నిజంగానే విశాఖ వెలిగిపోతోందా?
విశాఖపట్నం ప్రాంతం పారిశ్రామిక, ఐటీ హబ్ గా మారిపోతోందనే ప్రచారం ఎక్కువైందనే విమర్శలు ప్రభుత్వంపై వెల్లువెత్తుతున్నాయి.;
Byline : G.P Venkateswarlu
Update: 2025-07-17 04:57 GMT
విశాఖపట్నం ప్రాంతం పారిశ్రామిక, ఐటీ హబ్ గా మారిపోతోందా? ఎప్పుడు, ఎక్కడ, ఎలా అని స్థానికులు ఆశ్చర్యపోతుంటే రాష్ట్ర వ్యాపిత ప్రచారం విశాఖ ఐటీ హబ్ గా మారిందనే ప్రచార హోరు మాత్రం ఎక్కువైందని రాజకీయ నేతలు విమర్శలు చేస్తున్నారు. ఇంతకీ వాస్తవం ఏమిటో ఓసారి చూద్దాం.
విశాఖపట్నం నగరం కేంద్రంగా టీసీఎస్ ద్వారా 12వేల ఉద్యోగాలు, కాగ్నిజెంట్ ద్వారా 8వేల ఉద్యోగాలు, ఉర్సా క్లస్టర్ ద్వారా 2500 ఉద్యోగాలు, గూగుల్ డేటా సెంటర్ కోసం కుదిరిన ఒప్పందం, 56 ఎకరాల్లో ఫిన్ టెక్ సిటీ, లూలూతో సహా మాల్స్, మల్టీఫెక్స్ లు, హోటల్స్, మెట్రో రైలు, మొత్తంగా విశాఖ పరిసరాల్లో 3.50 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు తెలుగుదేశం పార్టీ ప్రచారం చేస్తోంది.
అనకాపల్లి జిల్లా పూడిమడకలో గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు, నక్కపల్లిలో 55 వేల మందికి ఉపాధినిచ్చే ఆర్సెలార్ మిత్తల్ ప్రాజెక్టు, నక్కపల్లిలో బల్క్ డ్రగ్ ప్రాజెక్టు, అల్లూరి సీతారామరాజు జిల్లాలో పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టులు ఏర్పాటు అవుతున్నాయని త్వరలోనే లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయని తెలుగుదేశం పార్టీ జోరుగా ప్రచారం చేస్తోంది. ఈ ప్రచారం ఆరు నెలల నుంచి ఎక్కువైంది. విశాఖ రైల్వేజోన్ కూడా వచ్చిందని, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ను మరింత అభివృద్ధి చేస్తున్నారనే ప్రచారం కూడా జోరందుకుంది.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చినప్పుడల్లా విజన్ డాక్యుమెంట్లతో ప్రచారం చేయడం సహజమేనని పలువురు రాజకీయ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. నిత్యం ఇటువంటి ప్రచారాలతో కాలం గడపకుండా ఆచరణలోకి తీసుకు రావాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు పలు మార్లు డిమాండ్ చేశారు. విశాఖను ఐటీహబ్ గా మారుస్తామని చెబుతున్న మాటలు చాలా బాగున్నాయి. ఆచరణలో ఏడాదైనా అడుగు కూడా ముందుకు పడలేదని సీపీఐ కె రామకృష్ణ విమర్శించారు.
ప్రచారం సరే... ఆచరణ...
తెలుగుదేశం పార్టీ (టీడీపీ) విశాఖపట్నం నగరం చుట్టూ జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి సోషల్ మీడియా, ఇతర వేదికల ద్వారా జోరుగా ప్రచారం చేస్తోంది. ఈ ప్రచారంలో టీసీఎస్, కాగ్నిజెంట్, ఉర్సా క్లస్టర్, గూగుల్ డేటా సెంటర్, ఫిన్‌టెక్ సిటీ, మాల్స్, మల్టీప్లెక్స్‌లు, హోటల్స్, మెట్రో రైలు, రైల్వే జోన్, స్టీల్ ప్లాంట్ అభివృద్ధి, అలాగే అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో గ్రీన్ హైడ్రోజన్, ఆర్సెలార్ మిత్తల్, బల్క్ డ్రగ్, పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టులు వంటి భారీ పెట్టుబడులు, ఉద్యోగ అవకాశాలను ప్రముఖంగా ప్రస్తావిస్తోంది. ఈ ప్రచారం ఆరు నెలలుగా తీవ్రంగా సాగుతోంది.
ఉద్యోగ అవకాశాలు
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) విశాఖలో ఐటీ హిల్ నెంబర్ 3లో 21.16 ఎకరాల్లో రూ.1,370 కోట్ల పెట్టుబడితో క్యాంపస్ ఏర్పాటు చేస్తున్నట్లు టీడీపీ ప్రచారం చేస్తోంది. ఈ ప్రాజెక్టు ద్వారా 12,000 మందికి ఉద్యోగాలు వస్తాయని పేర్కొంది. టీసీఎస్ లాంటి ఐటీ దిగ్గజం భారీ క్యాంపస్‌ల ద్వారా పెద్ద సంఖ్యలో ఉద్యోగాలను సృష్టించగల సామర్థ్యం ఉంటుంది. అయితే ఈ ఉద్యోగాలు ఎప్పటికి వస్తాయి, ఎలాంటి ఉద్యోగాలు (సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు, సపోర్ట్ స్టాఫ్ మొదలైనవి) అనే అంశాలపై ప్రజలకు స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీపై ఉంది.
కాగ్నిజెంట్ కంపెనీ రూ.1,583 కోట్ల పెట్టుబడితో విశాఖలో క్యాంపస్ ఏర్పాటు చేసి 8,000 ఉద్యోగాలు సృష్టిస్తుందని టీడీపీ పేర్కొంది. కాగ్నిజెంట్ గతంలో ఇలాంటి పెట్టుబడులు పెట్టిన చరిత్ర ఉంది. ఈ ప్రాజెక్టు పూర్తయ్యే సమయం, ఉద్యోగాల స్వభావం గురించి ఇంత వరకు స్పష్టత లేదు.
ఉర్సా క్లస్టర్ ద్వారా 2,500 ఉద్యోగాలు వస్తాయని ప్రచారం జరుగుతోంది. ఈ కంపెనీ విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ కు సంబంధించిన కంపెనీ. ఫేక్ కంపెనీల్లో ఇదొకటని ఎంపీ అన్న, విజయవాడ మాజీ ఎంపీ కేశినేని శ్రీనివాస్ (నానీ) విమర్శలు చేస్తున్నారు.
నక్కపల్లిలో ఆర్సెలార్ మిత్తల్ స్టీల్ ప్లాంట్ ద్వారా 55,000 ఉద్యోగాలు వస్తాయని టీడీపీ పేర్కొంది. ఈ సంఖ్య చాలా ఆశాజనకంగా ఉన్నప్పటికీ, స్టీల్ ప్లాంట్ నిర్మాణం ఎప్పటికి పూర్తవుతుంది. ఇంత మందికి నిజంగా ఉద్యోగాలు వస్తాయా? వస్తే ఏ విధమైన ఉద్యోగాలు వస్తాయనే అంశంపై తెలుగుదేశం పార్టీ స్పష్టత ఇవ్వటం లేదు.
ఆర్సెలార్ మిత్తల్ వంటి భారీ పరిశ్రమలు ఇంత పెద్ద సంఖ్యలో ఉద్యోగాలను సృష్టించగలవా అనేది పరిశీలనలోకి తీసుకోవాలి. ఈ ప్రాజెక్టు పురోగతి, ఉద్యోగ సృష్టి, సమయం గురించి స్పష్టమైన సమాచారం లేకపోవడం ఈ ప్రచారం కాస్త అతిశయోక్తిగా కనిపిస్తోందని పలువురు పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.
ఇతర అభివృద్ధి ప్రాజెక్టులు
గూగుల్ క్లౌడ్ డేటా సెంటర్ ఏర్పాటు కోసం చర్చలు జరిగాయని, దీనికి సంబంధించి ఒప్పందం కుదిరినట్లు టీడీపీ పేర్కొంది. గూగుల్ క్లౌడ్ సేవలు విస్తరిస్తున్న నేపథ్యంలో ఇది సాధ్యమైనప్పటికీ, ఈ ప్రాజెక్టు పరిధి, ఉద్యోగ సృష్టి సామర్థ్యం గురించి వివరాలు ఎక్కడా కనిపించడం లేదు. 56 ఎకరాల్లో ఫిన్‌టెక్ సిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
లులూ గ్రూప్ షాపింగ్ మాల్, హైపర్ మార్కెట్‌ల నిర్మాణానికి భూమి కేటాయింపులు జరిగాయి. ఇవి నగర ఆర్థిక వ్యవస్థకు ఊతం ఇవ్వవచ్చు, అయితే ఉద్యోగ సృష్టి పరంగా వీటి ప్రభావం పరిమితంగా ఉంటుందని చెప్పాల్సిందే. ఈ ఉద్యోగాలు కుటుంబ పోషణకు పెద్దగా పనికొచ్చేవి కాదనే ప్రచారం ఉంది.
విశాఖపట్నంలో మెట్రో రైలు ప్రాజెక్టును ప్రతిపాదించారు. దీనికి సంబంధించి పనులు జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇది రవాణా సౌకర్యాలను మెరుగుపరిచే అవకాశం ఉంది. ఉద్యోగాల కల్పనలో ప్రత్యక్షంగా చెప్పుకునేంతగా ఉద్యోగాలు వచ్చే అవకాశం లేదు.
దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని, శంకుస్థాపనలు జరిగాయని తెలుగుదేశం పార్టీ ప్రచారం చేస్తోంది. ఇది ఆర్థిక వృద్ధికి దోహదపడవచ్చు. అయితే ఉద్యోగాలు ఎంత మాత్రం ఉంటాయనే స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది.
కేంద్ర ప్రభుత్వం రూ.11,440 కోట్ల ప్యాకేజీతో స్టీల్ ప్లాంట్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు ప్రకటించింది. ఇది ఉన్న ఉద్యోగాలను కాపాడుతుందని, కొత్త అవకాశాలను సృష్టిస్తుందని టీడీపీ చెబుతోంది. కానీ ఈ ప్యాకేజీ అమలు పురోగతి గురించిన సమాచారం ఎక్కడా లేదు.
అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లా ప్రాజెక్టులు గ్రీన్ హైడ్రోజన్, బల్క్ డ్రగ్, పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టులు ఆర్థిక వృద్ధికి దోహదపడతాయని, లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయని టీడీపీ ప్రచారం చేస్తోంది. అయితే ఈ ప్రాజెక్టులు ఇంకా ప్రారంభ దశలో ఉన్నాయని, ఉద్యోగ సృష్టి సంఖ్యలు అంచనాలపై ఆధారపడి ఉన్నాయని చెప్పాలి.
టీడీపీ చేస్తున్న ఈ విధమైన ప్రచారం ఆ పార్టీకి లాభాన్ని చేకూరుస్తుందా? నష్టం చేకూరుస్తుందా? వేచి చూడాల్సిందే.