టమోటా రైతులకు అచ్చెన్న అభయ హస్తం
ఆందోళనలు చెందొద్దని మంత్రి అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్ లో రమోటా రైతులు ఎవ్వరూ ఆందోళనలు చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు భరోసా ఇచ్చారు. ఏవైనా ఇబ్బందులు తలెత్తినపుడు, రైతులకు ఎటువంటి నష్టం కలగకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని మంత్రి హామీ ఇచ్చారు. ఆదివారం రాప్తాడు మార్కెట్‌లో టమోటా ధరలు గరిష్టం రూ.18, కనిష్టం రూ.9, మోడల్ ధర రూ.12గా ఉన్నాయి. 30–40 మెట్రిక్ టన్నుల సరుకు పత్తికొండ మార్కెట్‌కు వస్తుందని, దసరా సెలవుల కారణంగా 10 టన్నులు అదనంగా చేరినట్లు, రోడ్లపై 2వ గ్రేడ్ క్వాలిటీ టమాటాలు వేసి గందరగోళం సృష్టించబడినట్లు మంత్రి వివరించారు.
ఇప్పటివరకు 10 మెట్రిక్ టన్నుల టమోటాలను వివిధ రైతు బజార్లకు పంపించామని, ఈ రోజు సోమవారం నాడు పత్తికొండ మార్కెట్ నుంచి 10 మెట్రిక్ టన్నులు చిత్తూరు ప్రొసెసింగ్ యూనిట్‌కు, 15 మెట్రిక్ టన్నులు రైతు బజార్లకు పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రకు సరుకు వర్షాల కారణంగా తగ్గిన నేపథ్యంలో, ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల టమాటా అమ్మకాలు మందగించాయని మంత్రి అచ్చెన్నాయుడు వివరించారు. ప్రస్తుతం టమాటాలకు ట్రెండింగ్ ధర బట్టి రైతులకు మంచి ధర లభిస్తోంది. ఏవైనా ఇబ్బందులు తలెత్తితే ప్రభుత్వం అన్ని విధాలుగా రైతులను ఆదుకుంటుందని మంత్రి హామీ ఇచ్చారు.