సూపర్‌–6పై మండలిలో మాటల యుద్ధం

ఆంధ్రప్రదేశ్‌ శాసన మండలిలో సూపర్‌ సిక్స్‌పై వాడీవేడి చర్చ జరిగింది. అచ్చెన్న, బొత్స మధ్య మాటల యుద్ధం నెలకొంది.

Update: 2025-09-26 10:07 GMT

ఆంధ్రప్రదేశ్‌ శాసన మండలిలో సూపర్‌ సిక్స్‌ హామీల అమలుపై శుక్రవారం తీవ్ర చర్చ జరిగింది. ఈ చర్చలో మంత్రి అచ్చెన్నాయుడు, విపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ మధ్య మాటల యుద్ధం నడిచింది. సూపర్‌ సిక్స్‌ పథకాలు ప్రజలకు సంతోషాన్ని అందించాయని, ఇవి ‘సూపర్‌ డూపర్‌ హిట్‌‘ అయ్యాయని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొనగా, విపక్ష నేత బొత్స ఈ హామీల అమలులో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.

సూపర్‌ సిక్స్‌: సూపర్‌ హిట్‌ కాదు, సూపర్‌ డూపర్‌ హిట్‌
మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, ‘మేమిచ్చిన సూపర్‌ సిక్స్‌ హామీలన్నీ అమలు చేశాం. ఇవి సూపర్‌ హిట్‌ కాదు, సూపర్‌ డూపర్‌ హిట్‌ అయ్యాయి. రెండు జెడ్పీటీసీ ఎన్నికల్లో ప్రజలు వైసీపీకి డిపాజిట్లు కూడా రాకుండా చేశారు. సూపర్‌ సిక్స్‌ పథకాలతో ప్రజలు సంతోషంగా ఉన్నారని ఈ ఫలితాలే నిదర్శనం,‘ అని వ్యాఖ్యానించారు. ఆయన రాష్ట్రంలో అన్న క్యాంటీన్లను తిరిగి ప్రారంభించి పేదల ఆకలి తీర్చినట్లు తెలిపారు. అలాగే, అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులకు రాష్ట్రం నుంచి 14,000 రూపాయలు, కేంద్రం నుంచి 6,000 రూపాయలు ఆర్థిక సాయం అందిస్తున్నామని, 3 లక్షల మంది కౌలు రైతులకు కూడా ఈ సాయం అందిస్తామని స్పష్టం చేశారు.
వైసీపీ ఆరోపణలు, అచ్చెన్న ధీటైన సమాధానం
వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి సూపర్‌ సిక్స్‌ హామీల అమలులో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ‘16 రకాల బస్సులుండగా కేవలం 5 కేటగిరీ బస్సుల్లోనే ఉచిత బస్సు ప్రయాణం అమలు చేశారు. తొలి ఏడాదిలో రెండు ఉచిత గ్యాస్‌ సిలిండర్ల హామీని ఎగ్గొట్టారు. ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి హామీలు కూడా నెరవేర్చలేదు,‘ అని ఆమె విమర్శించారు.
దీనికి సమాధానంగా మంత్రి అచ్చెన్నాయుడు, వైసీపీ పాలనలో 5 ఏళ్ల పాటు రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం çసృష్టించారని, రూ. 9.5 లక్షల కోట్ల అప్పులతో రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టారని విమర్శించారు. ‘అప్పులు చేసినందున కూటమి ప్రభుత్వం హామీలు నెరవేర్చలేదని వైసీపీ ఆశించింది. కానీ, ఆర్థిక ఇబ్బందులను అధిగమించి సూపర్‌ సిక్స్‌ హామీలను నెరవేర్చామని‘ ఆయన స్పష్టం చేశారు. చంద్రబాబు లాంటి నాయకుడు సీఎంగా ఉండటం రాష్ట్ర ప్రజల అదృష్టమని పేర్కొన్నారు.
కుప్పం ఎన్నికలపై మాటల తూటాలు
బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ, ‘గతంలో కుప్పం మున్సిపాలిటీ ఎన్నికల్లో వైసీపీ గెలిచింది,‘ అని అన్నారు. దీనికి అచ్చెన్నాయుడు ఘాటుగా స్పందిస్తూ, ‘కుప్పం ఎన్నికల్లో నామినేషన్లు వేయకుండా చేశారు. నామినేషన్‌ పేజీలను చించి ప్రజాస్వామ్యాన్ని అణిచివేశారు. ఇటీవల జెడ్పీటీసీ ఎన్నికల్లో 11 మంది నామినేషన్లు వేసి, అన్ని పార్టీలు పోటీ చేసిన ప్రజాస్వామ్య ఎన్నికల్లో మేము గెలిచాము,‘ అని తెలిపారు.
ఉద్యోగాలపై వివాదం
బొత్స సత్యనారాయణ, కూటమి ప్రభుత్వం డీఎస్సీలో కేవలం 16,000 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చిందని, వైసీపీ హయాంలో 1.5 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని ఆరోపించారు. దీనికి అచ్చెన్నాయుడు సమాధానంగా, ‘వైసీపీ హయాంలో వైసీపీ కార్యకర్తలకు వాలంటీర్‌ ఉద్యోగాలు ఇచ్చారు. అధికారంలో ఉండగానే ఆ ఉద్యోగాలను తీసేశారు,‘ అని విమర్శించారు.
సూపర్‌ సిక్స్‌ హామీల అమలుపై శాసన మండలిలో జరిగిన చర్చలు రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి కూటమి, విపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదానికి దారితీశాయి. కూటమి ప్రభుత్వం తమ హామీలను నెరవేర్చి ప్రజలకు మేలు చేస్తోందని మంత్రి అచ్చెన్నాయుడు ఉద్ఘాటించగా, వైసీపీ సభ్యులు ఈ హామీల అమలులో లోటుపాట్లను ఎత్తిచూపారు. ఈ చర్చలు రాష్ట్ర రాజకీయాల్లో మరింత ఆసక్తిని రేకెత్తించాయి.
Tags:    

Similar News