వింటర్‌కు యమా డిమాండ్.. సంక్రాంతి వరకు అంతా ఫుల్

నెలల ముందే బుక్ చేసుకున్న పర్యాటకులు. ఈ సీజనులో విశాఖకు రెండు కోట్ల మంది వరకు వస్తారని అంచనా..

Update: 2024-11-02 05:53 GMT


 



పర్యాటక ప్రియులు ఎండాకాలంలో ఊటీకి వెళ్లాలని ఎంత తపించిపోతారో.. శీతాకాలంలో వైజాగ్కు రావాలని అంతగా తహతహలాడిపోతారు. ఉమ్మడి విశాఖ జిల్లాలోని అందాలను ఆస్వాదించడానికి నాలుగైదు నెలల ముందే ప్లాన్ వేసుకుంటారు. కుటుంబాలతో సహా వచ్చే వారు కొందరైతే, స్నేహితులతో కట్టగట్టుకుని వచ్చే వారు మరికొందరు. ఇలా వచ్చే పర్యాటకులతో వింటర్ సీజనులో ఈ ప్రాంతాలు సందడి సందడిగా మారిపోతాయి. ఏ పర్యాటక ప్రాంతం చూసినా వీరితో కిక్కిరిసిపోయి కనిపిస్తుంటాయి. గతంకంటే ఈ ఏడాది ఈ శీతాకాలం సీజను పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. పర్యాటక శాఖకు చెందిన హోటళ్లు, అతిథి గృహాల్లోను, ప్రైవేటు హోటళ్లలోని రూమ్లను పెద్ద సంఖ్యలో ముందుగానే బుక్ చేసుకున్నారు. దీంతో ఈ సీజనులో 90 శాతానికి పైగా గదులు రెండు నెలల ముందే అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్నారంటే పరిస్థితి

 

అర్థం చేసుకోవచ్చు!

విశాఖ నగరంలోని సుందర ప్రదేశాలతో పాటు అల్లూరి సీతారామరాజు (ఏఎస్సార్) జిల్లాలోని అందాల అరకు, ఆకాశాన్ని తాకేలాంటి కాఫీ తోటల పాడేరు, జీరో డిగ్రీల లంబసింగి, దేవతల స్వర్గాన్ని తలపించే వంజంగి మేఘాలు, బొర్రాగుహలు, కొండలపై నుంచి కిందకు దూకే జలపాతాలు ఇలా ప్రఖ్యాత పర్యాటక ప్రాంతాలు రా రమ్మని ఆహ్వానిస్తుంటాయి. తమ సహజ సౌందర్యంతో పర్యాటకులను సమ్మోహితులను చేస్తుంటాయి.

విశాఖ సాగరతీరంలోని ఆర్కే బీచ్, రుషికొండ, లాసన్స్బ, సాగర్ నగర్, యారాడ, భీమిలి తదితర బీచ్లు పర్యాటకుల మదిని దోచుకుంటాయి. ఇంకా కురుసుర సబ్మెరైన్ మ్యూజియం, టీయూ-142 యుద్ధ విమాన మ్యూజియం, విశాఖ మ్యూజియం వంటివి ప్రత్యేక ఆకర్షణలుగా నిలుస్తున్నాయి. అంతేకాదు.. ప్రపంచంలోనే అత్యంత అరుదైన, పురాతన బౌద్ధారామాలు ఇక్కడ ఉన్నాయి. బొజ్జన్న కొండ, తొట్లకొండ, బావికొండ, పావురాల కొండలు సందర్శకులను ఆకర్షిస్తుంటాయి. ఇంకా కైలాసగిరి రోప్వేతో పాటు సింహాచలం పుణ్యక్షేత్రం వంటివి పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి.

 

సహకరించే సీజన్..

సాధారణంగా శీతాకాలం అంటే ఎముకలు కొరికే చలి ఉంటుంది. ఉత్తరాదిలో అయితే దీని ప్రభావం మరింత అధికం. అయితే ఇతర దేశాలు, రాష్ట్రాలకంటే విశాఖలో ఈ సీజనులో ఎంతో అనుకూలమైన వాతావరణం ఉంటుంది. అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు విశాఖ నగరంలో పగటి పూట 28, రాత్రి వేళ 18 డిగ్రీల సగటు ఉష్ణోగ్రత నమోదవుతుంది. ఇది ఇతర ప్రాంతాల నుంచి వచ్చే సందర్శకలు/పర్యాటకులకు ఆహ్లాదాన్ని పంచుతుంది. అందుకే ఈ సీజనులో ఎక్కడెక్కడ నుంచో ఇక్కడకు వస్తుంటారు.




 


ఇక విశాఖలో వాతావరణం ఇలా ఉంటే.. అల్లూరి సీతారామరాజు జిల్లాలో మాత్రం అందుకు భిన్నంగా ఉంటుంది. విశాఖలో డిసెంబర్, జనవరి నెలల్లో ఉష్ణోగ్రతలు రాత్రి వేళ 18 డిగ్రీలు రికార్డయితే.. అక్కడకు 120 కి.మీల దూరంలో ఉన్న లంబసింగిలో జీరో డిగ్రీలకు పడిపోయి కశ్మీరు తలపిస్తుంది. ఉమ్మడి విశాఖ ఏజెన్సీలోని కొండ కోనల నుంచి జాలువారే జలపాతాలు, పచ్చని పర్వత శ్రేణులు, వాటిపై పరచుకున్న మేఘమాలలు, మంచు తెరల సోయగాలు.. ఇలా ఒకటేమిటి? లెక్కకు మిక్కిలి సౌందర్య రాశులు పర్యాటకులను పిచ్చెక్కిస్తుంటాయి. అందుకే ఇక్కడి ప్రకృతి రమణీయతకు ఫిదా అవుతుంటారు.

 

హోటల్ రూమ్లు హౌస్ ఫుల్..

సాధారణంగా అక్టోబర్ రెండో వారం నుంచే ఈ ప్రాంతానికి పర్యాటక/వింటర్ సీజను ఆరంభమవుతుంది. ఫిబ్రవరి వరకు కొనసాగుతుంది. తెలుగు రాష్ట్రాల నుంచే కాదు.. దేశ విదేశాల నుంచి సందర్శకులు పోటెత్తుతుంటారు. ఏటా ఈ వింటర్ సీజనులో సగటున కోటిన్నర మందికి పైగా పర్యాటకులు వస్తుంటారు. ఈ ఏడాది ఆ సంఖ్య మరింత పెరగవచ్చని అంచనా వేస్తున్నారు. విశాఖకు ఏటా కోటిన్నర మంది పర్యాటకులు వస్తుంటారు. గత సంవత్సరం (2023) 1,78,78,495 మంది వచ్చారు. ఈ ఏడాది సెప్టెంబర్ ఆఖరు వరకు 1,48,48,174 మంది పర్యటించారు. పర్యాటక సీజను ఈ మూడు నెలల్లో మరో 50 లక్షల మంది వస్తారని, దీంతో ఈ ఏడాది వీరి సంఖ్య రెండు కోట్లకు చేరుతుందని అంచనా. పర్యాటక శాఖ విశాఖ డివిజన్ పరిధిలోని విశాఖపట్నం, శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో వివిధ హోటళ్లు/ అతిథి గృహాల్లో 187 ఏసీ, 70 నాన్ ఏసీ గదులు వెరసి 257 గదులున్నాయి.

 

' ఇప్పటికే వీటిలో 90 శాతానికి పైగా గదులు అడ్వాన్స్ బుకింగ్లు జరిగిపోయాయి' అని ఆంధ్రప్రదేశ్ పర్యాటకాభివృద్ధి సంస్థ రీజనల్ డైరెక్టర్ శ్రీనివాస్ పాణి 'ద ఫెడరల్ ఆంధ్రప్రదేశ్' ప్రతినిధికి చెప్పారు. ఇవి కాకుండా అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అరకు, అనంతగిరి, పాడేరు, రంపచోడవరం, రాజవొమ్మంగి ప్రాంతాల్లో ప్రైవేటు రంగంలో గదులు, టెంట్లు ఆరు వేల దాకా ఉన్నాయి. విశాఖపట్నం నగరంలో 24 స్టార్ హోటళ్లలో 2,056 గదులు, 124 నాన్ స్టార్ హోటళ్లలో 3,626 రూమ్లు ఉన్నాయి. వీటిలో 95 శాతం మేర గదులు ఇప్పటికే బుక్ అయిపోయాయి. దీంతో ఈ సీజనులో వివిధ ప్రాంతాల నుంచి విశాఖకు పర్యాటకం నిమిత్తం రావాలనుకునే వారికి హోటళ్లలో వచ్చే సంక్రాంతి వరకు రూమ్లు దొరకని పరిస్థితి ఏర్పడింది. 

Tags:    

Similar News