సీఎం చంద్రబాబు క్షమాపణలు చెప్పాలి
శాసన మండలిలో వైసీపీ ఆందోళన చేపట్టింది. ఛైర్మన్ అవమానంపై మండిన బొత్స సత్యనారాయణ సీఎం చంద్రబాబు క్షమాపణలు డిమాండ్ చేశారు.
By : The Federal
Update: 2025-09-26 11:37 GMT
ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో గందరగోళ పరిస్థితి నెలకొంది. మండలి ఛైర్మన్ కొయ్యే మోషేన్ రాజును అవమాన పరుస్తున్నారంటూ వైసీపీ ఎమ్మెల్సీలు ఆందోళనకు దిగారు. ‘వి వాంట్ జస్టిస్‘ అంటూ పోడియం ముందుకు వెళ్లి నిరసన తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు క్షమాపణలు చెప్పాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా విపక్ష నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ, మండలి ఛైర్మన్‌ను తరచూ అగౌరవ పరుస్తున్నారని మండిపడ్డారు.
బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ, అసెంబ్లీ ప్రాంగణంలో క్యాంటీన్ భవనం ప్రారంభోత్సవంలో మండలి ఛైర్మన్ పేరు పెట్టలేదని విమర్శించారు. ప్రారంభోత్సవానికి రావాలని మండలి ఛైర్మన్‌ను కనీసం పిలువలేదన్నారు. ఇక్కడ వ్యవస్థ ముఖ్యమని, వ్యక్తులు ముఖ్యం కాదని పేర్కొన్నారు. అలాగే, తిరుపతిలో జరిగిన మహిళా సదస్సుకు కూడా మండలి ఛైర్మన్‌కు ఆహ్వానం లేదన్నారు. సభా నాయకుడైన సీఎం సభకు వచ్చి జరిగిన పరిణామాలపై సమాధానం చెప్పాలని బొత్స డిమాండ్ చేశారు.
ఈ చర్చపై మండలి ఛైర్మన్ కొయ్యే మోషేన్ రాజు అభ్యంతరం తెలిపారు. తాను ఛైర్మన్ సీట్లో ఉండగా, తనపై చర్చ జరపడం ఇష్టం లేదన్నారు. ఛైర్మన్ స్థానంలో ప్యానల్ స్పీకర్‌ను కూర్చోబెడతానని, అప్పుడు మాట్లాడాలని ఆయన అన్నారు. వైసీపీ ఎమ్మెల్సీల ఆందోళనతో ఈ అంశంపై మంత్రి అచ్చెన్నాయుడు స్పందించారు. చట్ట సభలపై తమకు అపార గౌరవం ఉందన్నారు. మండలి ఛైర్మన్‌ను అవమానించారనడం సరైంది కాదన్నారు. ఆహ్వాన పత్రికలో మండలి ఛైర్మన్ పేరు లేకపోవడానికి కారణాలు తెలుసుకుంటామని చెప్పారు. సభలో జరిగే అంశాలకు సీఎం చంద్రబాబుకు సంబంధం లేదని స్పష్టం చేశారు మంత్రి అచ్చెన్నాయుడు.
అయితే సభలో వైసీపీ ఎమ్మెల్సీలు తమ ఆందోళనను కొనసాగించడంతో ఛైర్మన్ సభను కాసేపు వాయిదా వేశారు. ఈ ఘటన రాష్ట్ర శాసన సభల్లో కూటమి ప్రభుత్వం, విపక్ష వైసీపీ మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచింది. గతంలో కూడా ఇలాంటి అవమానాలపై వైసీపీ నేతలు ఆందోళనలు వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి.