వాల్తేరు డీఆర్ఎంగా లలిత్ బోహ్రా
బోహ్రాకు ట్రాఫిక్ కమర్షియల్, పాలసీ ఫార్ములేషన్‌లో విశేషమైన అనుభవం ఉంది.;
వాల్తేరు డివిజనల్ రైల్వే మేనేజర్ (డీఆర్ ఎం)గా లలిత్ బోహ్రా నియమితులయ్యారు. ఈయన 1998 బ్యాచ్ ఐఆర్‌టీఎస్ అధికారి. బోహ్రాకు ట్రాఫిక్ కమర్షియల్, పాలసీ ఫార్ములేషన్‌లో విశేషమైన అనుభవం ఉంది. ఇంతకుముందు ఈయన భారత ప్రభుత్వ నూతన, పునరుత్పాదక ఇంధన మంత్రిత్వశాఖ (ఎంఎన్ఆర్ఈ)లో సంయుక్త కార్యదర్శిగా పనిచేశారు. ఆ సమయంలో ఆయన పీఎం సూర్య ఘర్, మఫ్ట్ బిజిలీ యోజన, పీఎం కుసుమ్, ఆఫ్‌షోర్ విండ్, గ్రీన్ ఎనర్జీ కారిడార్లు, సోలార్ తయారీకి పీఎల్ ఐ సీమ్‌తో సహా పవన శక్తి విధానాన్ని రూపొందించడంలో కీలక పాత్ర పోషించారు. ఇంకా నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోలార్ ఎనర్జీ డైరెక్టర్ జనరల్‌గానూ విధులు నిర్వహించారు. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, సోలార్ ఎనర్జీ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ డైరెక్టర్ బోర్డులోనూ ఉన్నారు. అంతేకాదు.. బోహ్రా రైల్వే చీఫ్ కమర్షియల్ మేనేజర్‌గా, చీఫ్ ప్యాసింజర్ ట్రాన్స్‌పోర్టేషన్ మేనేజర్‌గా, చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్‌గా, డిప్యూటీ జనరల్ మేనేజర్ (జనరల్)గా పనిచేశారు. అలాగే కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో చీఫ్ జనరల్ మేనేజర్‌గా కూడా ఉన్నారు. అతిపెద్ద డ్రై పోర్ట్‌ను అంటే ఖటువాస్ టెర్మినల్‌గా డబుల్ స్టాక్ కంటైనర్ రైళ్లను నడపడంలో కీలక పాత్ర పోషించారు. ఈయన ఐఐటీ బొంబాయి నుంచి బీటెక్ లో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ , బిట్స్ పిలానీ నుంచి (ఫైనాన్స్) పూర్తి చేశారు.
సీబీఐకి చిక్కిన గత డీఆర్ ఎం..
మునుపటి వాల్తేరు డీఆర్ఎం సౌరబ్ ప్రసాద్ గత ఏడాది నవంబరు 17న ముంబయిలో ఓ కాంట్రాక్టరు నుంచి లంచం తీసుకుంటూ సీబీఐ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. అనంతరం ఆయన స్థానంలో గత డిసెంబర్ 26న లలిత్ బోహ్రాను వాల్తేరు డీఆర్ ఎంగా నియమించారు. అయితే ఆయన డీఆర్ ఎంగా బాధ్యతలు చేపట్టలేదు. దీంతో ఈలోగా అదనపు డీఆర్ ఎంగా పనిచేస్తున్న ఎంకే సాహుకి ఇన్‌చార్జి డీఆర్ఎంగా అదనపు బాధ్యతలు అప్పగించారు. దాదాపు రెండు నెలల అనంతరం ఇప్పుడు గతంలో పూర్తి స్థాయి డీఆర్ ఎంగా నియమితులైన లలిత్ బోహ్రా సోమవారం విశాఖపట్నంలోని డీఆర్ఎం కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు.
విశాఖపట్నం డివిజన్‌గా మార్చాక..
విశాఖపట్నం కేంద్రంగా సౌత్ కోస్టల్ రైల్వే జోన్ కార్యరూపం దాలుస్తోంది. ఇందులోభాగంగా వాల్తేరు డివిజన్ పేరును విశాఖపట్నం గా ఇటీవలే మార్పు చేశారు. సౌత్ కోస్టల్ రైల్వే జోన్ ఇంకా ప్రారంభం కాలేదు. కొత్త జోన్ కార్యకలాపాలు మొదలైతే వాల్తేరు డివిజన్ .. విశాఖపట్నంగా మారుతుంది.