ఏసీబీ విచారణకు హాజరైన విజయ్‌కుమార్
గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన అధికారుల్లో ఈయన కూడా ఒకరనే విమర్శలు ఉన్నాయి.;
By : Admin
Update: 2025-04-02 09:14 GMT
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో సమాచార ప్రసార శాఖ(ఐ అండ్ పీఆర్) కమిషనర్‌గా పని చేసిన తుమ్మా విజయ్‌కుమార్‌రెడ్డి బుధవారం ఏసీబీ విచారణకు హాజరయ్యారు. ఏసీబీ విచారణకు హాజరు కావాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆయనకు ఆదేశాలు జారీ చేయడంతో ఏసీబీ విచారణకు హాజరయ్యారు.
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో ఐ అండ్ పీఆర్ కమిషనర్‌గా పని చేసిన తుమ్మా విజయ్ కుమార్‌రెడ్డి అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై కూటమి ప్రభుత్వం తొలుత విజిలెన్స్ అధికారులను రంగంలోకి దింపింది. విచారణ చేపట్టి నివేదికను సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో రంగంలోకి దిగిన విజిలెన్స్ విభాగం ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేశారని నివేదికను సమర్పించింది. వైఎస్ జగన్ హయాంలో ప్రభుత్వ ప్రకటన జారీలు, బిల్లులు చెల్లింపుల విషయాల్లో జగన్ సొంత సంస్థలైన సాక్షి పత్రిక, సాక్షి టీవీ చానళ్లకు భారీ స్థాయిలో లబ్ధి చేకూర్చారని, సాక్షి మీడియా గ్రూపు సిబ్బందిని అడ్డ దారుల్లో ప్రభుత్వ విభాగమైన ఐ అండ్ పీఈర్, ఏపీ డిజిటల్ కార్పొరేషన్‌లలో ఎంప్లాయిస్‌గా నియమించి, వారికి ఐ అండ్ పీఆర్ నుంచే జీతాలు చెల్లించారని నివేదికలో వెల్లడించారు. 2019–24 మధ్య కాలంలో తక్కిన ప్రతికలకు ఇచ్చిన ప్రభుత్వ ప్రకటనల్లో దాదాపు 43 శాతం, అంటే దాదాపు రూ. 371.12 కోట్ల విలువైన ప్రకటనలు కేవలం ఒక్క సాక్షి పత్రికకే ఇచ్చారని, తక్కిన టీవీ చానళ్లన్నింటికీ కలిపి రూ. 26.71 కోట్ల విలువైన ప్రకటనలు ఇస్తే.. వాటిల్లో సాక్షితో పాము మరో రెండు టీవీ చానళ్లకు దాదాపు రూ. 16.17 కోట్ల విలువైన ప్రకటనలు జారీ చేసినట్లు నివేదికలో పేర్కొన్నారు.
ఈ క్రమంలో విజిలెన్స్ నివేదిక ఆధారంగా విచారణ చేపట్టాలని ఏసీబీని రంగంలోకి దింపింది. సమగ్ర విచారణ చేపట్టి నిగ్గు తేల్చాలని ఏసీపీబి ఆదేశించింది. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన ఏసీబీ సాక్షి దినపత్రికకు, సాక్షి మీడియాకు అడ్డుగోలు ప్రభుత్వ ధనాన్ని దోచి పెట్టారని, సాక్షి సిబ్బందికి కూడా ఐ అండ్ పీఆర్ డిపార్ట్‌మెంట్ నుంచి జీతాలు చెల్లించారు, దాదాపు రూ. 859 కోట్లు వరకు ప్రభుత్వ ఖజానాకు తీవ్ర నష్టం చేకూర్చారనే అభియోగాల మీద విజయ్ కుమార్‌రెడ్డిపై గత ఏడాది నవంబరులో ఏసీబీ కేసు నమోదు చేసింది. అనంతరం మార్చి 18న విచారణకు హాజరు కావాలని విజయ్‌కుమార్‌రెడ్డికి నోటీసులు జారీ చేసింది. అయితే విచారణకు విజయ్‌కుమార్‌రెడ్డి హాజరు కాలేదు. తీరిక చూసుకొని విచారణకు హాజరు అవుతాననే రీతిలో ఏసీబీకి సమాధానం ఇచ్చారు.
ఈ నేపథ్యంలో తుమ్మా విజయ్ కుమార్‌రెడ్డి జనవరిలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. ఏసీబీ కేసుల నుంచి అరెస్టు కాకుండా తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. తనపై తప్పుడు కేసులు నమోదు చేశారని, తనను ఏసీపీ అధికారులు అరెస్టు చేస్తారనే ఆందోళన ఉందని, కోర్టు విధించే షరతులకు కట్టుబడి ఉంటానని, ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని పిటీషన్‌లో పేర్కొన్నారు. దీని మీద విచారణ చేపట్టిన హైకోర్టు ఏసీపీ విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. మరో వైపు ఏసీబీ మరో సారి విజయ్‌కుమార్‌రెడ్డికి మార్చి ఆఖరి వారంలో నోటీసులు జారీ చేసింది. ఏప్రిల్ 2న గుంటూరులోని ఏసీబీ రీజినల్ కార్యాలయానికి వచ్చి విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేసింది. కేసు విచారణకు అవసరమైన డాక్యుమెంట్లు ఇవ్వడంతో పాటు దర్యాపునకు సహకరించాలని, లేని పక్షంలో అరెస్టు చేస్తామని ఏసీబీ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో విజయ్‌కుమార్‌రెడ్డి ఏసీబీ విచాణకు హాజరయ్యారు.