'ఫ్యాక్షన్ తప్ప నీకేం తెలుసు జగన్?'
రాజమహేంద్రవరం టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు విమర్శ;
By : The Federal
Update: 2025-09-15 10:15 GMT
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఫ్యాక్షనిజం తప్ప పీపీపీ (ప్రభుత్వం, ప్రైవేటు, పార్టనర్షిప్) మోడల్ ఏమి తెలుసంటూ రాజమహేంద్రవరం టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు విమర్శించారు. ప్రైవేటీకరణకు పీపీపీ మోడల్ కి తేడా తెలియకుండా అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నారంటూ విరుచుకుపడ్డారు. సోమవారం రాజమండ్రిలో మీడియాలో మాట్లాడుతూ... రాష్ట్రంలో వైద్య కళాశాలలు నిర్మిస్తామని జగన్ (YS Jagan) ప్రభుత్వం రూ.5వేల కోట్ల అప్పు చేసిందని.. ఆ నిధులు ఎటు మళ్లించారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
‘‘జగన్ అన్నట్టుగా రాజమహేంద్రవరం మెడికల్ కాలేజీ చూసి ఆహా అనలేం. వైసీపీ కార్యాలయాన్ని మాత్రం ఓహో అనేలా నిర్మించుకున్నారు. ప్రైవేటీకరణకు పీపీపీకి మధ్య వ్యత్యాసం తెలియని జగన్ ఐదేళ్లు సీఎంగా ఎలా పనిచేశారో మరి. అనేక అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో పీపీపీ విధానంలోనే వైద్య కళాశాలలు కొనసాగుతున్నాయి. పీపీపీ మెడికల్ కాలేజీల్లో కన్వీనర్ కోటా మెరిట్ సీట్లను కూటమి ప్రభుత్వం 42 నుంచి 50 శాతానికి పెంచింది. జగన్ అధికారంలో ఉండగా ఎందుకు పెంచలేదో వైసీపీ సమాధానం చెప్పాలి. జగన్ టీడీపీ బురద చల్లేసి కడుక్కోమంటున్నారు. ఫ్యాక్షన్ తరహాలో మెడికల్ కాలేజీల కాంట్రాక్టర్లను బెదిరిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజల మధ్య జగన్ ఉండటం శ్రేయస్కరం కాదు. రాష్ట్ర శ్రేయస్సు కోసం ఆయన జైలులో ఉండటమే మంచిది. జగన్ తరహాలోనే ఆయన శిష్యులు కూడా ఫేక్ మాటలు మాట్లాడుతున్నారు. మాజీ ఎంపీ మార్గాని భరత్ రోజురోజుకీ దిగజారిపోతున్నారు’’ అని ఆదిరెడ్డి వాసు విమర్శించారు.
రాష్ట్రంలో మెడికల్ కళాశాలలను పీపీపీ మోడల్ లోకి తీసుకురావడంపై ప్రస్తుతం వివాదం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఆదిరెడ్డి ఈ వ్యాఖ్యలు చేసి సంచలనం సృష్టించారు.