తుతం మరో రెండు పార్టీలు జనసేన, బీజేపీ కూడా ఉన్నాయి. నామినేటెడ్ పోస్టుల కోసం ఆ రెండు పార్టీల్లో కూడా ఆశావహుల సంఖ్య తక్కువేమీ లేదు. దీంతో ఈ పదవులు భర్తీ చేయడం అనేది అంతసులువు కాదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
2024 సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయించని టీడీపీ సీనియర్ నేతలు పీ. అశోక గజపతిరాజు, పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడుని గవర్నర్లుగా పంపించే అవకాశం ఉన్నట్లు మొదట వార్తలు వెలువడ్డాయి. కానీ, వారిలో పీ. అశోక గజపతిరాజును టీటీడీ చైర్మన్గా నియమించడానికి సీఎం ఎన్. చంద్రబాబు ఆసక్తిగా ఉన్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఏడుపార్లు ఎమ్మెల్యే, వివిధ మంత్రిత్వ శాఖలు నిర్వహించిన అనుభవం, ఒకసారి ఎంపీ ఆ తరువాత కేంద్ర క్యాబినెట్లో పనిచేయడం వంటి సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో అవినీతి మరక లేకుండా క్లీన్ చిట్ ఉన్న నాయకుడు అయినందు వల్ల ఆయనను నియమించడానికి సీఎం ఎన్. చంద్రబాబు ఆసక్తి చూపుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
టీటీడీ చైర్మన్ రేసులో ఉండి ఎమ్మెల్యే ఆర్. రఘురామ కృష్ణమరాజు, సినీ ప్రముఖుల్లో కే. రాఘవేంద్రరావు, అశ్వనీదత్, జనసేన చీఫ్, డిప్యూటీ సీఎం కొణిదెల నాగబాబు పేరు కూడా చేరింది. కూటమి అధికారం ఖాయమైన తరువాత గత నెల ఆరో తేదీ నాగబాబు స్పందించారు. "తప్పుడు వార్తలు నమ్మకండి. అధికారిక పార్టీ హ్యాండిల్స్, తన సోషల్ మీడియా అకౌంట్ నుంచి ఇచ్చే సమాచారాన్ని మాత్రమే తీసుకోండి" అని మాత్రమే చెప్పారు. మినహా " తాను రేసులో లేను అనే మాట" చెప్పలేదు.
కమ్మ, దళితులు లేరే..
తిరుపతి అసెంబ్లీ స్ధానంలో బలిజ (కాపు) సామాజిక వర్గం నుంచి జనసేన ఎమ్మెల్యేగా ఆరణి శ్రీనివాసులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దీనివల్ల అదే సామాజికవర్గానికి అవకాశం ఉండకపోవచ్చు. అనే విషయమే కాకుండా, కాపు, రెడ్డి, క్షత్రియ, బీసీ సామాజికవర్గం నుంచి టీటీడీ చైర్మన్గా అన్ని పార్టీ వారు పనిచేశారు. కమ్మ, దళిత సామాజికవర్గం నుంచి పాలక మండలి సభ్యులుగా మినహా, చైర్మన్ గా అప్పట్లో కాంగ్రెస్, టీడీపీ పాలనలో నియమించిన దాఖలాలు లేవు.
సభ్యత్వం కోసం...
టీటీడీ పాలక మండలి చైర్మన్ పరిస్థితి అలా ఉంటే, బోర్డులో సభ్యత్వం కోసం కూడా పోటీ తీవ్రంగానే ఉంది. ముందు వరుసలో జనసేన, బీజేపీ నుంచి క్యూలో ఉన్నారు. అందులో టికెట్ త్యాగం చేశామంటున్న వారిలో తిరుపతి నుంచి ఇద్దరు, 2014లో టీడీపీకి మిత్రపక్షంగా ఉన్న సమయంలో తిరుపతి బీజేపీ నేత భానుప్రకాశ్ రెడ్డి, పిఠాపురంలో సీటు వదులుకున్నవర్మతో పాటు మూడు పార్టీల కూటమిలో ఆశావహుల సంఖ్య ఎక్కువగానే ఉంది. అయితే, సీఎం చంద్రబాబు మనసులో మాట ఏమిటో తెలియక, ఎవరి పరిధిలో వారు, తమ మార్గాల్లో ప్రయత్నాలు సాగిస్తున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. ఇన్ని పేర్లు రాజకీయ తెరపై ఉన్నా, ఊసులో లేని పేరు సీఎం చంద్రబాబు తెరపైకి తీసుకుని వచ్చే విలక్షణ నిర్ణయం తీసుకుంటారు. అందుకు నిదర్శనం..
2014 ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చింది. ఎందరో పోటీలో ఉన్నారు. "అనూహ్యంగా కడప జిల్లా మైదుకూరుకు చెందిన బీసీ నేత పుట్టా సుధాకర్ యాదవ్" నియమితులైన విషయాన్ని వెటరన్ జర్నలిస్ట్, కాలమిస్టు జీ.ఆర్. మహర్షి గుర్తు చేశారు.
"సీఎం చంద్రబాబు మదిలో లెక్కలు పక్కాగా ఉంటాయి. నిర్ణయాలు కూడా విలక్షణంగానే ఉంటాయి" అనే అభిప్రాయాన్ని జీ.ఆర్. మహర్షి ఫెడరల్ ప్రతినిధితో అన్నారు. "ఇప్పుడు కూడా అలాంటి అద్భుతం జరిగినా ఆశ్యర్యం అవసరం లేదు" అంటూనే ప్రముఖంగా వినిపిస్తున్నపేర్లలో పూసపాటి అశోకగజపతిరాజు రాజకీయాల్లో మరక అంటని మంచి మనిషి అన్నారు. "శ్రీవారి ప్రధమ సేవకుడిగా ఎవరు వచ్చినా సరే. సామాన్యులకు స్వామివారి దర్శనానికి గంటలు రోజుల తరబడి నిరీక్షించే అవకాశం లేకుండా, సేవా టికెట్లు సామాన్యుడికి కూడా అందుబాటులోకి తెచ్చే సంస్కరణలు అవసరం" అని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇంతటి ప్రాధాన్యత కలిగిన టీటీడీ చైర్మన్ పదవి దక్కే అవకాశం ఎవరికి లభిస్తుందో అనే చర్చ తీవ్ర స్ధాయిలో జరుగుతోంది. ఆ వరం ఎవరికి లభిస్తుందో వేచిచూడాల్సిందే.
Tags:    

Similar News