1053 మంది వ‌ద్దు.. 87 మందే ముద్దు!

వీఆర్ఎస్‌పై తేల్చిన క‌మిటీ. ప‌ద‌వీ విర‌మ‌ణ‌కు 1613 మంది ద‌ర‌ఖాస్తు. తీర్చేదాకా సెటిల్మెంటు చేయొద్దంటున్న బ్యాంకులు. ఇర‌కాటంలో ఉక్కు వీఆర్‌ఎస్ కార్మికులు.;

Update: 2025-02-21 01:30 GMT

సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో కార్మికుల స్వ‌చ్ఛంద ప‌ద‌వీ విర‌మ‌ణ (వీఆర్ ఎస్‌) వ్య‌వ‌హారం మ‌లుపులు మీద మ‌లుపులు తిరుగుతోంది. ప్ర‌యివేటీక‌ర‌ణ ప్ర‌క‌ట‌న వెలువ‌డిన‌ప్ప‌ట్నుంచి ఈ ప్లాంటు కార్మికుల్లో అల‌జ‌డి రేగుతూనే ఉంది. ఒక ప‌క్క ప్ర‌యివేటీక‌ర‌ణ భూతం, మ‌రోప‌క్క అప్పులు, న‌ష్టాల్లో కూరుకుపోయింది. యాజ‌మాన్యం గ‌త ఏడాది సెప్టెంబ‌ర్ నుంచి స‌రిగా జీతాలే ఇవ్వ‌లేక‌పోతోంది. దీంతో ఈ కార్మికులు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయారు. ఈ స్టీల్ ప్లాంట్ ప్ర‌యివేటీక‌ర‌ణను ఆపివేయాల‌ని ఉక్కు కార్మికులు నాలుగేళ్ల నుంచి అలుపెరుగ‌ని ఒంట‌రి పోరాటాన్ని సాగిస్తున్నారు.

అయితే కేంద్రం ప్ర‌యివేటీక‌ర‌ణ నిర్ణ‌యాన్ని ఉప‌సంహ‌రించు కోలేదు. పైగా ఈ ప్లాంటులో ఖాళీల‌ను భ‌ర్తీ చేయ‌డం లేదు. ఉన్న ఉద్యోగుల‌నే ఇత‌ర స్టీల్ ప్లాంటుల‌కు డెప్యుటేష‌న్‌పై పంపేయాల‌ని చూస్తున్నారు. ఇలా 22 వేల మంది ప‌ని చేసే ఈ క‌ర్మాగారంలో ప్ర‌స్తుతం 12 వేల మందికి త‌గ్గిపోయారు. దీంతో ప‌ది మంది చేయా ల్సిన ప‌ని ఐదారుగురు మాత్ర‌మే చేయాల్సి వస్తోంది. ఇంత‌లో కేంద్ర ప్ర‌భుత్వం ఈ స్టీల్ ప్లాంటుకు రూ..11,440 కోట్ల పున‌రుజ్జీవ‌న ప్యాకేజీని ప్ర‌క‌టించింది.

అదే స‌మ‌యంలో వీఆర్ ఎస్‌కు గేట్లు తెరిచింది. కొన్నాళ్లుగా ప్లాంటులో నెల‌కొన్న ప‌రిణామాల నేప‌థ్యంలో ఉక్కు కార్మికులకు త‌మ భ‌విష్య‌త్తుపై ఆశ‌లు స‌న్న‌గిల్లాయి. నెల‌ల త‌ర‌బ‌డి జీతాలు లేక‌, ప్లాంటు మ‌నుగ‌డ ఎలా ఉంటుందో తెలియ‌క‌, ప్ర‌యివేటీక‌ర‌ణ ఆగుతుందో ఆగ‌దో తెలియ‌క అయోమ‌యంలో ఉన్నారు.

దీంతో వైజాగ్ స్టీల్ ప్లాంటులో కొన‌సాగే కంటే వీఆర్ ఎస్ తీసుకోవడ‌మే మేల‌న్న నిర్ణ‌యానికొచ్చారు కార్మికులు. ఒక‌ప‌క్క వీఆర్‌కు ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానం ప‌లుకుతూ, మ‌రోప‌క్క పున‌రుజ్జీవ‌న ప్యాకేజీని వ్యూహాత్మ‌కంగా ప్ర‌క‌టించింది. అయిన‌ప్ప‌టికీ ఆశ‌లు చిగురించ‌ని కార్మికులు వెన‌క్కి త‌గ్గ‌లేదు. వీఆర్ ఎస్‌కే 15 శాతం మంది మొగ్గు చూపారు. జ‌న‌వ‌రి 15 నుంచి 31 వ‌ర‌కు వీఆర్ ఎస్ కోసం ఆస‌క్తి ఉన్న వారు ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని యాజ‌మాన్యం ఆహ్వానం ప‌లికింది. దీంతో 1,613 మంది వీఆర్ ఎస్‌కు ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు.

1,140 మందిని అర్హులుగా తేల్చిన క‌మిటీ..

ఇలా వీఆర్ ఎస్ కోసం ద‌ర‌ఖాస్తు చేసుకున్న 1,613 మందిలో 1,140 మంది అర్హులుగా దీనిపై నియ‌మించిన క‌మిటీ తేల్చింది. 386 మంది వీఆర్ ఎస్‌కు అన‌ర్హులుగా పేర్కొంది. మ‌రో 87 మంది ఉద్యోగులు అర్హులే అయినా వీరి సేవ‌లు త‌మ‌కు అవ‌స‌ర‌మ‌ని సంబంధిత విభాగాల ఉన్న‌తాధికారులు యాజ‌మాన్యానికి సూచించారు. దీంతో వీరి వీఆర్ ఎస్ ద‌ర‌ఖాస్తులు పెండింగులో ప‌డ్డాయి. ఈ 87 మందిలో కుటుంబ ప‌ర‌మైన ఇబ్బందులున్న వారి మిన‌హా మిగిలిన వారి వీఆర్ ఎస్‌ల‌ను తిర‌స్క‌రించే వీలుంటుంది. అందువ‌ల్ల తిర‌స్క‌ర‌ణ‌కు గురైన వారు య‌ధావిధిగా ప్లాంటులో కొన‌సాగే అవ‌కాశం ఉంది.

ష‌ర‌తుల‌తో వీఆర్ ఎస్‌..

మ‌రోవైపు వీఆర్ ఎస్‌కు ఆమోదం ల‌భించిన కార్మికులు/ఉద‌్యోగులకు యాజ‌మాన్యం కొన్ని ష‌ర‌తులు విధించింది. సెటిల్మెంట్ జ‌రిగే లోపు నెల‌కు నాలుగు రోజుల‌కంటే ఎక్కువ సెల‌వులు పెట్ట‌రాద‌ని, ఒక‌వేళ పెడితే జీతంలో కోత విధిస్తామ‌ని స్ప‌ష్టం చేసింది. త‌ప్ప‌నిస‌రి అయితే డైరెక్ట‌ర్ అనుమ‌తి తీసుకోవాలంది. కాగా వీఆర్ ఎస్ తీసుకునే కార్మికుల సెటిల్మెంటు కోసం కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ రూ.500 కోట్ల‌ను ఇదివ‌ర‌కే బ్యాంకుల్లో డిపాజిట్ చేసింది. వీఆర్ ఎస్‌కు అర్హులైన వారికి వారి స‌ర్వీసు, ఇంకా మిగిలి ఉన్న స‌ర్వీసును ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటారు. ఆ ప్ర‌కారం ఒక్కొక్క‌రికి రూ.10 ల‌క్ష‌ల నుంచి 50 ల‌క్ష‌ల వ‌ర‌కు ల‌భించే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది.

ఇర‌కాటంలో వీఆర్ ఎస్ కార్మికులు..

వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో వీఆర్ ఎస్‌కు అర్హ‌త పొందిన కార్మికుల‌కు ఊహించ‌ని ప‌రిణామం ఎదురైంది. ఇప్ప‌టికే ఈ ప్లాంటు ఉద్యోగులు/ కార్మికులు త‌మ అవ‌స‌రాల నిమిత్తం బ్యాంకుల నుంచి, ఇత‌ర సంస్థ‌ల నుంచి రుణాలు తీసుకున్నారు. ఆ బాకీల నెల‌స‌రి వాయిదాల‌ను (ఈఎంఐల‌ను) వారి జీతాల నుంచి ఆయా సంస్థ‌లు నెల‌నెలా తీసుకుంటున్నాయి. అయితే వీరు వీఆర్ ఎస్ తీసుకుంటే వారి జీతాల నుంచి వ‌సూలు చేసుకునే వీలు లేకుండా పోతుంది. దీంతో అప్ర‌మ‌త్త‌మ‌యిన సంబంధిత రుణ సంస్థ‌లు, బ్యాంకుల అధికారులు త‌మ అప్పు తీరాకే వీఆర్ ఎస్ సెటిల్మెంట్లు చేయాల‌ని ఉక్కు యాజ‌మాన్యానికి కోర్టుల ద్వారా నోటీసులు పంపుతు్న్నాయి. ఈ ప‌రిణామ‌లు వీఆర్ ఎస్‌కు ద‌ర‌ఖాస్తు చేసుకున్న వారికి మింగుడు ప‌డ‌డం లేదు.

Tags:    

Similar News