రేవంత్ కు వాస్తు సమస్యలా ?

రేవంత్ ఇకనుండి వెస్ట్ గేట్ లో నుండి లోపలికి ప్రవేశించి నార్త్ ఈస్ట్ గేట్ నుండి బయటకు వెళతారు.

Update: 2024-06-03 11:04 GMT

వినటానికే విచిత్రంగా ఉంది. ఇపుడు విషయం ఏమిటంటే సచివాలయంలో వాస్తు మార్పులు మొదలయ్యాయి. ఇప్పటివరకు సెక్రటేరియట్ మెయిన్ గేట్ నుండి రేవంత్ రెడ్డి సెక్రటేరియట్ లోపలికి వెళుతున్నారు అలాగే బయటకు వస్తున్నారు. మరి ఏ పండితుడు లేకపోతే సిద్ధాంతి సలహా ఇచ్చారోగాని ఇపుడు వాస్తు ప్రకారం మార్పులు చేస్తున్నారు. రేవంత్ ఇకనుండి వెస్ట్ గేట్ లో నుండి లోపలికి ప్రవేశించి నార్త్ ఈస్ట్ గేట్ నుండి బయటకు వెళతారు. అలాగే ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు సౌత్ ఈస్ట్ గేటులో నుండి రాకపోకలు సాగించబోతున్నారు. రేవంత్ ముఖ్యమంత్రి అయిన ఏడు మాసాల తర్వాత సచివాలయంలో వాస్తుమార్పులు చేయటం ఆశ్చర్యంగా ఉంది.

నిజానికి మనిషిరాత (జాతకం) బలంగా ఉంటే వాస్తుమార్పులతో పనిలేదని చాలామంది చెబుతుంటారు. పైగా వాస్తుమార్పులు ఎన్ని చేయించుకున్నా జరగాల్సింది జరగకమానదని కేసీయార్ వ్యవహారం చూసిన వాళ్ళకి బాగానే అర్ధమయ్యుంటుంది. వాస్తుమార్పులు, పూజలు, హోమాలు, యాగాలు చేయించటంలో కేసీయార్ తర్వాతే ఇంకెవరైనా. వాస్తు ప్రకారం సరిగాలేదని కేసీయార్ చాలాసార్లు సచివాలయానికి మార్పులు చేయించారు. చివరకు సచివాలయంలోని భవనాలన్నింటినీ కూలగొట్టించి తనకు కావాల్సినట్లుగా వాస్తు ప్రకారం కొత్త భవనాలు కట్టించారు. కొత్త సచివాలయానికి సుమారు రు. 700 కోట్లు ఖర్చయిందనే ప్రచారంపై ప్రతిపక్షాలు మండిపడిన విషయం తెలిసిందే. ఎన్ని పూజలు, యాగాలు, హోమాలు చేయించినా, వాస్తు ప్రకారం కొత్త సచివాలయాన్ని కట్టించినా కేసీయార్ కు ఓటమి తప్పలేదు.

ఈమధ్యనే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు 39 సీట్లు మాత్రమే వచ్చిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. సచివాలయానికి వాస్తుమార్పులు చేయించటమే కాకుండా పార్టీ కార్యాలయానికి కూడా చాలాసార్లు మార్పులు చేయించారు. ఎంతచేయించినా బీఆర్ఎస్ కు ఓటమి తప్పలేదు. ఇదే సమయంలో ఎలాంటి వాస్తుమార్పులు చేయించకుండానే, యాగాలు, హోమాలు చేయించకపోయినా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. వాస్తుమార్పులతో ఎలాంటి పట్టింపులు లేకుండానే ముఖ్యమంత్రయిన రేవంత్ ఏడుమాసాల తర్వాత సచివాలయంలో మార్పులు చేయించటమే విచిత్రంగా ఉంది. మరి చేస్తున్న మార్పులు రేవంత్ కు ఎంతమాత్రం అచ్చివస్తాయో చూడాల్సిందే. ముఖ్యమంత్రిగా ఉన్నపుడు కేసీయార్ సచివాలయంలోని 6వ అంతస్తులో ఉండేవారు. ఇపుడు రేవంత్ తన ఆపీసును తొమ్మిదో అంతస్తులోకి మారుస్తున్నారు. దీనికి సంబంధించిన పనులు జరుగుతున్నాయి. తొందరలోనే ఇతర భవనాలతో పాటు సెక్రటేరియట్లో వాస్తుప్రకారం మరికొన్ని మార్పులు జరగబోతున్నట్లు సమాచారం.

Tags:    

Similar News