కొడాలి నానీ ఆరోగ్యంపై ఆందోళన ఎందుకు?
వైసీపీ ఫైర్ బ్రాండ్ నాయకుడు కొడాలి నాని ఆరోగ్యం సరిగా లేదంటూ వస్తున్న వార్తలు రాష్ట్రంలోని ఆయన అభిమానులను కలవరపరుస్తున్నాయి.
By : Admin
Update: 2024-05-24 03:45 GMT
వైసీపీ ఫైర్ బ్రాండ్ నాయకుడు కొడాలి నాని ఆరోగ్యం సరిగా లేదంటూ వస్తున్న వార్తలు రాష్ట్రంలోని ఆయన అభిమానులను కలవరపరుస్తున్నాయి. గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని అస్వస్థతకు గురయ్యారంటూ రెండు రోజులుగా వదంతులు వ్యాపించాయి. మే 23న (గురువారం) తన ఇంట్లో వైసీపీ నాయకులతో మాట్లాడుతూ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఏమైందో అర్థం కాక పార్టీ నేతలు ఇంట్లో ఉన్న సిబ్బందిని, గన్ మ్యాన్లను అప్రమత్తం చేశారు. దీంతో వాళ్లు నానికి ప్రాధమిక వైద్యం అందించారు. కుటుంబ వైద్యులకు సమాచారం అందించారు. నానికి విశ్రాంతి కావాలంటూ ఇంట్లో ఉన్న నాయకుల్ని, కార్యకర్తల్ని గన్మెన్లు బయటికి పంపించి వేశారు. ఇప్పుడీ వార్త ఆయన అభిమానుల్ని ఆందోళనకు గురి చేసింది.
ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన రోజు నుంచి ఇప్పటి వరకు సుమారు మూడు నెలల పాటు ఆయన నిర్విరామంగా ప్రచారంలో పాల్గొన్నారు. 75 రోజులు ఏకధాటిగా ఎన్నికల ప్రచారంలో బిజీబిజీగా పాల్గొన్నారు. ఎన్నికలు ముగిసిన తర్వాత గుడివాడలోని తన ఇంట్లో మండలాల నాయకులతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. పోలింగ్ సరళి, ఇతర వివరాలు తెలుసుకుంటున్నారు. ఇదే క్రమంలో గురువారం (మే 23) నందివాడ మండల వైసీపీ నేతలతో నాని భేటీ అయ్యారు. వారితో చర్చలు జరుపుతుండగానే.. నిల్చొని ఉన్న కొడాలి నాని ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయారు.
కొడాలి నానికి.. వైద్యులు సెలైన్లు ఎక్కిస్తున్నారు. నాని.. తీవ్రమైన ఆందోళనలో ఉన్నట్టు సమాచారం. గెలుపోటములు ఒకపక్క, కరోనా సమయంలో తీసుకున్న మందుల ప్రభావం మరోపక్క ఆయన ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నట్టు సమాచారం. గతంలోనూ ఆయన ఆరోగ్యంపై వదంతులు వచ్చాయి. ఆరోగ్య సంరక్షణపై దృష్టి సారించాలని డాక్టర్లు సలహా ఇచ్చారు. ఈ ఘటన జరిగినప్పుడు కుటుంబ సభ్యులు ఎవరూ ఇంట్లో లేరు. విషయం తెలుసుకుని హైదరాబాద్ నుంచి హుటాహుటిన గుడివాడకు కొడాలి కుటుంబ సభ్యులు బయల్దేరారు.
నానికి ఏమైందో తెలుసుకునేందుకు ఆయన అభిమానులు, వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున కొడాలి ఇంటి వద్ద గుమికూడి గంటగంటకీ వాకబు చేస్తున్నారు. అసలేం జరుగుతోందో తెలియక ఆందోళన చెందుతున్నాయి.
గెలుపుపై ధీమా ఉన్న ఆయన అంతగా ఆతృత చెందాల్సిన అవసరం ఏముందన్నది ఆయన అభిమానుల ఆవేదన. ఆయనకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయని, శ్వాస సంబంధమైన అనారోగ్య సమస్యలు ఆయన్ను వెంటాడుతున్నట్టు ఆయన సన్నిహితుడొకరు ఆమధ్య చెప్పారు. ఈ మధ్య నాని తరచూ అనారోగ్యానికి గురవుతున్నారు. హైదరాబాద్లో చికిత్స కూడా చేయించుకున్నారు. అయినా ఎందుకిలా జరిగిందో తెలియడం లేదు అని ఆయన అభిమానులు చెబుతున్నారు.