మోదీ, పవన్‌ సహకారంతో పని చేస్తున్నాం

ఎమ్మెల్యేలు పర్సనల్‌ అజెండాలు పెట్టుకుని మాట్లాడితే.. రాష్ట్రాన్ని అభివద్ధి చేయాలనే లక్ష్యానికి అడ్డంకి కలుగుతుందని సీఎం చంద్రబాబు అన్నారు.

Update: 2025-09-27 13:51 GMT

ప్రధాని మోదీ, పవన్‌ కళ్యాణ్‌ సహకారంతో ప్రభుత్వం అంకిత భావంతో పని చేస్తోందని సీఎం చంద్రబాబు అన్నారు. ఇదో టీం.. ఈ టీంలో ఏ ఒక్కరు తప్పు చేసినా... విఘాతం కలిగించేలా వ్యవహరించినా.. రాష్ట్రానికి చాలా నష్టం జరుగుతుంది. ఎమ్మెల్యేలు పర్సనల్‌ అజెండాలు పెట్టుకుని మాట్లాడితే.. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యానికి అడ్డంకి కలుగుతుందన్నారు. శనివారం అసెంబ్లీలో సూపర్‌ సిక్స్, మేనిఫెస్టో హామీల అమలుపై ఆయన మాట్లాడారు. ఆటో డ్రైవర్ల సేవలో పథకాన్ని ప్రారంభించనున్నట్టు సభలో సీఎం ప్రకటించారు. కలిసి ఉన్నాం కాబట్టే... ఇవన్నీ చేయగలుగుతున్నాం. దీన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలన్నారు.

అక్టోబర్‌ 4వ తేదీన ‘ఆటో డ్రైవర్ల సేవలో’ పథకాన్ని ప్రారంభిస్తున్నాం. ఈ పథకం కింద సొంత వాహనం కలిగిన ప్రతి ఆటో డ్రైవర్‌కు ఏడాదికి రూ.15 వేల చొప్పున అందిస్తాం. ఈ పథకానికి అర్హులుగా 2,90,234 మంది డ్రైవర్లు ఉన్నారు. ఏదైనా కారణాలతో లబ్దిదారుల జాబితాలో అర్హులైన వారి పేరు లేకపోతే... వారి సమస్యలను పరిష్కరించి వారినీ లబ్దిదారుల జాబితాలో చేరుస్తాం. ఆటో, క్యాబ్‌ డ్రైవర్లకు ఆటో డ్రైవర్ల సేవలో స్కీంను వర్తింప చేస్తాం. ఆటో డ్రైవర్ల సేవలో పథకానికి యేటా రూ.435 కోట్ల ఖర్చు అవుతుంది. గత ప్రభుత్వం రూ.12 వేలు మాత్రమే ఇస్తే కూటమి ప్రభుత్వం రూ.15 వేలు అందించేందుకు నిర్ణయించిందని ముఖ్యమంత్రి చెప్పారు.
డ్వాక్రా సంఘాల ద్వారా మహిళలను బలోపేతం చేశాం. డ్వాక్రా మహిళలు పెద్ద ఎత్తున డబ్బులను పొదుపు చేస్తున్నారు. బ్యాంకుల ద్వారా రుణాలు తీసుకుని తిరిగి పూర్తి స్థాయిలో చెల్లించేస్తున్నారు. డ్వాక్రా మహిళల్లో కేవలం 1 శాతం మాత్రమే ఎన్పీఏలుగా ఉన్నారంటే మహిళా శక్తి ఏంటో అర్థం చేసుకోండి. చాలా పరిశ్రమలు, చాలా మంది అప్పులు తీసుకుని ఎన్పీఏలుగా మారుతున్నారు. కానీ డ్వాక్రా సంఘాలు మాత్రం తీసుకున్న అప్పులను నిఖార్సుగా తిరిగి చెల్లిస్తున్నారు. లక్ష మంది మహిళలను పారిశ్రామిక వేత్తలుగా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. మహిళా పారిశ్రామిక వేత్తలను తయారు చేసే బాధ్యతను ఎమ్మెల్యేలు తీసుకోవాలి. ప్రతి ఎమ్మెల్యే 1000 మంది మహిళలను గుర్తించి పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దేలా కృషి చేయాలన్నారు.
అన్నదాత సుఖీభవ కింద రూ.20 వేలు ఇస్తామని హామీ ఇచ్చాం. గత ప్రభుత్వం రాష్ట్ర వాటా కింద రూ. 7500 ఇస్తే.. కూటమి ప్రభుత్వం రూ.14 వేలు ఇస్తోంది. మూడు విడతల్లో అన్నదాత సుఖీభవ పథకాన్ని పీఎం కిసాన్‌ పథకంతో జోడించి ఇస్తున్నాం. రాష్ట్రంలోని యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పిస్తున్నాం. ఇప్పటి వరకు 4,71,574 మందికి ఉద్యోగావకాశాలు కల్పించాం. స్కిల్‌ డెవలప్మెంట్‌ శిక్షణ ద్వారా పరిశ్రమలకు మ్యాన్‌ పవర్‌ అందించేలా చూస్తాం. ఉద్యోగాల కల్పన ప్రభుత్వానికి మొదటి ప్రాధాన్యత. 2014–19 మధ్య కాలంలో అన్న క్యాంటీన్లు పెట్టాం. ఇప్పుడు 204 అన్న క్యాంటీన్లు ఉన్నాయి.. త్వరలో గ్రామీణ ప్రాంతాల్లో కూడా 70 అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేయనున్నాం. రూ.104 కోట్ల మేర సబ్సిడీని అందించాం. ప్రతి దేవాలయంలో అన్నదానం కార్యక్రమం చేపడతామని సీఎం చెప్పారు.
దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా యూనివర్శల్‌ హెల్త్‌ పాలసీ ద్వారా ప్రజలందరికీ ఆరోగ్య బీమా కల్పించే విధానానికి శ్రీకారం చుట్టాం. ఈ తరహా పాలసీ మరే ఇతర రాష్ట్రంలోనూ లేదు. 1.63 కోట్ల మంది పేదలకు రూ. 25 లక్షల వరకు ఉచితంగా చికిత్సలు అందించేలా పాలసీ రూపొందించాం. మత్స్యకారుల సేవలో కార్యక్రమంలో భాగంగా ఏడాదికి వేట విరామ సమయంలో రూ.20 వేలు అందిస్తున్నాం. మత్స్యకారులకు ఇబ్బందిగా మారిన జీవో నెంబర్‌ 217 రద్దు చేశాం. పీఎం సూర్య ఘర్‌ పథకం కింద సోలార్‌ రూఫ్‌ టాప్‌ లు అందిస్తున్నాం. బీసీలకు సబ్సిడీ మీద, ఎస్సీ, ఎస్టీలకు ఉచితంగా సోలార్‌ రూఫ్‌ టాప్‌ లు అందిస్తామన్నారు.
అందరికీ ఇళ్లు పథకంలో భాగంగా ఇప్పటి వరకు 3 లక్షల ఇళ్లు పూర్తి చేశాం. వచ్చే ఏడాది జూన్‌ నాటికి 6.15 లక్షల ఇళ్లను అందుబాటులోకి తెస్తాం. 2029 నాటికి ప్రతి ఒక్కరికీ ఇల్లు ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఉచిత ఇసుకలు అక్రమాలు చోటు చేసుకోకుండా స్థానికంగా ఉండే ఎమ్మెల్యేలే చూసుకోవాలి. పీ4లో భాగంగా స్వచ్ఛంధంగా ముందుకు రావాలని పిలుపునిచ్చాం. మొత్తంగా 99,822 మంది మార్గదర్శులు 9,68,513 బంగారు కుటుంబాలను దత్తత తీసుకుంటున్నారు. ఆర్థిక అసమానతలు తగ్గించడానికి పీ4 వేదిక. 2047 నాటికి స్వర్ణాంధ్ర సాధన దిశగా అందరూ పని చేయాలి అని సీఎం కోరారు. ఇప్పటి వరకు 14 సార్లు తిరుమల వేంకటేశ్వరస్వామికి పట్టు వస్త్రాలు సమర్పించాను. పేదల కోసమే అనునిత్యం ఆలోచన చేస్తున్నాను. రాష్ట్రాన్ని పునర్‌ నిర్మాణం చేయడం... తెలుగు జాతిని నెంబర్‌–1 రాష్ట్రంగా చేయడానికి నేను పని చేస్తున్నాను... అలాగే అందరూ పని చేయాలి. అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు.
Tags:    

Similar News