పోలీసుల కస్టడీకి వర్రా..రెండు రోజుల పాటు విచారణ

కడప జిల్లాలో వర్రా పోలీసుల కస్టడీ హాట్‌ టాపిక్‌గా మారింది. విచారణలో ఎవరి పేర్లు చెబుతాడేమో అని ఉత్కంఠ నెలకొంది.;

By :  Admin
Update: 2025-01-08 05:36 GMT

కడప జిల్లా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సోషల్‌ మీడియా కార్యకర్త వర్రా రవీందరరెడ్డి అంశం మళ్లీ తెరపైకొచ్చింది. తాజాగా ఆయనను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. పులివెందుల పోలీసులు రెండు రోజుల పాటు వర్రా రవీందరరెడ్డిని విచారణ చేయనున్నారు. వర్రా రవీందరరెడ్డి ప్రస్తుతం కడప జైలులో ఉన్నారు. వర్రాను పోలీసులు కస్టడీకి తీసుకున్న నేపథ్యంలో ఆయన్ను కడప జైలు నుంచి రాజీవ్‌ గాంధీ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్‌సెస్‌(రిమ్స్‌)కు తరలించారు. రిమ్స్‌లో వర్రాకు వైద్య పరీక్షలు నిర్వహించినున్నారు. అనంతరం కడప సైబర్‌ క్రైమ్‌ పోలీసు స్టేషన్‌లో వర్రాను విచారించనున్నారు. బుధవారం, గురువారం రెండు రోజుల పాటు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు తన న్యాయవాదుల సమక్షంలో వర్రా రవీందరరెడ్డిని విచారణ చేయొచ్చని కడప 4వ అదనపు జిల్లా కోర్టు మంగళవారం అనుమతి ఇచ్చింది. దీంతో బుధవారం పోలీసులు వర్రాను తమ కస్డడీలోకి తీసుకున్నారు.

కూటమి అధికారం చేపట్టిన తర్వాత సోషల్‌ మీడియా కేసులు తెరపైకి తెచ్చింది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్, మంత్రులు నారా లోకేష్, వంగలపూడి అనితలపైన వర్రా రవీందరరెడ్డి సోషల్‌ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టాడని కేసు నమోదు చేశారు. గతేడాది నవంబరు 8వ తేదీన వర్రా రవీందరెడ్డితో పాటు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సోషల్‌ మీడియా ఇన్‌చార్జి సజ్జల భార్గవరెడ్డి, అర్జున్‌రెడ్డిల మీద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుల్లో ఏ1 నిందితుడిగా ఉన్న వర్రాను నవంబరు 11న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వర్రా రవీందరరెడ్డిని ఇది వరకే పోలీసులు విచారణ చేశారు. ఇన్‌చార్జీగా ఉన్న సజ్జల భార్గవరెడ్డి డైరెక్షన్స్‌ మేరకు తాను సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టానని వర్రా వెల్లడించారు.
వర్రా రవీందరెడ్డిని పోలీసులు కస్టడీకి తీసుకున్న నేపథ్యంలో కడప జిల్లా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ శ్రేణుల్లో అలజడి మొదలైంది. పోలీసుల విచారణలో వర్రా తమ పేర్లు చెబుతాడేమో అని కలవర పడుతున్నారు. మరి ముఖ్యంగా కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి తన అనుచరుల్లో ఆందోళనలు మొదలైనట్లు స్థానికంగా చర్చ జరుగుతోంది. తమపైన కూడా అసభ్యకరమైన పోస్టులు సోషల్‌ మీడియాలో పెట్టారని ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల, మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి కుమార్తె వైఎస్‌ సునీతలు గతంలో విమర్శలు గుప్పించారు. గతేడాది నవంబరులో కడప జిల్లా ఎస్పీ విద్యాసాగర్‌ నాయుడు కలిసిన వైఎస్‌ సునీత వర్రా రవీదంరరెడ్డి పెట్టిన అసభ్యకర పోస్టుల గురించి కూడా చర్చించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని ఆమె కోరారు.
ఇదివరకు వర్రా రవీందర్‌రెడ్డి ఇచ్చిన వాంగ్మూలం మేరకు కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి పీఏ రాఘవరెడ్డి పేరును వెల్లడించడంతో రాఘవరెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. డిసెంబరులో కడప సైబర్‌ క్రైమ్‌ పోలీసు స్టేషన్‌లో విచారణకు హాజరయ్యాడు. సైబర్‌ క్రైమ్‌ డీఎస్పీ మురళీనాయక్‌ ఆధ్వర్యంలో రాఘవరెడ్డిని విచారించారు. నాలుగు రోజుల పాటు జరిగిన విచారణలో ఎంపీ అవినాష్‌రెడ్డి పీఏ రాఘవరెడ్డి పొంతనలేని సమాధానాలు చెప్పాడు, పోలీసులు అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పకుండా దాటవేత ధోరణితో వ్యవహరించాడరని పోలీసు వర్గాల్లో చర్చ ఉంది. తాజాగా వర్రా రవీందరరెడ్డిని పోలీసులు కస్టడీలోకి తీసుకోవడం కడప జిల్లాలో హాట్‌ టాపిక్‌గా మారింది. విచారణలో వర్రా ఎవరి పేర్లు చెబుతాడో అని ఉత్కంఠ నెలకొంది.
Tags:    

Similar News