రాయలసీమ సాగునీటి సాధన సమితి, ప్రజా సంఘాల ఆద్వర్యంలో మంగళవారం బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ కాంప్లెక్స్ సందర్శన చేపట్టినట్లు రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశరథరామిరెడ్డి పేర్కొన్నారు. శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ఉన్న రోజులలో రోజుకు 4 టిఎంసీ ల కృష్ణా జలాలను తీసుకునే విధంగా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులెటర్ సామర్థ్యాన్ని 44,000 క్యూసెక్కులకు పెంచారు. ఈ నీటిని రాయలసీమ ప్రాజెక్టులైన ఎస్‌ఆర్‌బీసీ, తెలుగుగంగ, గాలేరునగరి మద్రాసు త్రాగు నీరు అందించే కాలువలకు నీటిని మళ్లించే నిర్మాణమే బానకచర్ల క్రాస్ రెగ్యులేటర్ కాంప్లెక్స్ అనీ.. ఈ బానకచర్ల క్రాస్ రెగ్యులెటర్ కాంప్లెక్స్ నుండి పై ప్రాజెక్టుల ద్వారా నీరందించడానికి గోరుకల్లు, ఔక్, గండికోట, వామికొండ, సర్వరాయసాగర్, మైలవరం, చిత్రావతి, పైడిపాలెం, వెలుగోడు, బ్రహ్మసాగర్ రిజర్వాయర్లు సుమారు120 టీఎంసీల సామర్థ్యం నిర్మాణాలు జరిగాయని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశరథరామిరెడ్డి తెలిపారు. సోమవారం నంద్యాల సమితి కార్యాలయంలో బొజ్జా మాట్లాడుతూ..
శ్రీశైలం ప్రాజెక్టుకు సాధారణంగా వరద 30 రోజులకు మించి ఉండని నేపథ్యంలో పెంచిన పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ సామర్థ్యంతో పై రిజర్వాయర్లు 30 రోజులలో నిండి పై ప్రాజెక్టుల, రిజర్వాయర్ల ద్వారా సుమారు 7,50,000 ఎకరాల ఆయకట్టుకు నీరు అందాలన్నారు. అయితే శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ఉన్న 30 రోజులలో 40 టిఎంసీ ల నీటిని కూడా తరలించలేని పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎదైనా అతి కొద్ది సంవత్సరాలలో అత్యధిక వర్షాలు పడి శ్రీశైలం ప్రాజెక్టుకు వరద 100 రోజులు కొనసాగడం వలన, రిజర్వాయర్ల నిండా నీరు నింపగలిగినా ప్రభుత్వం, జలవనరుల శాఖ నిర్లక్ష్యం వలన 3,00,000 ఎకరాల ఆయకట్టుకు కూడా నీరందించలేని పరిస్థితి ఉందనీ దీనివలన రాయలసీమ సాగునీటి రంగం లక్ష్యాలను చేరలేకపోయిందన్నారు.
రాయలసీమ హక్కుగా ఉన్న నీటిని 30 రోజులలో తరలించడానికి సాగునీటి వ్యవస్థలోఉన్న ఇబ్బందులను తొలగించాల్సిన పాలకులు, రెగ్యులేటర్ల నీటి ప్రవాహాన్నే మార్చి కృష్ణాజలాలను నెల్లూరు వైపు తరలించే కార్యక్రమం చేపట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విధంగా కృష్ణాజలాలను తరలించే తరణంలో రాయలసీమలో మరింత బలవంతపు భూసేకరణ కుందూ, గాలేరు, తదితర నదులను కాలువగా మార్చే క్రమంలో మరింత పర్యావరణ నాశనానికి పాలకులు శ్రీకారం చేపట్టబోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. శ్రీశైలం ప్రాజెక్టు వెనుక జలాలను రాయలసీమకు అందించడానికి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ తో పాటు ఉన్న మరొక్క నిర్మాణం హంద్రీనీవా ఎత్తిపోతల పథకం.ఈ పథకం ద్వారా మల్యాల నుండి కృష్ణా జలాలను ఎత్తిపోసి 6,00,000 లక్షల ఎకరాలకు నీరందించాల్సి ఉంది. కానీ ఇందులో 15శాతం ఆయకట్టుకు నీరందకున్నా, పాలకులు పూర్తి స్థాయిలో ఆయకట్టుకు నీరు అందుతున్నదని బాకా ఊదేస్తున్నారని బొజ్జా ఎద్దేవా చేసారు.
ఈ నేపథ్యంలో హంద్రీనీవా, ఎస్‌ఆర్‌బీసీ తెలుగుగంగ, గాలేరునగరి ప్రాజెక్టల వాస్తవ పరిస్తితులను ఆయా ప్రాంత ప్రజా సంఘాల నాయకుల ద్వారా తెలుసుకునే ప్రయత్నంతో పాటు, అదేవిధంగా బానకచర్ల రెగ్యులెటర్ కాంప్లెక్స్ వద్ద రాయలసీమ నీటి హక్కులపై ఏ విధంగా దాడి జరిగిందో తెలుసుకునే ప్రయత్నం 16–09–2025 మంగళవారం ప్రజాసంఘాల ఆద్వర్యంలో బానకచర్ల క్రాస్ రెగ్యులెటర్ కాంప్లెక్స్ సందర్శన ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామని ప్రకటించారు. మంగళవారం జరిగే బానకచర్ల క్రాస్ రెగ్యులెటర్ కాంప్లెక్స్ సందర్శన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనీ, ఈ సందర్శన కార్యక్రమం ద్వారా మనం అవగాహన పెంచుకుని తద్వారా పాలకులపై ఒత్తిడి పెంచడానికి ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని బొజ్జా ప్రజలకు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సమితి ఉపాధ్యక్షులు వై.యన్.రెడ్డి, ఏరువ రామచంద్రారెడ్డి, చెరుకూరి వెంకటేశ్వర నాయుడు, మహేశ్వరరెడ్డి, నిట్టూరు సుధాకర్ రావు, భాస్కర్ రెడ్డి, మహమ్మద్ ఫర్వేజ్, కొమ్మా శ్రీహరి, పట్నం రాముడు, న్యాయవాది అసదుల్లా, రాఘవేంద్ర గౌడ్, జానో జాగో మహబూబ్ భాష పాల్గొన్నారు.