'నకిలీ మద్యం తయారీదారుల అంతుచూస్తాం'
వైసీపీ అసత్యాలు ప్రచారం చేస్తోందన్న మంత్రి పార్థసారథి
By : The Federal
Update: 2025-10-18 11:42 GMT
వైసీపీపై మరోసారి విరుచుకుపడ్డారు రాష్ట్ర మంత్రి కె. పార్థసారథి. తెలుగుదేశం ప్రభుత్వం చేసే ఏ పనిని వైసీపీ మెచ్చడం లేదని అన్నారు. వైసీపీ తీరును ప్రజలు అసహ్యించుకుంటున్నారన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధిని చూసి యావత్ ప్రపంచం మెచ్చుకుంటున్నా వైసీపీ మాత్రం సంకుచితంగా చూస్తోందని విమర్శించారు.
‘ప్రజల్లో వైషమ్యాలు రెచ్చగొట్టేలా వైసీపీ నేతలు ప్రవర్తిస్తున్నారు. రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నిస్తున్నారు. కల్తీ మద్యంపై వైసీపీ నేతలు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంది. వైసీపీ హయాంలో నాసిరకం మద్యం వల్ల ప్రజలు అనారోగ్యం పాలయ్యారు. నకిలీ మద్యాన్ని మా ప్రభుత్వం ఉక్కుపాదంతో అణిచివేస్తోంది. సిట్ రిపోర్టుకు అనుగుణంగా తదుపరి చర్యలు ఉంటాయి’’ అని పార్థసారథి అన్నారు.
నకిలీ మద్యం తయారీ సృషికర్తల్ని వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు. కల్తీ మద్యంపై ఉక్కుపాదం మోపుతున్నామని తెలిపారు. టీడీపీ నేతలున్నా పార్టీ నుంచి ఇప్పటికే సస్పెండ్ చేశామని అన్నారు. కల్తీ మద్యాన్ని అరికట్టాలని ప్రభుత్వ సురక్ష యాప్ తీసుకొచ్చిందని తెలిపారు. యాప్ ద్వారా హోలో గ్రామ్ నుంచి సమాచారం తెలుసుకోవచ్చని.. దీనిపై తప్పుడు సమాచారం ప్రచారం చేస్తున్నారని సీరియస్ అయ్యారు. వైసీపీ హయాంలో స్కూటర్స్‌లో మద్యం డోర్ డెలివరీ చేశారని అన్నారు.. డిజిటల్ పేమెంట్స్ కే ఎక్కువ ప్రాధాన్యత అని తేల్చిచెప్పారు. ప్రభుత్వ అధికారులతో తాము మద్యం అమ్మడం లేదని స్పష్టం చేశారు. తక్కువ ధరకు లిక్కర్‌ను అన్ని నియోజకవర్గాల్లో అందిస్తున్నామని అన్నారు. బార్లలో 15 శాతం ఎక్కువ ట్యాక్స్‌తో లిక్కర్ అమ్మే దానిపై కమిటీ వేయనున్నట్లు తెలిపారు.
ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోందన్నారు. ఈ విషయంలో ఎవర్నీ వదిలిపెట్టేదిలేదన్నారు. నకిలీ మద్యం తయారీదారుల గుట్టురట్టు చేస్తామని, వైసీపీ ప్రభుత్వం మాదిరిగా తమ ప్రభుత్వం ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడదని చెప్పారు. చంద్రబాబు సమర్థపాలన చూసి ఏపీకి పరిశ్రమలు తరలివస్తున్నాయని, అందుకు నిదర్శనమే విశాఖపట్నానికి గూగుల్ డేటా సెంటర్ రావడమని పార్ధసారధి చెప్పారు.న