ప్రయాణిస్తున్న ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌లోనే ప్రసవం
తోటి ప్రయాణికుల సాయంతో పండంటి మగబిడ్డకు రైల్లోనే తల్లి జన్మనిచ్చింది.
బెంగళూరు-భువనేశ్వర్ ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ (18464) రైలులో మంగళవారం అకస్మాత్తుగా జరిగిన ప్రసవం అందులో ప్రయాణిస్తున్న తోటి ప్రయాణికులను ఒకింత ఆందోళనకు, ఆశ్చర్యానికి గురిచేసింది. వైద్య సదుపాయాలు, వైద్యలు లేని పరిస్థితిలో రైలులో ప్రయాణిస్తున్న సమయంలో అకస్మాత్తుగా నొప్పులు రావడంతో బిడ్డకు, తల్లికి ఏమైనా అవుతుందేమో అని ప్రయాణికులు ఆందోళనలతో పాటు టెన్షన్ పడ్డారు. అలాంటివేమీ జరక్కుండా సుఖవంతంగా ప్రసవం జరగడంతో సంతోషంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
ఝార్ఖండ్ రాష్ట్రానికి చెందిన గర్భిణి సునికా ఛత్తర్ భర్తతో కలిసి భువనేశ్వర్‌కు వెళ్లేందుకు అనంతపురం జిల్లా గుత్తి రైల్వే స్టేషన్‌లో రైలు ఎక్కారు. మార్గమధ్యంలో ఆమెకు తీవ్రమైన నొప్పులు ప్రారంభమయ్యాయి. అయితే రైలు అనకాపల్లి స్టేషన్‌కు చేరే ముందే ఆమె పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. రైలులో ప్రయాణిస్తున్న తోటి ప్రయాణికుల సహాయంతో సునికా ఛత్తర్ రైలులోనే సురక్షితంగా ప్రసవించారు. అనంతరం రైల్వే అధికారులకు సమాచారాన్ని అందించారు. ఈ విషయాన్ని తెలుసుకున్న రైల్వే అధికారులు తక్షణమే చర్యలు పట్టారు. రైలు అనకాపల్లి స్టేషన్‌కు చేరుకున్న క్షణంలో ఆర్‌పీఎఫ్ ఏఎస్ఐ టి.వెంకటనాయుడు ఆధ్వర్యంలో ఉన్న పోలీసులు, వైద్య సిబ్బంది సిద్ధంగా ఉండి తల్లీబిడ్డలను 108 ఆంబులెన్స్‌లో అనకాపల్లి జిల్లా ఆసుపత్రికి తరలించారు. సునికా ఛత్తర్‌కు ఏడో నెలలోనే ప్రసవం జరిగింది. ప్రస్తుతం తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నారు. ప్రయాణికులు ఈ సంఘటనను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటూ, సకాలంలో స్పందించిన రైల్వే సిబ్బందిని ప్రశంసించారు.