హై కోర్టు ఉద్యోగి అయితే ఏంటంట...

ట్రాఫిక్ డైవర్షన్ జరిగింది. మీరు విజయవాడ వెళ్లి రైయిన్ ట్రీ పార్కుకు వెళ్లండి ఇక్కడ ప్రవేశం లేదు.

Update: 2025-09-28 05:38 GMT

సర్ నేను హైకోర్టులో కారు డ్రైవర్ ను. నా పేరు ఎం లక్ష్మీనారాయణ హైకోర్టులో ఆఫీస్‌ సబార్డినేట్‌ కమ్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. గుంటూరు పరిధిలో ఉన్న న్యాయమూర్తులకు కేసుల ఫైళ్లు అందజేస్తుంటాను. అర్జెంటుగా వెళ్లాలి పంపించండి సార్ అంటూ మంగళగిరి సీఐని ట్రాఫిక్ లో కోరాడు. హైకోర్టు అయితే ఏంటంట... పక్కనుండు అని హూంకరించాడు సీఐ. దీంతో ఏమి చేయాలో దిక్కుతోచక మళ్లీ అడగం ప్రారంభించాడు. దీంతో చిర్రెత్తుకొచ్చిన సీఐ ఆ ఉద్యోగి చెంప చెల్లు మనిపించాడు. ఏకంగా ఫైల్స్ తో పాటు లక్మీనారాయణను మంగళగిరి పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి కూర్చో బెట్టాడు.

మరుసటి రోజు విచారించాల్సిన కేసులకు సంబంధించిన ఫైళ్లను రాత్రి న్యాయమూర్తులు ఇంటి వద్దనే చదువుతారు. తద్వారా విచారణ సులభమవుతుంది. ఇలా వారికి కేసుల ఫైళ్లను అందజేయడాన్ని సర్క్యులేషన్‌ అంటారు. లక్ష్మీనారాయణ గురువారం హైకోర్టు వాహనంలో ఫైళ్లను తీసుకుని రెయిన్‌ ట్రీ విల్లాల్లో నివసిస్తున్న జడ్జీలకు ఇచ్చేందుకు మంగళగిరి మీదుగా బయల్దేరారు. ఎర్రబాలెం-మంగళగిరి రైల్వే ఫ్లై ఓవర్‌పై మిగిలిన వాహనాలతో వెళ్తుండగా లక్ష్మీనారాయణ వాహనాన్ని ఓ కానిస్టేబుల్‌ అకస్మాత్తుగా ఆపారు.
ఈ దారిలో వద్దని, విజయవాడ మీదుగా వెళ్లాలని చెప్పారు. రోజూ ఇదే మార్గంలో వెళ్తుంటానని, హైకోర్టు జడ్జీలకు అత్యవసరంగా ఫైళ్లు ఇవ్వాల్సి ఉందని లక్ష్మీనారాయణ సమాధానమిచ్చారు. దారి మళ్లించిన విషయం తెలియదన్నారు. ఈ సంవాదం జరుగుతుండగానే... మంగళగిరి రూరల్ సీఐ వై శ్రీనివాసరావు వచ్చారు. రావడమే లక్ష్మీనారాయణను గట్టిగా చెంపదెబ్బ కొట్టారు. హైకోర్టు ఉద్యోగినని చెప్పినా వినిపించుకోలేదు. ‘నువ్వేంటిరా.. డ్రైవర్‌ నా కొడుకువి.. నువ్వా నాకు చెప్పేది.. నేను సీఐను’ అని దూషిస్తూ లక్ష్మీనారాయణ పొట్టలో గట్టిగా గుద్దారు. పదేపదే ఆయన చెంపపై కందిపోయేలా కొట్టారు.
ర్యాష్ డ్రైవింగ్ కింద కేసు కట్టండి...
ఇద్దరు కానిస్టేబుళ్లను పిలిచి లక్ష్మీనారాయణతోపాటు హైకోర్టు వాహనాన్ని కూడా మంగళగిరి స్టేషన్‌కు తీసుకెళ్లాలని, ర్యాష్‌ డ్రైవింగ్‌ కింద లక్ష్మీనారాయణపై కేసు పెట్టాలని సీఐ శ్రీనివాసరావు ఆదేశించారు. కేసుల తాలూకు ఫైళ్లు ఉన్నాయని, జడ్జీలకు అందజేయడం అత్యవసరమని లక్ష్మీనారాయణ వివరించినా పట్టించుకోలేదు. మొత్తం వ్యవహారాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు లక్ష్మీనారాయణ ప్రయత్నించగా, ఓ కానిస్టేబుల్‌ ఆయన ఫోన్‌ను బలవంతంగా లాగేసుకున్నారు.
స్టేషన్‌కు వెళ్లాక ఫోన్‌ అడిగినా ఇవ్వలేదు. వ్యాన్‌లో అత్యవసర ఫైళ్ల గురించి చెప్పగా, అంత అత్యవసరమైతే జడ్జీలే ఫోన్‌ చేస్తారులే అంటూ కానిస్టేబుళ్లు దురుసుగా మాట్లాడారు. లక్ష్మీనారాయణ అరగంట బతిమిలాడాక ఆయనకు ఉన్నతాధికారి నంబరు రాసుకునేందుకు మాత్రం మొబైల్‌ ఇచ్చారు. నంబరు రాసుకుని... మరో వ్యక్తి ఫోన్‌ నుంచి జరిగిన విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం లక్ష్మీనారాయణను పంపించేశారు.
కోర్టు ఉద్యోగిపై చేయి చేసుకోవడాన్ని తీవ్రంగా పరిగణించిన కోర్టు
శుక్రవారం ఉదయం హైకోర్టులోని న్యాయమూర్తుల డ్రైవర్లు అందరూ కలిసి... తమ సహచరుడిపై పోలీసుల దాష్టీకాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఇదే సమయంలో హైకోర్టులో ‘కీలక’ స్థానంలో ఉన్న వ్యక్తి వద్దకు వెళ్లి పోలీసుల దుందుడుకు చర్యలను వివరించారు. డ్యూటీలో ఉన్న ఉద్యోగి.. అందులోనూ హైకోర్టు ఉద్యోగిని కొట్టడమే కాక న్యాయమూర్తుల కేసుల ఫైళ్లున్న వాహనాన్ని పోలీస్‌ స్టేషన్‌కు తరలించడాన్ని హైకోర్టు వర్గాలు తీవ్రంగా పరిగణించాయి.
ఆ తర్వాత లక్ష్మీనారాయణ గుంటూరు డీఎస్పీకి ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా మంగళగిరి రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుల జాబితాలో లక్ష్మీనారాయణపై దాడి చేసిన సీఐ శ్రీనివాసరావు పేరును చేర్చలేదు. నిందితుల కాలమ్‌లో ‘‘సీఐ’’ అని రాసి సరిపెట్టారు. విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగిని ఆయన విధులు నిర్వర్తించకుండా అడ్డుకున్నందుకు బీఎన్‌ఎస్‌ సెక్షన్‌ 132 కింద కేసు పెట్టారు. గాయమవుతుందని తెలిసినా గాయం చేయాలన్న ఉద్దేశంతో గాయపరిచారంటూ సెక్షన్‌ 115(2) కింద కూడా కేసు నమోదు చేశారు.

హైకోర్టులో ఉన్నతాధికారులను కలిసిన ఎస్పీ
సీఐ శ్రీనివాసరావు ఏకంగా హైకోర్టు ఉద్యోగిని కొట్టడం, హైకోర్టు తీవ్రంగా స్పందించడంతో గుంటూరు ఎస్పీ శుక్రవారం ఉదయం ఆగమేఘాలపై హైకోర్టుకు వచ్చి ఉన్నతాధికారులను కలిశారు. మొత్తం ఘటనపై వివరణ ఇచ్చారు. ఈ సమయంలో లక్ష్మీనారాయణపై దాడి చేసిన నిందితుల జాబితాలో సీఐ అని మాత్రమే రాయడంతో హైకోర్టులోని ‘కీలక వ్యక్తి’... ఎస్పీని గట్టిగా నిలదీశారు. మరోవైపు తమ ఉద్యోగిపై చెయ్యి వేయడమంటే హైకోర్టుపై వేయడమేనని హైకోర్టు వర్గాలు ఎస్పీకి తేల్చిచెప్పాయి.
డ్రైవర్‌ లక్ష్మీనారాయణ తప్పు చేసి ఉంటే చట్టప్రకారం చర్యలు తీసుకోవచ్చని, దానికి ఎవరూ అభ్యంతరం చెప్పరని ఎస్పీకి స్పష్టం చేశాయి. సీఐ చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం తీవ్ర విషయమని తెలిపాయి. పైగా న్యాయమూర్తులకు అందజేయాల్సిన కేసుల ఫైళ్లను కూడా స్టేషన్‌లో ఉంచడంపై ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఇది కోర్టు పాలనలో జోక్యం చేసుకోవడమేనని ఎస్పీతో వ్యాఖ్యానించాయి. కాగా పోలీసులు విధి లేని పరిస్థితుల్లో సీఐ శ్రీనివాసరావు పేరును లక్ష్మీనారాయణపై దాడి చేసిన నిందితుల జాబితాలో చేర్చారు.

Tags:    

Similar News