విజయవాడ పార్కుల్లో ఉట్టిపడుతున్న పల్లె శోభ!

పరవశిస్తున్న పట్టణ జనం;

Update: 2025-09-14 13:39 GMT
విజయవాడ రాజీవ్ పార్క్ గోడపై చిత్రించిన పల్లె సోయగం
ఈమధ్య మీరెప్పుడైనా విజయవాడ బస్టాండ్ పక్కనున్న రాజీవ్ పార్క్ వైపు వెళ్లారో లేదో.. ఒకవేళ వెళ్లినా ఆ రణగొణ ధ్వనుల మధ్య ఆ పార్క్ గోడల్ని చూశారో లేదో గాని ఆ గోడలపై పల్లె జీవనం, ప్రకృతి సోయగం ఉట్టిపోడుతోంది. పరికించి చూస్తే వాటి సోయగం ముందు మన మనసు కచ్చితంగా రంజిల్లుతుంది.

విజయవాడ రాజీవ్ పార్క్ ఇప్పుడు కేవలం ఒక పార్క్ మాత్రమే కాదు. అక్కడి గోడలు ఆకాశం కింద నిలుచున్న ప్రకృతి జీవంతో తొణికిసలాడుతున్నాయి. నిజంగా చెప్పాలంటే ఓ చిత్రశాల అని చెప్పవచ్చు. ఎరుపు, పసుపు, ఆకుపచ్చ, నీలం రంగులు కలగలిపిన ఈ కుడ్య చిత్రాలు కనువిందు చేస్తున్నాయి.

గులాబీ గోడపై పసుపు, నీలం, ఆకుపచ్చ రంగుల అద్భుత సమ్మేళనం ఈ రంగు రంగుల పక్షి. చూసే వారిని మైమరపిస్తుంది. నిజంగానే ఆ పక్షి క్షణంలో ఎగిరిపోతుందేమో అన్న అనుభూతి కలుగుతుంది.
సంస్కృతి ప్రతిబింబం
ఇంకొంచెం ముందుకు వెళితే అదే గోడపై మనకు గిరిజనులు సంప్రదాయ నృత్యంతో స్వాగతం పలుకుతారు. నాట్యరంగపు కదలికలు కనిపిస్తాయి. పురాతన భారతీయ కళల సౌందర్యం వీధిగోడలపై తిరిగి జీవం పోసుకుంది. ఇది కేవలం పెయింటింగ్ కాదు, మన సంస్కృతికి ఓ అద్దం.

ఒక మూలలో, మంచి నీళ్ల బిందెల్ని తలమీద పెట్టుకుని వెళ్లే గ్రామీణ మహిళలు, మరో మూలలో పచ్చని చెట్ల మధ్య కట్టిన మట్టి ఇల్లు కనువిందు చేస్తోంది. పల్లెటూరి సాయంత్రాలు, మన చిన్ననాటి స్మృతులు తిరిగి మదిలో మెదులుతాయి.

మరో గోడపై పసుపు చీర కట్టుకున్న ఇల్లాలు రుబ్బుతో పిండి రుబ్బే చిత్రం కనిపిస్తుంది. రుబ్బురోలు, పత్రం, పిడి, సాదాసీదా గృహజీవనం కనుమరుగవుతున్న దశలో భావితరాలకు తెలియజేసేలా చిత్రీకరించారు. శ్రమతో నిండిన రోజువారీ జీవితాన్ని గుర్తు చేస్తుంది.

ఈ గోడచిత్రాలు పట్టణపు బీభత్సమైన సిమెంట్ గోడలకు కొత్త శ్వాసనిచ్చాయి. రోజూ వెళ్ళే రోడ్డే అయినా, ఇప్పుడు అది ఒక కల్చరల్ గ్యాలరీగా మారింది.

ఆగి చూస్తే ప్రతి ఒక్కరూ తమని ఆ చిత్రాల్లో చూసుకోవచ్చు..
(ఫోటోలు- రవి, ది ఫెడరల్ అప్)
Tags:    

Similar News