’రాయలసీమ‘ ఆత్మగౌరవానికి ప్రతీక
రాయలసీమ సాగునీటి సాధన సమితి ఆధ్వర్యంలో రాయలసీమ ఆత్మగౌరవ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
’రాయలసీమ‘ ఆత్మగౌరవానికి ప్రతీక అని పలువురు వక్తలు పేర్కొన్నారు. రాయలసీమ సాగునీటి సాధన సమితి ఆధ్వర్యంలో రాయలసీమ ఆత్మగౌరవ దినోత్సవాన్ని మంగళవారం నాడు సమితి ప్రధాన కార్యాలయం నంద్యాలలో ఘనంగా నిర్వహించారు. సమితి ఉపాధ్యక్షులు వైయన్ రెడ్డి అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో సమితి సభ్యులు, ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు. నాటి నైజాం నవాబ్ తన రాజ్యానికి సైనిక సహాయం పొందడానికి రాయలసీమను బ్రిటిష్ వారికి వదలివెసిన తర్వాత ఈ ప్రాంతాన్ని “సీడెడ్ జిల్లాలు”గా పిలిచేవారు. ఆ పదంపై అసంతృప్తితో ప్రజలు “దత్త మండలం” అని పిలవడం ప్రారంభించారు. నంద్యాలలో జరిగిన ఆంధ్ర మహాసభలో భాగంగా నవంబర్ 18, 1928 న జరిగిన దత్తమండల సమావేశంలో చిలుకూరి నారాయణరావు గారు “దత్త మండలం”ను “రాయలసీమ”గా పేరు మార్చాలని తీర్మానం ప్రవేశపెట్టగా, ప్రాంత నాయకులు మద్దతు తెలిపారు.