కొండలపై ఉంటే గిరిజనులకు వసతులు కల్పించలేం

ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు పాడేరులో ప్రాంతంలో పర్యటించారు.;

Update: 2025-08-09 10:14 GMT

గిరిజన ప్రాంతాల్లో కింద భాగాల్లో ఉన్న ఇళ్లను వదిలేసి కొంత మంది కొండలపైన మళ్లీ ఇళ్లేసుకుని అక్కడే నివసించేందుకు ఇష్టపడుతుంటారని.. అలాంటి ఎతైన కొండ ప్రాంతాల్లో నివసించే వారికి మౌలిక వసతులు కల్పించలేమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అయితే ఇది వరకు కొండ ప్రాంతాల్లో నివసించే వారి కోసం ప్రత్యేకంగా ఫీడర్‌ అంబులెన్సులను అందుబాటులోకి తెచ్చామన్నారు.

ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా శనివారం అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండలం వంజంగిలో సీఎం చంద్రబాబు పర్యటించారు. అక్కడ వనదేవత మోదకొండమ్మను సీఎం చంద్రబాబు దర్శించుకున్నారు. గిరిజన సంప్రదాయ వేడుకలకు ఆయన హాజరయ్యారు. అక్కడ కాఫీ ప్లాంటేషన్లోని తోటలను పరిశీలించారు. కాఫీ పెంపకందారులతో ఆయన ముచ్చటించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం లగిశపల్లిలో సీఎం చంద్రబాబు పర్యటించారు. ప్రజావేదిక వద్ద గిరిజన ప్రాంతంలో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పథకాలకు శంకుస్థాపనలు.. ప్రారంభోత్సవాలు చేశారు. ఉత్పత్తులకు సంబంధించిన స్టాళ్లను పరిశీలించారు. జీసీసీ నూతన ఉత్పత్తులను ఆయన పరిశీలించారు. వాటికి సంబందించిన వైబ్‌సైట్‌ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ఐటీడీఏ ప్రాంతాల్లో రూ. 50 కోట్లతో మల్టీ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రులను నిర్మించి త్వరలోనే అందుబాటులోకి తెస్తామన్నారు. గురుకుల పాఠశాలలతో పాటు ఏజెన్సీ ఏరియాల్లోని అన్నీ పాఠశాలలను బాగుచేస్తామన్నారు. ఏజెన్సీ ఏరియాను ఎకో టూరిజమ్‌ హబ్‌గా తయారు చేస్తామన్నారు. గిరిజన ప్రాంతాల్లో గంజాయి సాగులేకుండా చేస్తామన్నారు.
స్థానిక గిరిజనులకు ఉద్యోగాలు ఇవ్వాలనే ఉత్తర్వులను తొలుత ఎన్టీఆర్‌ తీసుకొచ్చారే అని, తర్వాత దానిని కాంగ్రెస్, వైసీపీలు నిలిపి వేశాయని, తిరిగి దీనిని తీసుకొస్తామని హామీ ఇచ్చారు. ఆర్గానిక్‌ పద్ధతిలో వ్యవసాయానికి చర్యలు తీసుకుంటామన్నారు. అటవీ ఉత్పత్తులకు మంచి మార్కెటింగ్‌ విధానాలను అందుబాటులోకి తెస్తామన్నారు. అంతకుముందు వివిధ గిరిజన ఉత్పత్తులు, కాఫీ సాగు, మార్కెటింగ్, టూరిజం, హోం స్టే, హోం హట్స్, వంటి అంశాలకు సంబంధించి పలు కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. సీఎం చంద్రబాబు సమక్షంలో వివిధ సంస్థలు టూరిజం శాఖ, జీసీసీ, కాఫీ బోర్డు, రబ్బర్‌ బోర్డులతో ఎంఓయూలు కుదుర్చుకున్నారు.
ఏజెన్సీ ప్రాంతంలో సెరీకల్చర్‌ సాగును 10 వేల ఎకరాల్లో చేపడుతున్నట్టు సీఎంకు అధికారులు వివరించారు. సెరీకల్చర్‌ ద్వారా వచ్చిన పట్టుదారాలతో నేసిన వస్త్రాలను ఆయన పరిశీలించారు. నిఫ్ట్‌ వంటి సంస్థలతో కలిసి పని చేయడం ద్వారా ఏజెన్సీలో నేసిన వస్త్రాలకు మంచి డిమాండ్‌ వచ్చేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఏజెన్సీలో నేసిన ఓ చీరను సీఎం చంద్రబాబు కొనుగోలు చేశారు. స్టాల్లో డ్వాక్రా మహిళ ఏర్పాటు చేసిన అరకు కాఫీ స్టార్‌ సందర్శింటచి, కాఫీ సేవించారు, కూకీస్, మిల్లెట్‌ బిస్కట్లు, స్థానికంగా లభించే ముడిసరుకునే ఉపయోగించి చాక్లెట్లను తయారీ మీద కూడా దృష్టి సారించాలని అధికారులకు సూచించారు.
Tags:    

Similar News