చెత్తనే కాదు వాటిని కూడా క్లీన్‌ చేస్తా

పల్నాడులో జాగ్రత్తగా ఉండాలని, ప్రజలపై దాడులు చేస్తే ఊరుకునేది లేదని సీఎం చంద్రబాబు హెచ్చరించారు.

Update: 2025-09-20 10:25 GMT

చెత్తను తొలగించడంతో పాటుగా చెత్త రాజకీయాలను కూడా క్లీన్‌ చేస్తామని, చెత్తను తీస్తేనే సరపోదని, మనసులో చెత్తను కూడా పూర్తిగా తొలగించాలని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. స్వర్ణ ఆంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం ఆయన పల్నాడు జిల్లా మాచర్ల పర్యటన చేశారు. పారిశుద్ధ్య కార్మికులతో కలిసి ఆయన స్థానిక చెరువు వద్ద చెత్తను ఊడ్చారు. అనంతరం కార్మికులతో సీఎం చంద్రబాబు ముచ్చటించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరంగా మార్గదర్శి– బంగారు కుటుంబాలతో ఆయన సమావేశం అయ్యారు. అనంతరం ఆయన అక్కడ నిర్వహించిన ప్రజా వేదిక నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ.. మాచర్లకు స్వాతంత్య్రం వచ్చింది. అందరిలోనూ సంతోషం కనిపిస్తోంది. ఇది శాశ్వతం కావాలన్నారు. ఎక్కడో రాజీవ్‌ గాంధీ హత్య జరిగితే.. మాచర్లలో రౌడీలు విధ్వంసం సష్టించారు.

మొన్నటి వరకూ ఇక్కడ ప్రజాస్వామ్యంగా ఎన్నికలు లేవు. కొందరు డిక్టేటర్లు ఉన్నారు. ప్రవర్తన మార్చుకోకపోతే ప్రజలు క్షమించరని పరోక్షంగా వైసీపీ నాయకులను హెచ్చరించారు. మాచర్ల వద్దామంటే నా ఇంటికి తాళ్లు కట్టి రానీయకుండా చేశారు. నా ఇంటికి తాళ్లు కట్టి వారి మెడలకు ఉరితాళ్లు వేసుకున్నారని ఎద్దేవా చేశారు. గతంలో ఇక్కడ చాలా అరాచకాలు చేశారు. వారందరికీ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నా అని పేర్కొన్నారు. రౌడీయిజం చేసినా.. విధ్వంసం చేసినా చూస్తూ ఊరుకోను. నేరాలు వద్దు ఘోరాలు చేయొద్దు. మన పరిసరాల్లోని చెత్తే కాదు.. రాజకీయ చెత్తను కూడా తొలగించాల్సి ఉందన్నారు. గత పాలకులు 85 లక్షల మెట్రిక్‌ టన్నుల చెత్తను అలాగే ఉంచేశారు. చెత్తపై పన్నేశారు. ఆ చెత్తను తొలగించటంతో పాటు చెత్త రాజకీయాలను కూడా తొలగిస్తాను అని సీఎం చంద్రబాబు వెల్లడించారు.
అక్టోబరు 2 గాంధీ జయంతి కల్లా లెగసీ చెత్తను తొలగించేస్తామన్నారు. స్వచ్ఛ వాహనాల ద్వారా పాత వస్తువులు ఇచ్చిన వారికి కావలసిన నిత్యవసర సరుకులు అందిస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను ప్లాస్టిక్‌ ఫ్రీగా మారుస్తామని, 2047 నాటికి ఏపీలో 50 శాతం పచ్చదనం ఉండే విధంగా తయారు చేస్తామన్నారు. త్వరలో సంజీవని కార్యక్రమాన్ని తీసుకొస్తున్నామని, దీని ద్వారా ప్రతి ఒక్కరికీ రూ. 2.5లక్షల బీమా, పేదలకు రూ. 25లక్షల ఆరోగ్య బీమా అందుబాటులోకి తెచ్చి, ఇంటి వద్దే వైద్యం అందే విధంగా చూస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. మాచర్లకు తాగు నీటి సమస్య ఉందని, దీనిని పరిష్కరిస్తామన్నారు. మాచర్లకు వంద పడకల ఆసుపత్రిని మంజూరు చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. పల్నాడు ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామన్నారు.
Tags:    

Similar News