క్లస్టర్ వ్యవసాయం ఏపీలో ఎలా ఉండబోతోంది?
వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు అసెంబ్లీలో ఏమి చెప్పారు? ఏమి చేయబోతున్నారు? క్లస్టర్ వ్యవసాయం అంటే ఏమిటి?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యాన పంటల అభివృద్ధికి క్లస్టర్ ఆధారిత వ్యూహాన్ని అవలంబిస్తూ, రాష్ట్ర ఆర్థిక వృద్ధిని మరింత పటిష్టం చేయాలని సంకల్పించింది. మైక్రో, డ్రిప్ ఇరిగేషన్ వంటి ఆధునిక సాంకేతికతలతో సాధించిన విజయాలను ఆధారంగా తీసుకుని, హార్టికల్చర్ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ (సీడీపీ)ని చేపట్టబోతోంది. ఈ కార్యక్రమం ద్వారా రైతులకు అదనపు ఆదాయం, నీటి, విద్యుత్ ఆదా, ఉత్పత్తి నాణ్యత పెంపు వంటి ప్రయోజనాలు చేకూరనున్నాయి. ఇది కేవలం ఉత్పత్తి పెంపుకే పరిమితం కాకుండా, మార్కెటింగ్, ఎగుమతులు, వాల్యూ చైన్ అభివృద్ధికి కూడా దోహదపడుతుంది.
స్పింక్లర్స్ ద్వారా అద్దంకి- నార్కెట్ పల్లి హైవేలో సాగవుతున్న ఖర్జూర చెట్లు
ప్రధానంగా, జాతీయ హార్టికల్చర్ బోర్డు (ఎన్‌హెచ్‌బీ) ఆధ్వర్యంలో నడిచే ఈ సెంట్రల్ సెక్టర్ ప్రోగ్రామ్‌లో ఆంధ్రప్రదేశ్ 11 ఉద్యాన పంటలపై దృష్టి సారిస్తోంది. అవి అరటి, మామిడి, జీడిమామిడి, మిరప, కొబ్బరి, ఆయిల్ పామ్, కోకో మొదలైనవి. ఈ పంటలు ఆయా ప్రాంతాల వాతావరణం, మార్కెట్ డిమాండ్ ఆధారంగా ఎంపిక చేయబడ్డాయి. ఉదాహరణకు అనంతపురం జిల్లాలో అరటి క్లస్టర్, చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో మామిడి క్లస్టర్లు, శ్రీకాకుళం, ఏఎస్‌ఆర్, పార్వతీపురం-మన్యం జిల్లాల్లో జీడిమామిడి క్లస్టర్లు, శ్రీకాకుళం, తూర్పుగోదావరి, కోనసీమ జిల్లాల్లో కొబ్బరి క్లస్టర్లు, ఏలూరు, తూర్పుగోదావరి జిల్లాల్లో ఆయిల్ పామ్, కోకో క్లస్టర్లు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో మిరప క్లస్టర్ వంటివి ఏర్పాటు చేయనున్నారు. ఈ క్లస్టర్ల ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించి, ఎన్‌హెచ్‌బీ నుంచి ప్రత్యేక నిధులను సాధించాలని ప్రణాళిక.
స్పింక్లర్స్ ద్వార సాగవుతున్న దానిమ్మ
ఈ కార్యక్రమాన్ని చేపట్టే విధానం మూడు ప్రధాన దశలపై ఆధారపడి ఉంటుంది. ప్రీ-ప్రొడక్షన్, ప్రొడక్షన్, పోస్ట్-హార్వెస్ట్ మేనేజ్‌మెంట్, వాల్యూ యడిషన్, లాజిస్టిక్స్, మార్కెటింగ్, బ్రాండింగ్. ప్రీ-ప్రొడక్షన్ దశలో ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ల (ఎఫ్‌పీఓలు) ఏర్పాటు, సామర్థ్య నిర్మాణం, హై-టెక్ నర్సరీలు, నాణ్యమైన నాట్లు, గుడ్ అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్ (జీఏపీ), ఫార్మ్ మెకనైజేషన్, ఐఓటీ, బ్లాక్‌చైన్ వంటి డిజిటల్ ఇన్నోవేషన్లు చోటు చేసుకుంటాయి. పోస్ట్-హార్వెస్ట్ దశలో కలెక్షన్ సెంటర్లు, రీఫర్ వాన్లు, ప్యాక్-హౌస్‌లు, కోల్డ్ స్టోరేజ్‌లు ఏర్పాటు చేసి, ఉత్పత్తి నష్టాలను తగ్గిస్తారు. లాజిస్టిక్స్ మార్కెటింగ్ దశలో ట్రాన్స్‌పోర్ట్, కోల్డ్ చైన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, మార్కెట్ లింకేజెస్, ఈ-కామర్స్, క్లస్టర్-స్పెసిఫిక్ బ్రాండింగ్, జీఐ రిజిస్ట్రేషన్, మార్కెట్ ఇంటెలిజెన్స్ వంటివి ప్రోత్సహిస్తారు.
నిమ్మ కాయలు
అనంతపురం అరటి క్లస్టర్‌ను పైలట్‌గా ఎంచుకోవడం దీనికి ముఖ్యమైన ఉదాహరణ. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ హార్టికల్చర్ డెవలప్మెంట్ ఏజెన్సీని క్లస్టర్ డెవలప్మెంట్ ఏజెన్సీ (సీడీఏ)గా నియమించారు. దీని ద్వారా సుమారు 14,000 రైతులు మరియు వాల్యూ చైన్ స్టేక్‌హోల్డర్లు లబ్ధి పొందుతారు. ఏటా 7.5 లక్షల మెట్రిక్ టన్నుల అరటి ఉత్పత్తిని నిర్వహించి, జీఏపీ ద్వారా నాణ్యత పెంచి, రైతులకు మెరుగైన ధరలు అందజేస్తారు. ఇంప్లిమెంటేషన్‌లో రైతుల వర్క్‌షాప్‌లు, టైమ్‌లీ అమలు, పీరియాడిక్ రివ్యూ మీటింగ్‌లు చోటు చేసుకుంటాయి.
మునగ కాయలు
మైక్రో ఇరిగేషన్‌తో సమన్వయం చేస్తూ ఈ కార్యక్రమం గేమ్ చేంజర్‌గా మారనుంది. రాష్ట్రంలో ఇప్పటికే మైక్రో ఇరిగేషన్ ద్వారా లక్ష హెక్టార్లకు 15 టీఎంసీల నీరు ఆదా అవుతుండగా, ఏడేళ్లలో 105 టీఎంసీలు సేవ్ అయ్యాయి. అలాగే రూ.434 కోట్ల విలువైన 10,871 లక్షల కిలోవాట్ల విద్యుత్, 364 లక్షల పనిదినాలు (రూ.1820 కోట్ల విలువ), 35 వేల టన్నుల ఆదా అయ్యాయి. మొత్తంగా రైతులకు రూ.8 వేల కోట్ల అదనపు ఆదాయం చేకూరింది. ఈ విజయాలను క్లస్టర్ మోడల్‌లో విస్తరించడం ద్వారా ఎగుమతులు 20-25 శాతం పెరగనున్నాయి.
ప్రకాశం జిల్లా అద్దంకిలో సాగులో ఉన్న డ్రాగన్ ఫ్రూట్ పంట
ఈ కార్యక్రమం రాష్ట్రానికి ఆర్థిక బలాన్ని ఇస్తుంది. అనంతపురం వంటి ప్రాంతాల్లో మైక్రో ఇరిగేషన్ మోడల్‌ను ప్రధాని మోదీ గుజరాత్‌లో అమలు చేయడం ద్వారా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు క్లస్టర్ అభివృద్ధితో మరింత ముందుకు వెళ్తుంది. ఇది రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే కాకుండా, పోస్ట్-హార్వెస్ట్ నష్టాలను తగ్గించి, అంతర్జాతీయ మార్కెట్లలో బ్రాండింగ్ ద్వారా పోటీతత్వాన్ని పెంచుతుంది. అయితే విజయవంతమైన అమలుకు రైతుల భాగస్వామ్యం, సమయోచిత నిధులు, టెక్నాలజీ అడాప్షన్ కీలకం. మొత్తంగా ఇది ఆంధ్రప్రదేశ్ ఉద్యాన రంగాన్ని గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లే దిశగా ఒక ముందడుగు.