కరేడులో 8,200 ఎకరాలను తీసుకుంటాం
రెవెన్యూ, రిజిస్ట్రేషన్ స్టాంప్స్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అసెంబ్లీలో వెల్లడించారు.;
కరేడు భూములను తీసుకునేందుకు కూటమి ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. కరేడు భూములను రైతుల నుంచి తీసుకుంటామని అసెంబ్లీ సాక్షిగా మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు. శాసనమండలిలో గురువారం కరేడు భూముల సేకరణపై తూమాటి మాధవరావు అడిగిన ప్రశ్నకు ఆయన మండలిలో సమాధానం చెప్పారు. కరేడు ప్రాంతాన్ని పారిశ్రామిక హబ్‌ను ఏర్పాటుచేయాలనే లక్ష్యంతో రైతుల నుండి భూములను సేకరణ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు చెప్పారు. 8,200 ఎకరాలను భూసేకరణ ద్వారా సేకరిస్తామన్నారు. అయితే భూసేకరణ కారణంగా ఉపాధి కోల్పోయే కరేడు గ్రామంలోని కుటుంబాలకు ఉపాధిని కల్పించే బాధ్యత తమ కూటమి ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. పారిశ్రామిక హబ్ ఏర్పాటు ద్వారా వచ్చే ఉద్యోగఅవకాశాల్లో స్థానికులకే మొదటి అవకాశాలు కల్పిస్తామన్నారు. కరేడులో మొత్తం ఇండోసోల్ కంపెనీ ఏర్పాటుచేయబోయే పారిశ్రామిక హబ్ కు 8,200 ఎకరాలు సేకరిస్తున్నామని స్పష్టం చేశారు. రైతులను ఒప్పించి భూసేకరణ చేస్తున్నామని వెల్లడించారు.