మూడు మరణాలతో బీఆర్ఎస్ కు ఏమిటి సంబంధం ?
రేవంత్ రెడ్డి వేసిన ఒక ప్రశ్న బీఆర్ఎస్ కీలకనేతలను బాగా ఇబ్బందిపెడుతోందా ? గ్రౌండ్ లెవల్లో జరుగుతున్న పరిణామాలను గమనిస్తుంటే అందరిలోను ఇదే అనుమానం పెరిగిపోతోంది;
రేవంత్ రెడ్డి వేసిన ఒక ప్రశ్న బీఆర్ఎస్ కీలకనేతలను బాగా ఇబ్బందిపెడుతోందా ? గ్రౌండ్ లెవల్లో జరుగుతున్న పరిణామాలను గమనిస్తుంటే అందరిలోను ఇదే అనుమానం పెరిగిపోతోంది. ఇంతకీ రేవంత్ వేసిన ప్రశ్న ఏమిటంటే మూడు మిస్టరీ మరణాలపై(Three Mystery deaths) కేటీఆర్ ఎందుకని విచారణ కోరటంలేదు ? అని. రేవంత్ యాంగిల్లో చూస్తే నిజమే అనిపిస్తుంది. ఎందుకంటే రాష్ట్రంలో ఎక్కడేమి జరిగినా వెంటనే కేటీఆ(KTR)ర్ మీడియా ముందుకొచ్చేసి రేవంత్(Revanth) ప్రభుత్వంపై నోటికొచ్చిన ఆరోపణలు చేస్తుంటారు. ట్విట్టర్ ఖాతాలో కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెచ్చిపోయి విచారణ చేయాలని, దర్యాప్తు చేయించాలని డిమాండ్లు చేస్తుంటారు. ఆ విషయాన్నే రేవంత్ డైరెక్టుగా ప్రస్తావించారు.
ఇంతకీ రేవంత్ చెప్పిన మూడు మరణాలతో బీఆర్ఎస్ కు ఉన్న లింకులు ఏమిటి ? ఏమిటంటే లాయర్ సంజీవరెడ్డి సుమారు ఆరుమాసాల క్రితం చనిపోయారు. ఇపుడు సంజీవరెడ్డి గురించి ప్రస్తావన ఎందుకంటే మేడిగడ్డ ప్రాజెక్టులో జరిగిన అవినీతి, అక్రమాలకు కేసీఆర్(KCR), హరీష్ రావు(Harish Rao) బాధ్యులని చెప్పి కోర్టులో పిటీషన్లు వేశారు. కాళేశ్వరం, మేడిగడ్డ ప్రాజెక్టుల్లో అవినీతిపై పోరాటంచేస్తున్న లాయర్ సంజీవరెడ్డి మరణం అప్పట్లో సంచలనమైంది. ఈమధ్యనే అంటే ఫిబ్రవరి 20వ తేదీన భూపాలపల్లి పట్టణ కేంద్రంలో రాజలింగంమూర్తి హత్యకు గురయ్యాడు. మూర్తి ఎవరంటే ఈయన హక్కుల కార్యకర్తే కాకుండా సామాజికసమస్యలపై పోరాటాలు చేస్తుంటాడు. కాళేశ్వరం, మేడిగడ్డ ప్రాజెక్టుల్లో అవినీతి, అక్రమాలకు కేసీఆర్, హరీష్ రావుతో పాటు ఉన్నతాధికారులే బాధ్యులని ఆరోపిస్తు కోర్టులో పిటీషన్ వేశాడు.
కేసీఆర్, హరీష్ అవినీతికి పాల్పడ్డారని ఆరోపిస్తు కోర్టులో ఆధారాలు కూడా సమర్పించారు. పిటీషన్ను విచారించిన హైకోర్టు తుదితీర్పు చెప్పేముందు రోజే భూపాలపల్లి పట్టణంలో రాత్రి మూర్తి హత్యకు గురయ్యాడు. ఫిర్యాదుదారుడే మరణించాడు కాబట్టి కేసువిచారణకు విలువలేదని హైకోర్టు అభిప్రాయపడింది. అయితే పబ్లిక్ ప్రాసిక్యూటర్ అందుకు అంగీకరించలేదు. ఫిర్యాదుదారుడు మరణించినా ఆయనిచ్చిన ఆదారాలను బట్టి కేసీఆర్, హరీష్ అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారా లేదా అన్న విషయాన్ని కోర్టు నిర్ధారించవచ్చని, విచారణ కంటిన్యు చేయాలని వాదించారు. కేసు విచారణను హైకోర్టు వాయిదావేసింది.
చివరగా నాలుగు రోజుల క్రితం దుబాయ్ లో సినిమా ప్రొడ్యూసర్, రియల్ ఎస్టేట్ వ్యాపారి కేదార్ మరణించాడు. దుబాయ్ లోని తనింట్లో కేదార్ నిద్రలోనే మరణించటంతో అనుమానాలు పెరిగిపోతున్నాయి. కారణం ఏమిటంటే కేదార్ మరణించిన సమయంలో బీఆర్ఎస్ కు చెందిన మాజీ ఎంఎల్ఏ రోహిత్ రెడ్డి ప్రొడ్యూసర్ ఇంట్లోనే ఉన్నట్లు జరుగుతున్న ప్రచారం అందరికీ తెలిసిందే. అయితే జరుగుతున్న ప్రచారాన్ని రోహిత్ ఖండించారు. తాను తనింట్లోనే ఉన్నట్లు చెప్పారు. ఈ ప్రొడ్యూసర్ గతంలో డ్రగ్స్ వ్యవహారంలో పట్టుబడ్డాడు. కేటీఆర్-కేదార్ వ్యాపార భాగస్వాములని రేవంత్ ఆరోపించాడు. కేదార్ మరణించిన సమయంలో ఆయనింట్లో బీఆర్ఎస్(BRS) మాజీ ఎంఎల్ఏ ఉన్నాడా ? ఉంటే ఎందుకు ఉన్నాడు అన్న విషయమే ఇపుడు మిస్టరీగా మారింది.
పై మూడు మరణాలనే రేవంత్ మిస్టరీ మరణాలని కామెంట్ చేసింది. ఈ మూడు మిస్టరీ మరణాలపై కేటీఆర్ ఎందుకని విచారణ కోరటంలేదని నిలదీయటంలో లాజిక్ ఉందనే చాలామందికి అనిపిస్తోంది. విచారణ చేయాలని కోరటమే కాదు అసలు పై ముగ్గురు చనిపోయిన విషయాన్ని కూడా కేటీఆర్ ఎక్కడా ప్రస్తావించటంలేదు. కేటఆరే కాదు హరీష్ రావు, కవితతో పాటు బీఆర్ఎస్ నేతల్లో ఏ ఒక్కరూ మూడు మరణాలపై మాట్లాడటానికి ఏమాత్రం ఇష్టపడకపోవటమే మామూలు జనాల్లో అనుమానాలు పెరిగిపోవటానికి కారణమవుతోంది. మరి కేటీఆర్ ఎప్పటికి స్పందిస్తారో చూడాలి.