బీజేపీ నేతకే విజయసాయిరెడ్డి సీటు
రేపు నామినేషన్లు వేసేందుకు ఆఖరి రోజు. ఒక్క రోజు ముందు అభ్యర్థిగా పాకా వెంకటసత్యనారాయణను ఖరారు చేశారు.;
By : The Federal
Update: 2025-04-28 15:16 GMT
మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ ఎంపీ సీటును ఎవరి కేటాయిస్తారనే దానిపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. కూటమి భాగస్వామి పార్టీలైన టీడీపీకి దక్కుతుందా? జనసేనకు ఇస్తారా? లేదా బీజేపీకి ఇస్తారా? అనేది పెద్ద చర్చనీయాంశంగా మారింది. వీటన్నింటికీ తెరదించుతూ కూటమిలో బీజేపీకి ఈ సీటును ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. బీజేపీ సీనియర్ నాయకుడు పాకా వెంకటసత్యనారాయణకు ఈ సీటును ఖరారు చేస్తూ అభ్యర్థిగా ప్రకటించింది. మంగళవారం ఆయన నామినేషన్‌ను దాఖలు చేయనున్నారు.
విజయసాయిరెడ్డి రాజీనామాతో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒక రాజ్యసభ సీటు ఖాళీ అయ్యింది. ఈ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఆ మేరకు ఇప్పటికే షెడ్యూల్‌ను కూడా విడుదల చేసింది. షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 29 నాటికి నామినేషన్ దాఖలు చేసుకునేందుకు ఆఖ రోజు. మే 2 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుంది. మే 9న ఎన్నిక నిర్వహిస్తారు. అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ఉంటుంది. అనంతరం విజేతను ప్రకటిస్తారు. మంగళవారం నామినేషన్‌లకు ఆఖరి రోజు కావడంతో ఒక రోజు ముందు అభ్యర్థిని ఖరారు చేస్తూ ప్రకటించడం గమనార్హం.
జూన్ 2028 వరకు పదవీ కాలం ఉండగా, అంత కంటే ముందే విజయసాయిరెడ్డి తన రాజ్యసభ స్థానానికి రాజీనామా చేశారు. ఇది అప్పట్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ సీటు ఎవరికి కేటాయిస్తారనే దానిపై ఏపీ రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చే జరిగింది. జనసేన అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు ఈ సీటును కేటాయించి, తర్వాత ఆయనను కేంద్ర మంత్రి వర్గంలోకి తీసుకుంటారని, పవన్ కల్యాణ్‌కు బదులుగా ఆయన సోదరుడు ఎమ్మెల్సీ నాగబాబుకు ఏపీ మంత్రి వర్గంలో చోటు కల్పిస్తారని, పవన్ కల్యాణ్ సేవలను బీజేపీ దేశ వ్యాప్తంగా ఉపయోగించుకోవాలనే ఉద్దేశంలో ఉందనే టాక్ వినిపించింది.
వైసీపీకి, రాజ్యసభకు రాజీనామా చేసిన విజయసాయిరెడ్డిని బీజేపీలోకి తీసుకొని ఆయనకే తిరిగి రాజ్యసభ సీటు కేటాయిస్తారనే చర్చ కూడా నడిచింది. తమిళనాడుకు చెందిన ఓ బీజేపీ నాయకుడికి కూడా ఈ సీటును కేటాయించే అవకాశం ఉందనే టాక్ కూడా నడిచింది. అయితే వీటన్నింటికీ తెరదించుతూ ఆంధ్రప్రదేశ్‌కే చెందిన బీజేపీ నాయకుడు పాకా వెంకటసత్యనారాయణను అభ్యర్థిగా ఖరారు చేశారు. ఆ మేరకు బీజేపీ సెంట్రల్ ఆఫీసు నుంచి సోమవారం రాత్రి ప్రకటనను విడుదల చేశారు.
పాకా వెంకటసత్యనారాయణ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సీనియర్ బీజేపీ నాయకుడు. ప్రస్తుతం ఈయన క్రమశిక్షణ కమిటీ చైర్మన్‌గా ఉన్నారు. ఈయన గౌడ్ సామాజిక వర్గానికి చెందిన వారు. ఎంఏ సోషల్ వర్క్ చేశారు. భీమవరానికి చెందిన వారు. 1976లో ఆర్‌ఎస్‌ఎస్ ప్రచారక్‌గా ప్రస్థానం ప్రారంభించిన ఆయన తర్వాత ఏబీవీపీలో విద్యార్థి నాయకుడిగా పని చేశారు. తర్వాత బీజేపీలో చేరి బీజేపీ రాష్ట్ర నాయకుడిగా ఎదిగారు.