కంచికచర్లలో పెన్షన్ సొమ్ముతో పరారైన వెల్ఫేర్ అసిస్టెంట్
సామాజిక పెన్షన్ ల సొమ్ముతో వెల్పేర్ అసిస్టెంట్ పరారయ్యాడు. ఆయనపై పోలీస్ కేసు నమోదైంది. ప్రత్యామ్నాయ ఏర్పాట్ల ద్వారా పెన్షన్ పంపిణీ చేశారు.;
వృద్ధులు, దివ్యాంగులు, వ్యాధి గ్రస్తులకు ఇచ్చే సామాజిక పెన్షన్ సొమ్ముతో సచివాలయ ఉద్యోగి పరారయ్యాడు. ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. మంగళవారం ఉదయం పింఛన్ లు పంచేందుకు రాకపోవడంతో కంచికచర్ల ఎంపీడీవో లక్ష్మీకుమారి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కంచికచర్ల సచివాలయం 3 లో సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్ తోట తరుణ్ కుమార్ ఆరు నెలల క్రితం ఉద్యోగంలో చేరాడు. పింఛన్ డబ్బులు రూ.7.55 లక్షలు పంపిణీ కోసం తీసుకుని ఏప్రిల్ ఒకటిన పంపిణీకి రాలేదు. దీంతో ఎంపీడీవో లక్ష్మీ కుమారి అరుణ్ కుమార్ సొంత ఊరు అయిన పెనుగొలను ఫోన్ చేసి కనుక్కోగా ఇంట్లో నుంచి పరారైనట్లు అక్కడి వారు తెలిపారు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. తోట తరుణ్ అనే వెల్ఫేర్ అసిస్టెంట్ గా జులై నెలలో జాయిన్ అయ్యాడని ఈరోజు ఉదయం నుంచి పెన్షన్ పంపిణీ చేయవలసి ఉండగా ఫోన్ స్విచ్ ఆఫ్ అవ్వడంతో ఆరా తీస్తే పరారైనట్లుగా తెలిసిందని ఎంపీడీవో తెలిపారు.