మిస్ వరల్డ్ పోటీలపై యుద్ధమేఘాలు
హఠాత్తుగా మొదలైన ఇండియా-పాకిస్ధాన్ యుద్ధం మిస్ వరల్డ్-2025 నిర్వహణపై తీవ్ర ప్రభావం చూపేట్లుంది;
హఠాత్తుగా మొదలైన ఇండియా-పాకిస్ధాన్ యుద్ధం మిస్ వరల్డ్-2025 నిర్వహణపై తీవ్ర ప్రభావం చూపేట్లుంది. ఈనెల 7వ తేదీనుండి ప్రపంచమొత్తం నుండి సుమారు 150 దేశాల నుండి అందగత్తెలు హైదరాబాదుకు వస్తున్నారు. జూన్ 2వ తేదీన మిస్ వరల్డ్ 2025 పోటీ(MISS World-2025) జరుగుతుంది. ఇప్పటికే బ్రెజిల్, పోర్చుగల్, స్పెయిన్, థాయ్ ల్యాండ్ లాంటి దేశాలనుండి అందగత్తెలు వచ్చేశారు. ఇంకా చాలా దేశాల నుండి అందగత్తెలు రావాల్సుంది. పోటీల నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం అవసరమైన అన్నీ ఏర్పాట్లను చేసేసింది. అయితే సడెన్ గా గురువారం రాత్రినుండి పాకిస్ధాన్(Pakistan) వైపునుండి దాడులు మొదలయ్యాయి. ఇండియా కూడా స్వీయరక్షణకు ఎదురుదాడులు చేయకతప్పలేదు. దాంతో రెండు దేశాల మధ్య భీకరమైన యుద్ధం(India-Pakistan War) మొదలైపోయింది.
దేశంలోని చాలా నగరాల్లో కేంద్రప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. హై అలర్టులో భాగంగా వివిధ నగరాల్లోని ప్రభుత్వాలను కేంద్రం అప్రమత్తంచేసింది. కేంద్రం అప్రమత్తంచేసిన నగరాల్లో హైదరాబాద్(Hyderabad) కూడా ఉంది. ఇందులో భాగంగానే తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి(Revanth) కూడా గడచిన రెండురోజులుగా వివిధ శాఖల ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశాలు నిర్వహించారు. యుద్ధం నేపధ్యంలో ప్రజలను అప్రమత్తంచేయటంలో భాగంగా నగరంలోని చాలా ప్రాంతాల్లో మాక్ డ్రిల్ కూడా జరిగింది. చాలా విమానాశ్రయాలను కేంద్రం మూసేసింది. మామూలు ప్రయాణీకులు ఎంతో అవసరమైతే తప్ప ప్రయాణాలను పెట్టుకోవద్దని పదేపదే విజ్ఞప్తిచేస్తోంది. ఇపుడు విషయం ఏమిటంటే హైదరాబాద్ కేంద్రంగా దాదాపు మూడువారాలు జరగబోయే మిస్ వరల్డ్-2025 పోటీలు జరుగుతాయా అనే సందేహాలు మొదలయ్యాయి. యుద్ధంగనుక మరింత తీవ్రమైతే దాని ప్రభావం దేశమంతా తీవ్రంగా ఉంటుంది.
ఒకవైపు యుద్ధం జరుగుతుంటే మరోవైపు అందాలపోటీలు జరపటం ఎంతమాత్రం క్షేమకరం కాదని రేవంత్ ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు ప్రభుత్వవర్గాలు చెప్పాయి. వివిధ కారణాలతో ఉగ్రవాద లింకులు హైదరాబాదులో కనబడుతున్న విషయం తెలిసిందే. దేశంలో ఎక్కడ ఉగ్రవాద దాదులు జరిగినా దాని మూలాలు హైదరాబాదులో కనబడతాయి. గతంలో జరిగిన టెర్రర్ ఎటాక్(Terror Attack) కు సంబంధించి కేంద్రదర్యాప్తుసంస్ధలు హైదరాబాదులోని ఓల్డ్ సిటీలో దాడులుచేసి సంబంధించిన వారిని అరెస్టులు చేసిన ఘటనలు చాలా ఉన్నాయి. అందుకనే అందాల పోటీల నిర్వహణ ఎంతమాత్రం క్షేమకరం కాదని ప్రభుత్వం అనుమానిస్తోంది. తెలంగాణలోని భూదాన్ పోచంపల్లి, రామప్పదేవాలయం, నగరంలోని చార్మినార్, చౌమహల్లా ప్యాలెస్ లాంటి సున్నితమైన ప్రాంతాల్లో సుందరీమణలు పర్యటిస్తున్నారు. వీళ్ళ పర్యటనల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ప్రపంచసుందరీమణలకు ఏమైనా జరిగితే ప్రపంచంముందు దేశం పరువుపోవటం ఖాయం.
ఇలాంటి అనేక సమస్యలను దృష్టిలో పెట్టుకుని అందాల పోటీల నిర్వహణపై రేవంత్ ప్రభుత్వం తగిన సూచనలు చేయాల్సిందిగా కేంద్రప్రభుత్వాన్ని కోరినట్లు ప్రభుత్వవర్గాలు చెప్పాయి. మరి కేంద్రం ఏమంటుందో చూడాల్సిందే.