’ఆపరేషన్ కగార్’ ను బేషరుతుగా ఉపసంహారించాలి: విజయవాడలో రౌండ్ టేబుల్

ఫిబ్రవరి 13న రాష్ట్ర వ్యాప్త ధర్నాలు, నిరసన కార్యక్రమాలకు పిలుపు;

By :  Admin
Update: 2025-02-03 16:15 GMT

భారతదేశ విశాల అటవీ ప్రాంతాల్ని బడా కార్పొరేట్లకు కట్టబెట్టే లక్ష్యంతో ఆపరేషన్ కగార్ ను కేంద్ర ప్రభుత్వం తలపెట్టిందని దీని కోసం ఆదివాసీలపై ప్రత్యక్ష సైనిక యుద్ధం చేస్తూ అడవుల్ని నెత్తుటి క్షేత్రంగా మార్చుతున్న మారణకాండకు మరోపేరు అని ఈరోజు విజయవాడలో ఏర్పాటు చేసిన ఒక రౌండ్ టేబుల్ అభిప్రాయపడింది. వెంటనే ' కగార్ ఆపరేషన్ ' ను బేషరుతుగా ఉపసంహరించాలని డిమాండ్ చేసింది.

రౌండ్ టేబుల్ సమావేశం లో సిపిఐ(ఎమ్-ఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర అధికారం ప్రతినిధులు పి.ప్రసాద్, చిట్టిపాటి వెంకటేశ్వర్లు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు అక్కినేని వనజ, పౌరహక్కుల సంఘం రాష్ట్ర కార్యదర్శి సిహెచ్ చంద్రశేఖర్, లిబరేషన్ రాష్ట్ర నాయకులు హరనాధ్, ఒపీడీర్ జాతీయ నాయకులు సి.భాస్కరరావు, ఎంసిపీఐ (యూ) నాయకులు ఖాధర్ భాషా, రెడ్ ఫ్లాగ్ పార్టీ నాయకులు మరీదు ప్రసాద్, ఒపీడీర్ రాష్ట్ర అధ్యక్షులు నుండి హనుమంతరావు, విరసం అరసవల్లి కృష్ణ, ఎంసీపీఐ నుండి కె గణేష్, హెచ్.ఆర్.ఎఫ్ నుండి రోహిత్, కె.ఎన్.పి.ఎస్ నుండి కృష్ణ, ప్రోగ్రెసివ్ ఫోరమ్ నుండి తాజారావు, నాస్తీక సమాజం నుండి డి. భాస్కరరావు, అమర వీరుల బంధు మిత్రుల సంఘం నుండి అంజమ్మ, పివోడబ్ల్యూ నుండి ఎమ్. లక్ష్మి, పీడీఎమ్ నుండి వెంకటేశ్వర్లు, సిఎల్సి నుండి శ్రీమన్నారాయణ, ఐఫ్టూ నుండి కె. పోలారి తదితరులు పాల్గొన్నారు.



రౌండ్ టేబుల్ డిమాండ్స్:

1) గత ఏడాదిగా బస్తరు అబుజ్మడ్ అడవుల్లో ఊచకోత సాగుతున్నది. మావోయిస్టుల కోసం అనాగరిక వేట సాగిస్తూ, ఆ పేరిట ఆదివాసీల్ని వందల సంఖ్యలో బూటకపు ఎదురు కాల్పుల పేరిట హత్య చేస్తున్నది. ఈ అన్ని దారుణ హత్యా సంఘటనల మీద సుప్రీంకోర్టు వెంటనే జోక్యం చేసుకొని న్యాయ విచారణ జరపాలని కోరుతున్నాం.
2) ఆదివాసీ హక్కుల పరిరక్షణ కోసం గతంలో ఆమోదించిన అనేక చట్టాలు, ఉత్తర్వులు, శాసనాలు, చట్ట సవరణల్ని క్రమంగా నీరుగార్చుతున్న లేదా రద్దు చేస్తున్న కేంద్ర ప్రభుత్వ చర్యలన్నింటినీ వ్యతిరేకిస్తున్నాం. ఆదివాసీల మనుగడకూ, జీవనోపాధికీ గతంలో తెచ్చిన చట్టబద్ద సౌకర్యాలు అన్నింటినీ పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నాం.
3) ప్రకృతి సమతుల్యత, పర్యావరణ పరిరక్షణ ప్రజలందరి ఉమ్మడి సమస్యలుగా భావించి అడవుల్ని ప్రభుత్వ ఆస్తిగా కొనసాగించుటకు చర్యలు చేపట్టాలి. కార్పొరేట్ల ఆస్తిగా మారితే ప్రకృతి సమతుల్యత, పర్యావరణం మరింత కోల్పోయే ప్రమాద నివారణకై ఈ డిమాండ్ చేస్తున్నాం.
4) ' ఆపరేషన్ కగార్ ' కు ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ సహకరించ రాదని చంద్రబాబు కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఏ.పి.లో కూడా అటవీ ప్రాంతాల సంపదను కార్పొరేట్లకు కట్టబెట్టే ప్రయత్నాల్నీ ఉపసంహరించుకోవాలనీ ఈ రౌండ్ టేబుల్ సభ డిమాండ్ చేస్తున్నది.
5) ఆపరేషన్ కగార్ ని తక్షణమే ఉపసంహరించాలనీ, అందులో భాగంగా ఎదురుకాల్పుల పేరిట జరిగే మారణకాండను కూడా వ్యతిరేకిస్తూ ఈనెల 13న రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు చేపట్టి నిరసన వ్యక్తం చేయాలని రాష్ట్ర ప్రజలకూ, రాజకీయ పార్టీలకూ, ప్రజాతంత్ర వాదులకూ, శక్తులకూ, బృందాలకూ ఈ రౌండ్ టేబుల్ సభలో పాల్గొన్న వామపక్ష పార్టీలు, హక్కుల సంఘాలు, ప్రజా సంఘాలు ఉమ్మడి వేదికగా విజ్ఞప్తి చేశాయి.
పనుల వత్తిడి కారణంగా హాజరు కాలేక పోయిన మరికొన్ని పార్టీలు, సంఘాలు కూడా ఈ కార్యక్రమానికి మద్దతు ప్రకటించాయి.
సమస్య పై సానుకూల భావాన్ని వ్యక్తం చేస్తూనే తమ పార్టీ రాష్ట్ర మహాసభలో ఉండి రాలేకపోతున్న పరిస్థితిని సిపిఎం తెలిపింది. వేరొక పనివల్ల హాజరురాలేని వడ్డే శోభనాద్రీశ్వర్రావు కూడా తన మద్దతు ఉంటుందని తెలిపారుకేంద్ర ప్రభుత్వం పై జరుగుతున్న ఫాసిస్టు వ్యతిరేక పోరాటంలో భాగంగా కలసి వచ్చే పార్టీలను, సంఘాలను కలుపుకొని ఈ నిరసన ఆందోళనల్ని జరపాలని సమావేశం భావించింది. 


Tags:    

Similar News